ఆ స్కూల్‌ నాదే.. ఆ వైపు వెళ్లకండి! | Trellis School Girl Incident In Anantapur | Sakshi
Sakshi News home page

ఆ స్కూల్‌ నాదే.. ఆ వైపు వెళ్లకండి!

Sep 10 2026 2:19 PM | Updated on Sep 10 2026 2:37 PM

Trellis School Girl Incident In Anantapur

బాధితురాలి తల్లి

అనంతపురం: నగరంలోని ట్రెల్లీస్‌ పాఠశాలలో బాలికపై అక్కడ పనిచేస్తున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి వేధించాడన్న అభియోగాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో తరగతి చదువుతున్న బాలిక బాత్రూంకు వెళ్లిన సమయంలో అక్కడ శుభ్రత పనులు చేసే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ తర్వాత కూడా బాలికను వేధించాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి వద్ద బాలిక ముభావంగా ఉండటాన్ని గమనించిన తల్లి ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

‘చిన్న విషయం’గా ఎలా చూస్తారు? 
తమ కుమార్తెపై జరిగిన అఘాయిత్యాన్ని పాఠశాల యాజమాన్యం చిన్న విషయంగా చూస్తోందని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కరస్పాండెంట్‌ వడ్ల శ్రీకాంత్‌ , డైరెక్టర్‌ అనిల్‌ తేజ  తమ ఫిర్యాదుపై సరిగా స్పందించలేదన్నారు. ప్రశ్నిస్తే తమకు రాజకీయ, పోలీసు అధికారుల అండ ఉందంటూ బెదిరించారన్నారు. పోలీసులను ఆశ్రయించినప్పటికీ సమస్యను చిన్నదిగా చూడటం బాధ కలిగించిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందన్నారు.
   
ఆ స్కూల్‌ నాదే.. ఆ వైపు వెళ్లకండి! 
అనంతపురం సెంట్రల్‌:  నగరంలో ట్రెల్లీస్‌ స్కూల్‌లో వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఓ ద్వితియ శ్రేణి టీడీపీ నాయకుడు పెద్దస్థాయిలో మంత్రాంగం నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రెలీస్‌సూ్కల్‌ యాజమాన్యం జీసస్‌ నగర్, బళ్లారి బైపాస్‌ రోడ్డులో బ్రాంచులు నడుపుతోంది. గత 20 రోజులుగా స్కూల్‌లో విద్యార్థులపై వరుస ఘటనలు జరుగుతున్నాయి. 

గత నెల 22న బళ్లారి బైపాస్‌ బ్రాంచ్‌లో 10వ తరగతి చదువుతున్న హర్షిత్‌ అనే విద్యార్థిపై తోటి విద్యార్థి విచక్షణా రహితంగా దాడి చేశాడు. కంటి వద్ద బలమైన గాయమైంది. పిల్లలు కొట్టుకున్నా.. విద్యార్థికి తీవ్ర గాయమైనా స్కూల్‌ యాజమాన్యం పట్టించుకోలేదు. పైగా టీసీ తీసుకొని వెళ్లిపోండి అంటూ బెదిరించారు. దీంతో బాధిత విద్యార్థి తల్లి నాగలక్ష్మి న్యాయం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీజగదీష్ ను కలిసి వినతిపత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకూ కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇక ఇటీవల బాత్రూమ్‌కు వెళ్లిన ఓ బాలికపై అక్కడ పనిచేసే సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించాడు.    

రంగంలోకి టీడీపీ నేత  
ట్రెల్లీస్‌ యాజమాన్యంపై చర్యలు లేకుండా     ఉండేందుకు అధికార టీడీపీకి చెందిన నేత      రంగంలోకి దిగాడు. సదరు స్కూల్‌లో తనకూ వాటా ఉందని పోలీసులతో బేరసారాలకు దిగాడు. ఇందుకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పేరు వాడుకొని పోలీసు స్టేషన్లలో దుప్పటి పంచాయితీలు చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం రాణినగర్‌లో జరిగిన డీజే వివాదంలో కూడా అటు పోలీసులకు.. ఇటు బాధితులకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం. గత కొంతకాలంగా ఇతనికి పోలీసులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపస్తున్నాయి. అందులో భాగంగానే ట్రెల్లీస్‌ స్కూల్‌యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. పోలీసులు చట్టపరంగా కేసు నమోదు చేశామని చెబుతున్నా... నిందితుని అరెస్ట్‌.. యాజమాన్యంపై కేసులు నమోదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.      

చదవండి: స్కామ్‌పై సర్కారు సైలెన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement