మార్క్‌ఫెడ్‌కు మామిడి భారం ‘అంటు’గట్టిన ప్రభుత్వం | Chandrababu Govt: Mango Farmers Burden on Markfed | Sakshi
Sakshi News home page

మార్క్‌ఫెడ్‌కు మామిడి భారం ‘అంటు’గట్టిన ప్రభుత్వం

Sep 10 2026 5:42 AM | Updated on Sep 10 2026 5:42 AM

Chandrababu Govt: Mango Farmers Burden on Markfed

తోతాపురి రైతుకు కిలోకు రూ.4 ప్రోత్సాహకం ప్రకటించిన చంద్రబాబు

ఇందుకు అవసరమైన రూ.281 కోట్లను ఏకంగా మార్క్‌ఫెడ్‌ నుంచి రుణం తీసుకున్న వైనం

రైతుల సంస్థను ‘ఏటీఎం’గా మార్చుకున్న కూటమి సర్కారు

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు బడ్జెట్‌ బయట అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీపీఎఫ్‌సీఎల్‌) హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఉన్న పంజాబ్‌–సింధ్‌ బ్యాంక్‌ నుంచి రూ.500 కోట్ల అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అప్పు మొత్తం కాలపరిమితికి గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసలు, వడ్డీ మొత్తానికి ప్రభుత్వ గ్యారంటీ వర్తిస్తుంది. ఏపీపీఎఫ్‌సీఎల్‌ తమ సొంత వనరుల నుంచి అప్పు, వడ్డీని చెల్లించాల్సి ఉంది. వాటిని చెల్లించడంలో ఏపీపీఎఫ్‌సీఎల్‌ విఫలమైతే ప్రభుత్వ గ్యారంటీ అమల్లోకి వస్తుంది. గ్యారంటీ మొత్తానికి ఐదు శాతం కమీషన్‌ చెల్లించాల్సి ఉంది.   

తోతాపురి మామిడికి కిలోకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తామంటూ గొప్పగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ భారాన్ని ఏపీ మార్క్‌ఫెడ్‌పైకి నెట్టింది. ఆ మేరకు అవసరమైన రూ.281 కోట్లను వర్కింగ్‌ క్యాపిటల్‌ లేదా స్వల్పకాలిక రుణాల ద్వారా సమీకరించుకునేందుకు ప్రభు­త్వం మార్క్‌ఫెడ్‌కు అనుమతినిస్తూ వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్‌ బుధవా­రం ఉత్తర్వులు జారీచేశారు.  2026–27 మార్కెటింగ్‌ సీజన్‌లో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో 7.03 లక్షల మెట్రిక్‌ టన్నుల తోతాపురి మామిడికి కిలోకు రూ.4 చొప్పున ధర లోటు పథకం కింద చెల్లించనున్నారు. మార్కెట్‌లో పంటల ధరలు పతనమైనప్పుడు జోక్యం చేసుకొని మద్దతు ధర కల్పించాల్సిన మార్క్‌ఫెడ్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఏటీఎంగా మార్చుకుంది. 

ఎప్పుడుపడితే అప్పుడు ఈ సంస్థ ద్వారా రుణాలు తీసుకోవడం, వాటిని ఇతర కార్పొరేషన్లు, ఇతర కార్యకలాపాలకు మళ్లించడం పరిపాటిగా మార్చుకుంది. మార్క్‌ఫెడ్‌లో రూ.10 కోట్లుగా ఉన్న ప్రభుత్వ వాటామొత్తాన్ని రూ.30 కోట్లకు పెంచిన ప్రభుత్వం, రుణపరపతిని ఏకంగా రూ.21వేల కోట్లకు పెంచింది. ఇప్పటికే ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా తీసుకున్న రూ.13,853 కోట్ల రుణాన్ని పౌరసరఫరాల శాఖకు మళ్లించింది. ఇలా తీసుకున్న రుణంలో రూ.200 కోట్లను విత్తన సేకరణ కోసం మళ్లించింది.  తాజాగా ఏపీ మార్క్‌ఫెడ్‌కు ఏ మాత్రం సంబంధం లేని తోతాపురి మామిడి రైతులకు ధరల లోటు పథకం కింద కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహక రూపంలో చెల్లించేందుకు రూ.281 కోట్ల రుణ భారా­న్ని అంటగట్టడంపై విమర్శలు వినిపిస్తున్నా­యి. మార్కెట్‌లో ధరలు పడిపోతే చేతులెత్తేస్తున్న ప్రభుత్వం అప్పుల కోసం మాత్రం మార్క్‌ఫెడ్‌పై ఆధారపడడమేమిటని ప్రశ్నిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement