సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం ఉదయం 5.30 గంటలకు ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అలాగే, అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రానున్న 48 గంటల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. దీంతో సముద్రంలో అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు.
🚨 ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం: APSDMA హెచ్చరిక 🚨
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది :రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
🌧️ ఉత్తరాంధ్ర జిల్లాలలో 2రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.#lowpressure pic.twitter.com/5UKhlBU2l6— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 10, 2026
మరోవైపు.. తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గురువారం (సెప్టెంబర్ 10) రాష్ట్రవ్యాప్తంగా వేడి, ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతూనే.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలుచోట్ల అక్కడక్కడా వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన ఉరుములు కనిపించే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 11, 12 తేదీల్లో రాష్ట్రానికి భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. సెప్టెంబర్ 13న కూడా ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల హెచ్చరిక కొనసాగనుంది. ఇక, హైదరాబాద్‌లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది.
SEPTEMBER 10, 2026 FORECAST ⚠️⛈️
HOT and HUMID conditions to continue even today across Telangana
Scattered MODERATE RAINS and THUNDERSTORMS expected in North, East TG like Bhadradri - Kothagudem, Mahabubabad, Mulugu, Bhupalapally, Khammam, Adilabad, Asifabad, Mancherial,…— Telangana Weatherman (@balaji25_t) September 10, 2026


