భారీ పుర్రె.. చిన్న వేట! టాస్మేనియన్‌ టైగర్‌ కథేంటి? విన్నారంటే షాకే! | Tasmanian Tiger Skull Reveals New Secrets About Thylacine | Sakshi
Sakshi News home page

భారీ పుర్రె.. చిన్న వేట! టాస్మేనియన్‌ టైగర్‌ కథేంటి? విన్నారంటే షాకే!

Sep 11 2026 2:33 AM | Updated on Sep 11 2026 2:33 AM

Tasmanian Tiger Skull Reveals New Secrets About Thylacine

కప్పుడు ఆస్ట్రేలియాలో సంచరించిన టాస్మేనియన్‌ టైగర్‌ ఇప్పుడు భూమిపై లేదు. దాదాపు 90 ఏళ్ల క్రితమే ఈ జంతువు పూర్తిగా అంతరించిపోయింది. అయితే తాజాగా దాని పుర్రె, దవడను పరిశీలించిన పరిశోధకులు.. ఈ జంతువు గురించి ఇప్పటివరకు ఉన్న కొన్ని అంచనాలు తప్పని గుర్తించారు. ముఖ్యంగా ఇది చూడటానికి కుక్క లేదా తోడేలులా ఉన్నప్పటికీ, వాటిలా జీవించేది కాదని పరిశోధకులు చెబుతున్నారు.

టాస్మేనియన్‌ టైగర్‌ను మరో పేరుతో ‘థైలాసిన్‌’ అని పిలుస్తారు. దీనికి శరీరంపై పులిలా చారలు ఉండటంతో టాస్మేనియన్‌ టైగర్‌ అనే పేరు వచ్చింది. అయితే ఇది నిజమైన పులి కాదు. ఇది కంగారూ, కోయాలా వంటి సంచిలో పిల్లలను పెంచే మార్సుపియల్‌ జంతువు. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగంలో ఇవి సుమారు 2,000 ఏళ్ల క్రితమే కనుమరుగైనప్పటికీ, టాస్మేనియా ప్రాంతంలో మాత్రం మరికొంతకాలం జీవించాయి.

ఈ జంతువును అప్పట్లో రైతులకు నష్టం చేసే ప్రమాదకరమైన వేటగాడిగా భావించేవారు. ముఖ్యంగా గొర్రెలను చంపుతున్నాయని పెద్ద సంఖ్యలో థైలాసిన్‌లను వేటాడారు. దీంతో వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. చివరకు 1936లో టాస్మేనియాలోని హోబార్ట్‌ జూలో ఉన్న చివరి థైలాసిన్‌ కూడా చనిపోయింది. అప్పటి నుంచి ఈ జాతి పూర్తిగా అంతరించిపోయినట్లుగా పరిగణిస్తున్నారు.

అయితే తాజా పరిశోధనలో వాటి పుర్రెను పరిశీలించిన శాస్త్రవేత్తలకు ఆసక్తికరమైన విషయం తెలిసింది. టాస్మేనియన్‌ టైగర్‌ పుర్రె శరీర పరిమాణంతో పోలిస్తే చాలా పెద్దగా ఉండేదట. కానీ దాని ముక్కు పొడవుగా, సన్నగా ఉండేది. ఈ నిర్మాణం పెద్ద జంతువులతో పోరాడి వాటిని పడగొట్టేందుకు కాకుండా.. చిన్న జంతువులను వేగంగా పట్టుకుని కొరికేందుకు ఉపయోగపడేదని పరిశోధకులు చెబుతున్నారు.

గతంలో టాస్మేనియన్‌ టైగర్‌ బరువు దాదాపు 30 కిలోల వరకు ఉండేదని భావించారు. కానీ కొత్త అంచనాల ప్రకారం వాటి సగటు బరువు సుమారు 17 కిలోలు మాత్రమే. అంటే ఇవి మనం ఊహించేంత పెద్ద జంతువులు కావు. కుందేలు లేదా అంతకంటే కొంచెం పెద్ద పరిమాణంలో ఉండే జంతువులను వేటాడేందుకు వీటి దవడ, పళ్లు బాగా సరిపోయేవని పరిశోధకులు చెబుతున్నారు. వేగంగా నోరు తెరిచి ఒక్కసారిగా కొరికే సామర్థ్యం వీటికి ఉండేదని వారు గుర్తించారు.

టాస్మేనియన్‌ టైగర్‌ చరిత్ర కూడా చాలా పురాతనమైనదే. దాని పూర్వీకులు ఇతర క్షీరదాల నుంచి కోట్ల సంవత్సరాల క్రితమే విడిపోయినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే బయటకు కుక్కలా కనిపించినా.. దాని శరీర నిర్మాణం, జీవించే విధానం పూర్తిగా భిన్నంగా ఉండేవి. ఒకేలా కనిపించే రెండు జంతువులు పరిణామ క్రమంలో ఎంత భిన్నమైనవిగా మారగలవో ఈ జంతువు మంచి ఉదాహరణ అని పరిశోధకులు చెబుతున్నారు.

ఇక అంతరించిపోయిన టాస్మేనియన్‌ టైగర్‌ను మళ్లీ భూమిపైకి తీసుకురావచ్చా అనే అంశంపైనా ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. పురాతన డీఎన్‌ఏ, జన్యు సాంకేతికత, ఆధునిక పునరుత్పత్తి విధానాలను ఉపయోగించి ఈ జాతిని తిరిగి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇది నిజంగా సాధ్యమవుతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా.. టాస్మేనియన్‌ టైగర్‌పై జరుగుతున్న పరిశోధనలు మాత్రం అంతరించిపోయిన జంతువుల జీవితం, పరిణామం గురించి ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:  ‘డాల్ఫిన్‌ గార్డ్‌’..! ఆరేళ్ల చిన్నారి ఘనత..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement