50% పైన రిజర్వేషన్లను ఎలా సమర్థించుకుంటారు? | AP High Court pointed question to Chandrababu government | Sakshi
Sakshi News home page

50% పైన రిజర్వేషన్లను ఎలా సమర్థించుకుంటారు?

Sep 10 2026 5:56 AM | Updated on Sep 10 2026 11:30 AM

AP High Court pointed question to Chandrababu government

సాక్షి, అమరావతి: బీసీ తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్నామని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు ఆ కమిషన్‌ నివేదిక ఆధారంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎలా ఉత్తర్వులు జారీ చేస్తా­రని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కమిషన్‌ నివేదికను పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉందని చెబుతూనే, ఆ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు సమంజమని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కమిషన్‌ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని కూడా హైకోర్టు  ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అందులో అంత రహస్యం ఏముందని ప్రశ్నించింది. కమిషన్‌ నివేదికలోని బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి గణాంకాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేశారో చెప్పాలని స్పష్టంచేసింది.  స్థానిక ఎన్నికలకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై బుధవారం విచారణ జరిపిన  సీజే ధర్మాసనం, అసలు రిజర్వేషన్లు 50 శాతం దాటడాన్ని ఎలా సమర్థించుకుంటారో కూడా చెప్పాలని ఆదేశించింది.  తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

తుది ఓటర్ల జాబితానే ఎన్నికలకు ప్రాతిపదిక కావాలి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీరాం 
కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పూర్తయి తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ పిటిషన్‌ దాఖలు చేసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున సీనియర్‌ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరాం వాదనలు వినిపిస్తూ, తాము స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం లేదన్నారు. ‘ప్రస్తుతం జరుగుతున్న సర్‌ పూర్తయి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం.  తద్వారా సర్‌లో ప్రాథమికంగా ఓటు కోల్పోయిన వారు, అప్పీల్‌ చేసుకుని తుది ఓటర్ల జాబితాలో స్థానం పొందే అవకాశం ఉంటుంది.  తాము దాఖలు చేసిన ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే, ఎన్నికల కమిషన్‌ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది.  ఇదే జరిగితే మా వ్యాజ్యం నిరర్థకం అవుతుంది.  గతంలో ఇలాగే పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది’ అని శ్రీరాం విన్నవించారు. ఆయన వాదనలను ఏకీభవించిన ధర్మాసనం, ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే పిటిషన్‌ నిరర్థకం అవుతుందని, అందులో సందేహం లేదంది. అందువల్ల ఇప్పటికిప్పుడు ఎన్నికలు నోటిఫికేషన్‌ విడుదల కాదనే భావిస్తున్నామని తెలిపింది. 

మిషన్‌ నివేదిక అందకుండా వాదనలు ఎలా చేయగలం 
శాస్త్రీయంగా బీసీ జనగణన చేపట్టకుండా ఎన్నికలు నిర్వహించరాదని, ఆ దిశగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. శంకరరావు తరఫు సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను ప్రభుత్వం ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదని,  ఈ నివేదికను పరిశీలించకుండా వాదనలు వినిపించడం సాధ్యం కాదని విన్నవించారు. 

ప్రభుత్వ జీవోలు సరికాదు 
స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్‌ పిల్‌ వేశారు. ఇటీవల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ కూడా యోగేష్‌ మరో పిల్‌ వేశారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఈ సందర్భంగా వివరించారు.  

నెపాన్ని కోర్టుపై నెట్టేయాలనే దురాలోచన 
కృష్ణా జిల్లాకు చెందిన వెంకట నరసింహ శర్మ పిల్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో ఆయన తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజీవ్‌ రంజన్‌ కమిషన్‌ నివేదికను తొక్కిపెడుతోందన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రిజర్వేషన్లు 50 శాతం దాటేలా ఉత్తర్వులిచ్చిందన్నారు. రేపు కోర్టు ఈ ఉత్తర్వులను కొట్టేస్తే, ‘మేం రిజర్వేషన్లు ఇచ్చాం.. కోర్టు కొట్టేసింది.. మమ్మల్ని ఏం చేయమంటారు’ అంటూ నెపాన్ని కోర్టుపై నెట్టేయాలన్నదే ప్రభుత్వ దురాలోచన అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement