ఒక సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది | hanuman ansh producer anupriya nagar success story | Sakshi
Sakshi News home page

ఒక సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది

Sep 11 2026 4:44 AM | Updated on Sep 11 2026 4:44 AM

hanuman ansh producer anupriya nagar success story

న్యూస్‌మేకర్‌

సినిమా అంటేనే ఒక లాటరీ!  అందులో జాక్‌పాట్‌ కొట్టినవాళ్లు రాత్రికి రాత్రే చరిత్ర పుటల్లోకి ఎక్కిపోతారు. నిన్నమొన్నటి వరకు అనుప్రియ నాగర్‌ అంటే ఎవరో ప్రపంచానికి తెలియదు. కానీ ఇవాళ బాక్సాఫీస్‌ వద్ద 150 కోట్లతో వసూళ్ల సునామీ సృష్టించిన సంచలన ప్రొడ్యూసర్‌. కేవలం 2 కోట్లతో తీసిన ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. అసలు ఎవరీ అనుప్రియ నాగర్‌? లండన్‌లో చదువుకుంటూ  సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది?  ఇదిగో ఆ క్రేజీ సక్సెస్‌ స్టోరీ...

మామూలు ఘటనలే ఒక్కోసారి మిరకిల్స్‌గా మారతాయి. లేదా మిరకిల్స్‌ జరుగుతూ ఉండగా అవి మామూలు ఘటనలనే భ్రమను కలిగిస్తాయి. ‘నీమ్‌ కరోలి బాబా’ గా ఖ్యాతి చెందిన ఆధ్యాత్మిక గురువు ‘మహరాజ్‌జీ’పై తీసిన సినిమాతో ఇన్‌వాల్వ్‌ అయిన వారంతా తమకు ఎదురైన ఘటనలను మిరకిల్స్‌గానే చూస్తున్నారు. 

ఆ సినిమాను తీయాలని దర్శకుడు డాక్టర్‌ విశాల్‌ చతుర్వేది 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికి సాధ్యమైంది. నీమ్‌ కరోలిబాబా పాత్ర కోసం ఒక ముఖ్యమైన నటుణ్ణి అనుకుంటే అతను జబ్బుపడి తప్పుకున్నాడు. సెట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న శోభిత్‌ శ్రీవాస్తవకు ఆ వేషం దక్కింది. ఇప్పుడతను దేశమంతా తెలిశాడు. ఇక నిన్న మొన్నటివరకూ లండన్  బాత్‌ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌ చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థిని అనుప్రియ నాగర్‌ అనుకోకుండా ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌ అయి సూపర్‌హిట్‌ తన ఖాతాలో వేసుకుంది. ‘బాబానే నన్ను ఈ పనికి ఎంచుకున్నాడు’ అని ఆమె కృతజ్ఞతతో పులకించిపోతోంది. కొన్ని సినిమాలు ప్రజల వద్దకు గొప్ప ఆదరణతో చేరడం అన్నింటికంటే పెద్ద మిరాకిల్‌. ఆ మిరాకిల్‌లో ఒక భాగమైంది అనుప్రియ నాగర్‌.

నీమ్‌ కరోలి బాబా
ఎప్పుడూ ఒంటి మీద కంబళితో కనిపించే నీమ్‌ కరోలిబాబా హనుమంతుడి పరమ భక్తుడిగా జీవించి 1973లో లోకాన్ని వీడారు. ఆయన జీవితకాలంలో, తర్వాత ఆయన సన్నిధి వద్ద భక్తులు ఎన్నో దివ్య అనుభవాలు పొందిన కథనాలు ఉన్నాయి. ఆయన ఆశ్రమానికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. ‘ప్రేమించు’, ‘సేవ చెయ్‌’ అని ఉపదేశించిన బాబా జీవితాన్ని సినిమాగా తీస్తున్నప్పుడు బాబా చేసిన పనులను కేవలం ‘చమత్కారాలు’గా కాకుండా, భగవంతుని ‘లీలలు’గా చూపించడం ప్రేక్షకులను విపరీతంగా కట్టి పడేసింది.  

డిజాస్టర్‌ టాక్‌ 
‘హనుమాన్‌ అంశ్‌’ విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమాను ఇండస్ట్రీ ‘డిజాస్టర్‌’ అని డిక్లేర్‌ చేసింది. ‘మొదటిరోజు 355 షోలతో ప్రారంభమైన మా సినిమా ఎనిమిదో రోజుకు 29 షోలకు పడిపోయింది. పెద్ద సినిమాల్లా ప్రమోషన్స్ చేయడానికి మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. థియేటర్ల నుంచి తీసేస్తారనుకున్న టైమ్‌లో సినిమా చూసిన ప్రేక్షకులే పెద్ద విప్లవాన్ని తెచ్చారు. మూడోవారం నుంచి ఊహించని విధంగా పబ్లిక్‌ టాక్‌తో కలెక్షన్లు పెరిగి 156 కోట్లకు చేరాయి. ప్రేక్షకులే ఈ సినిమాకు పీఆర్‌ టీమ్‌గా మారి గెలిపించారు. ప్రేక్షకులు స్వయంగా వాట్సాప్, సోషల్‌ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేస్తూ థియేటర్లకు క్యూ కట్టారు. కలెక్షన్లు ఒక్కసారిగా 22 శాతం పెరిగి, చూస్తుండగానే 150 కోట్ల మార్కును దాటేసింది’ అంది అనుప్రియ.
 
స్టీవ్‌ జాబ్స్‌ ఇచ్చిన ఐడియా
అనుప్రియ నాగర్‌ తన చదువులో భాగంగా టెక్‌ కంపెనీల గురించి ఒక ప్రెజెంటేషన్‌ ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఆపిల్‌ సంస్థ స్టీవ్‌ జాబ్స్‌కు, ఫేస్‌బుక్‌ జుకర్‌బర్గ్‌కు నీమ్‌ కరోలిబాబా ఆశీర్వాదం ఉందని తెలుసుకుంది. స్టీవ్‌జాబ్స్, జుకర్‌బర్గ్‌ తమ కెరీర్‌లు మొదలెట్టడానికి ముందు నైనిటాల్‌కు సమీపంలో ఉన్న నీమ్‌ కరోలిబాబా ఆశ్రమస్థలం ‘కైంచిధామ్‌’కు వెళ్లి వచ్చినవారే. ‘అరె... నా దేశంలోని ఒక ఆధ్యాత్మిక గురువు గురించి విదేశీయుల ద్వారా నేను తెలుసుకోవాలా? నా దేశస్తులకు ఈ ఆధ్యాత్మిక గురువు గురించి నేను చెప్పాలి. ముఖ్యంగా జెన్‌ జికి చెప్పాలి’ అనుకుంది అనుప్రియ. అప్పటినుంచి బాబా గురించి తెలుసుకుంటూ ఆయనపై పుస్తకం రాయాలని ఇండియా చేరుకుంది. అప్పటికే దర్శకుడు విశాల్‌ చతుర్వేది ‘హనుమాన్‌ అంశ్‌’ పేరుతో బాబా మీద సినిమాను దాదాపు పూర్తిచేసి నిధుల కొరతతో ఉన్నాడని తెలుసుకుని తనే నిర్మాతగా మారింది.

సమాజానికి ఇవ్వడమే...
ఇన్ని కోట్ల రూపాయలు ఏం చేసుకుంటారు అని అడిగితే ‘నేను 21 ఏళ్ల అమ్మాయిని. ఇంత డబ్బు నేనేం చేసుకుంటాను? సమాజానికి తిరిగి ఇచ్చేస్తాను. పిల్లల విద్య, వైద్యం కోసం ఒక ప్రత్యేక ఫౌండేషన్‌ పెడుతున్నాను’ అని ప్రకటించింది అనుప్రియ. భవిష్యత్తులో కూడా కేవలం భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలపైనే సినిమాలు తీస్తానని బాస చేసింది. ఒక సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె సమాజ హితవుకు అవసరమైన మార్పు కోసం పని చేయడమే మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement