breaking news
Family News
-
లేవగానే ఫోన్ ఎందుకు చూస్తాం?
ఉదయం కళ్లు తెరిచిన వెంటనే చాలామందికి తెలియకుండానే చేయి ఫోన్ వైపు వెళ్తుంది. అలారం ఆపిన వెంటనే.. వాట్సాప్ మెసేజ్‌లు, ఇన్స్టాగ్రామ్.. ఈమెయిల్స్ చెక్ చేయడం.. ఆఖరికి వాతావరణం ఎలా ఉందో చూడడం రోజువారీ అలవాటుగా మారిపోయింది. చాలామంది దీన్ని “మొబైల్ అడిక్షన్” భావిస్తారు. కానీ సైకాలజీ నిపుణుల ప్రకారం.. కాదంట!. ఉదయం లేవగానే ఫోన్ చూడాలనే కోరిక వెనుక కేవలం వ్యసనం మాత్రమే ఉండదు. అలవాటు, ఆసక్తి, అనిశ్చితిని తగ్గించుకోవాలనే మెదడు స్వభావం, కొత్త సమాచారం కోసం ఎదురుచూపు వంటి అనేక మానసిక అంశాలు పనిచేస్తాయి.రాత్రంతా ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆత్రుత.. మనిషి మెదడు సహజంగానే అనిశ్చితిని ఇష్టపడదు. మనం నిద్రలో ఉన్న సమయంలో ప్రపంచం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎవరైనా మెసేజ్ పంపి ఉండొచ్చు.. ముఖ్యమైన వార్త వచ్చి ఉండొచ్చు.. ఆఫీసు నుంచి మెయిల్ వచ్చి ఉండొచ్చు.. మరుసటి రోజు ప్లాన్ మారి ఉండొచ్చు. లేవగానే ఫోన్ చూడటం ద్వారా మన మెదడు ‘‘ఏమైనా ముఖ్యమైన విషయం జరిగిందా?’’ అనే సందేహానికి సమాధానం వెతుకుతుంది.ఉదాహరణకు.. ముఖ్యమైన ఇంటర్వ్యూ లేదా పరీక్ష ఉన్న రోజు లేవగానే ఫోన్ చెక్ చేయాలనే కోరిక మరింత ఎక్కువగా ఉంటుంది. కారణం.. ఆ రోజు గురించి ఏదైనా కొత్త సమాచారం వచ్చిందేమో తెలుసుకోవాలనే మెదడు ప్రయత్నం.అలవాటు ఎలా బలపడుతుంది?సైకాలజీలో దీనిని హ్యాబిట్ లూప్ (Habit Loop) అంటారు. ఒకే పని ఒకే సందర్భంలో పదేపదే చేయడం వల్ల అది క్రమంగా ఆటోమేటిక్‌గా మారుతుంది.ఇక్కడ:సంకేతం (Cue): ఉదయం నిద్ర లేవడంచర్య (Routine): ఫోన్ చెక్ చేయడంబహుమతి (Reward): కొత్త మెసేజ్, నోటిఫికేషన్, ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోవడం.. ఈ మూడు కలిసి ఒక అలవాటుగా మారతాయి.కొంతకాలానికి ఫోన్లో ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉంటుందని మెదడు ముందుగానే ఊహిస్తుంది. దీంతో ఉదయం లేవగానే ఫోన్ చూడాలనే అలవాటు మరింత బలపడుతుంది.ఏదో ఒకసారి వచ్చే ‘రివార్డ్’ మరింత ఆకర్షిస్తుంది.. ఫోన్ చెక్ చేసిన ప్రతిసారీ ఆసక్తికరమైన విషయం కనిపించకపోయినా.. అప్పుడప్పుడు వచ్చే మంచి అనుభవం ఆ అలవాటును కొనసాగిస్తుంది. ఒక రోజు పాత స్నేహితుడి నుంచి మెసేజ్ రావచ్చు. మరో రోజు ముఖ్యమైన ఈమెయిల్ ఉండొచ్చు. ఇంకో రోజు ఆసక్తికరమైన వీడియో కనిపించొచ్చు. ఇలా ఎప్పుడు ఏ కొత్త విషయం కనిపిస్తుందో తెలియకపోవడం వల్లే మెదడు మళ్లీ మళ్లీ ఫోన్ వైపు ఆకర్షితమవుతుంది. సైకాలజీలో దీనిని వేరియబుల్ రివార్డ్ (Variable Reward) అంటారు.ప్రపంచంతో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు.. నిద్రలో ఉన్నప్పుడు మనిషి కొంత సమయం ప్రపంచానికి దూరంగా ఉంటాడు. లేవగానే ఫోన్ చూడటం ద్వారా చాలామంది తమ చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం సమయం ఎంత?, వాతావరణం ఎలా ఉంది?, ఎవరైనా కాల్ చేశారా?, ఈరోజు ఏ పనులు ఉన్నాయి?.. ఇలా రోజును ప్రారంభించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఫోన్ ఒక సాధనంగా మారింది.అయితే ఇది ఆరోగ్యకరమైన అలవాటేనా?ఉదయం ఫోన్ చూడటం అనేది సాధారణ అలవాటే అయినప్పటికీ.. అది ఎంతసేపు కొనసాగుతుందన్నదే ముఖ్యం. లేవగానే రెండు నిమిషాలు ముఖ్యమైన విషయాలు చూసి పక్కన పెట్టడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ అదే అలవాటు 45 నిమిషాల పాటు సోషల్ మీడియా స్క్రోలింగ్‌గా మారితే.. దృష్టి, ఉత్పాదకత, మానసిక స్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఫోన్ చూడటం అంటే అడిక్షన్ కాదు!లేవగానే ఫోన్ కోసం వెతకడం మాత్రమే చూసి దాన్ని వ్యసనంగా పరిగణించలేమని నిపుణులు చెబుతున్నారు. నిజమైన మొబైల్ అడిక్షన్ అంటే నియంత్రణ కోల్పోవడం, అవసరం లేకున్నా పదేపదే ఉపయోగించడం, దాని వల్ల రోజువారీ జీవితంపై ప్రతికూల ప్రభావం పడటం వంటి లక్షణాలు ఉండాలి. అందుకే.. ఉదయం ఫోన్ వైపు చేయి వెళ్లడం వెనుక కేవలం అలవాటు మాత్రమే కాదు.. మెదడు కొత్త సమాచారం కోసం చేసే సహజ ప్రయత్నం కూడా ఉంటుంది. -
బాస్కే బాస్ ఎవరు?
అడవిలో పులి అడుగుపెడితేనే చాలా జంతువులు అప్రమత్తమవుతాయి. నిశ్శబ్దంగా కదులుతూ.. క్షణాల్లో వేటను ముగించే సామర్థ్యం దాని సొంతం. బలమైన పంజా, పదునైన గోర్లు, శక్తివంతమైన దవడలతో పులి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వేటగాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ అడవిలో అసలు నిజం వేరే ఉంది.. ఎంతటి శక్తివంతమైన జీవికైనా ప్రకృతిలో ఒక సవాల్ తప్పదు. అడవికి బాస్‌గా పేరున్న పులి కూడా కొన్ని జంతువుల ముందు ఆచితూచి అడుగు వేయాల్సిందే.భారీ శరీరం, అపారమైన బలం, సమూహంగా కదిలే శక్తి, ఊహించని దూకుడు.. ఇలా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న జీవులు పులికి కూడా ఎదురుదెబ్బ ఇవ్వగలవు. అవసరం లేని పోరాటాలకు పులి కూడా దూరంగా ఉంటుంది.. ఎందుకంటే అడవిలో ప్రతి గాయం ప్రాణాలకే ముప్పు కావచ్చు. తన వేట నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచే ఈ ‘పెద్ద పిల్లి’కి సైతం కొన్ని జంతువులు గట్టి సవాల్‌గా నిలుస్తాయి. అంతర్జాతీయ పులుల దినోత్సవం(International Tiger Day, Global Tiger Day) సందర్భంగా.. పులిని కూడా వెనక్కి తగ్గించే ఆ జంతువులు ఏవో తెలుసుకుందాం.అడవిలో అత్యంత శక్తివంతమైన జీవుల్లో ఏనుగు ఒకటి. భారీ శరీరం, అపారమైన బలం, తెలివి కారణంగా ఏనుగులు చాలా జంతువులకు సవాల్ విసురుతాయి. సాధారణంగా పులులు పెద్ద ఏనుగులపై దాడి చేయవు. ముఖ్యంగా ఏనుగుల మందలోకి వెళ్లడం పులికి ప్రమాదకరం. చిన్న ఏనుగు పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం జరిగినా.. తల్లి ఏనుగు, మొత్తం మంద కలిసి పులిని తరిమికొట్టగలవు. ఒక్కసారి ఏనుగు దాడి చేస్తే.. పులికి తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఏనుగుల సమూహాన్ని చూసినప్పుడు పులి కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటుంది.పులికి అసలైన పరీక్ష ఇదే..పులికి ఇష్టమైన ఆహారాల్లో అడవి దున్న (గౌర్) ఒకటి. అయితే దాన్ని వేటాడటం అంత సులభమైన విషయం కాదు. భారీ శరీరం, బలమైన కాళ్లు, పదునైన కొమ్ములు అడవి దున్నకు ప్రధాన ఆయుధాలు. ఒక పెద్ద అడవి దున్న ఎదురుదాడికి దిగితే పులికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే పులులు సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్ద అడవి దున్నలపై కాకుండా.. బలహీనంగా ఉన్నవి, ఒంటరిగా ఉన్నవాటిపై దృష్టి పెడతాయి.మొసలితో మామూలుగా ఉండదుభూమిపై పులి ఎంత శక్తివంతమైనదైనా.. నీటిలో పరిస్థితులు మారిపోతాయి. పెద్ద మొసళ్లు తమ పరిధిలో అత్యంత ప్రమాదకరమైనవి. నదులు, చెరువుల్లోకి దిగినప్పుడు పులి కూడా మొసలి దాడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటిలో మొసలి బలం, దాని ఆకస్మిక దాడి పులికి ముప్పుగా మారుతుంది. అయితే పులులు కూడా మంచి ఈతగాళ్లే. అవసరమైతే నదులను దాటి వేట కొనసాగించగల సామర్థ్యం వాటికి ఉంటుంది.ఊహించని ప్రత్యర్థికొన్ని అడవి ప్రాంతాల్లో పులులు, ఎలుగుబంట్లు ఒకే ఆవాసాన్ని పంచుకుంటాయి. ముఖ్యంగా స్లోత్ బేర్ (ఎలుగుబంటి) చాలా దూకుడుగా స్పందించే జంతువు. ఆహారం లేదంటే ప్రాంతం విషయంలో ఎదురుపడినప్పుడు ఎలుగుబంటి వెనక్కి తగ్గకపోవచ్చు. దాని బలమైన గోర్లు, దూకుడు స్వభావం కారణంగా పులి కూడా ఇలాంటి ఘర్షణలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.మరి సింహం పులిని ఓడించగలదా?పులి, సింహం మధ్య ఎవరు బలమైనవారు అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. శారీరక బలం, ఒంటరి వేట విషయంలో పులికి కొంత ఆధిక్యత ఉంటుందని చెబుతారు. అయితే సింహం బలం వేరే. అది గుంపుగా జీవిస్తుంది. ఒక సింహం కంటే.. మొత్తం గుంపుగా ఉన్న సింహాలు చాలా ప్రమాదకరం. పులి, సింహం ఎదురుపడితే ఎవరు గెలుస్తారనే దానికి ఖచ్చితమైన సమాధానం లేదు. వాటి పరిమాణం, వయసు, ఆరోగ్యం, పరిస్థితులపై ఫలితం ఆధారపడి ఉంటుంది.పులి అసలు బలం ఏంటి?పులి గొప్పతనం కేవలం దాని బలంలో లేదు.. దాని వ్యూహంలో ఉంది. ఒంటరిగా జీవించే ఈ జంతువు సహనం, తెలివి, సమయస్ఫూర్తితో వేటాడుతుంది. తనకంటే పెద్ద జంతువులను కూడా సరైన సమయం చూసి ఎదుర్కోగలదు. కానీ అవసరం లేని పోరాటాలకు వెళ్లదు. ఎందుకంటే అడవిలో ప్రతి గాయం దాని ప్రాణాలకు ముప్పే. అడవిలో శాశ్వతంగా బాస్ ఎవరూ ఉండరు. ప్రతి జీవికి ఒక బలం ఉంటుంది.. అదే సమయంలో ఒక సవాలు కూడా ఉంటుంది. -
బోసి మెడ.. ఖాళీ చేతులు.. ఇదేం అలవాటు?
చేతికి వాచ్ లేదు.. వేళ్లకు ఉంగరాలు కనిపించవు.. మెడలో చైన్, చెవులకు ఆభరణాలు కూడా ధరించరు.. ఇలాంటి వారిని చూసినప్పుడు చాలామందికి ఒకే ప్రశ్న వస్తుంది.. “ఇదేం అలవాటు?” అని. కొందరు వీరికి ఫ్యాషన్‌పై ఆసక్తి ఉండదని అనుకుంటారు. కానీ ఆభరణాలకు దూరంగా ఉండటానికి కేవలం ఫ్యాషన్ కారణమే కాదు.. ఇతర కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.సైకాలజీ ప్రకారం.. ఒక వ్యక్తి ఏ వస్తువులు ధరిస్తారు.. ఏవి ధరించరు అన్నది వారి వ్యక్తిగత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించొచ్చు. కొందరికి చేతికి వాచ్, బ్రేస్లెట్, ఉంగరం వంటి వస్తువులు పెట్టుకోవడం అసౌకర్యంగా అనిపిస్తుంది. రోజువారీ పనుల్లో అవి ఇబ్బందిగా అనిపించడం, శరీరంపై అదనంగా ఏదైనా ఉండటం ఇష్టం లేకపోవడం వంటి కారణాలతో వాటికి దూరంగా ఉంటారు.ముఖ్యంగా సింపుల్ జీవనశైలిని ఇష్టపడేవారు తక్కువ వస్తువులతోనే ఉండాలని కోరుకుంటారు. వారికి ఆర్భాటం కంటే సౌకర్యం, స్వేచ్ఛ, సమయం ముఖ్యమని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.ఫ్యాషన్ అంటే వ్యతిరేకత కాదు!ఆభరణాలు ధరించని వారంతా ఫ్యాషన్‌కు వ్యతిరేకమని భావించడం తప్పు. కొందరు తమ రూపాన్ని సహజంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. మరికొందరు దుస్తులు, అలంకరణ కంటే వ్యక్తిత్వం, పనితీరు, ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాగే కొందరికి చిన్నప్పటి నుంచి అలాంటి అలవాటే ఉండొచ్చు. కుటుంబ వాతావరణం, పెరిగిన తీరు, వ్యక్తిగత అనుభవాలు కూడా ఇలాంటి అభిరుచులపై ప్రభావం చూపుతాయి.ఆర్థిక కారణాలు కూడా ఉండొచ్చు!ఆభరణాలకు దూరంగా ఉండటానికి ఆర్థిక కారణాలు కూడా ఒక అంశం కావచ్చు. బంగారం, వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కొందరు అవసరమైన ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తూ ఆభరణాల కొనుగోలును పక్కన పెడతారు. మరికొందరు ఆభరణాలు కొనుగోలు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. వాటిపై డబ్బు ఖర్చు చేయడం కంటే పొదుపు, పెట్టుబడులు లేదంటే ఇతర అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఎవరైనా ఆభరణాలు ధరించకపోతే దాన్ని కేవలం వారి అభిరుచితోనే ముడిపెట్టలేమని నిపుణులు చెబుతున్నారు.తక్కువ వస్తువులు.. తక్కువ ఆందోళనకొంతమంది జీవితంలో మినిమలిజం (తక్కువ వస్తువులతో సరళంగా జీవించడం)ను పాటిస్తారు. ఎక్కువ వస్తువులను నిర్వహించడం కంటే అవసరమైన వాటితోనే జీవించడం వారికి ఇష్టం. ఇలాంటి వారు దుస్తులు, ఆభరణాలు, ఇతర వస్తువుల ఎంపికలో కూడా సరళతకు ప్రాధాన్యం ఇస్తారు.అయితే ఆభరణాలు ధరించని వ్యక్తి తప్పనిసరిగా అంతర్ముఖి అని, సామాజికంగా కలవలేడని చెప్పలేం. అదే విధంగా ఆభరణాలు ఎక్కువగా ధరించే వారు ఆర్భాటాన్ని ఇష్టపడతారని కూడా భావించకూడదు.అలవాటు వెనుక కారణం ఒక్కటే కాదు..మనిషి ప్రవర్తన అనేది అనేక అంశాల కలయిక. వ్యక్తిగత అభిరుచులు, సౌకర్యం, ఆర్థిక పరిస్థితులు, జీవన విధానం.. ఇలా ఎన్నో విషయాలు కలిసి ఒకరి అలవాట్లను నిర్ణయిస్తాయి. అందుకే బోసి మెడ, ఖాళీ చేతులు కనిపిస్తే దాని వెనుక ఒకే కారణం ఉందని భావించకూడదు. అది వారి స్వంత ఎంపిక కావచ్చు.. వారి జీవనశైలిలో భాగం కావచ్చు.(గమనిక: ఇవి సైకాలజీ, ప్రవర్తనా విశ్లేషణల ఆధారంగా చెప్పే సాధారణ అంశాలు మాత్రమే. ఒక్క అలవాటుతో ఒకరి వ్యక్తిత్వం లేదంటే ఆర్థిక పరిస్థితిని నిర్ణయించలేం.) -
వేగంగా తింటున్నారా? ఇది మీ కోసమే..
ఉదయం హడావుడి.. ఆఫీసుకు వెళ్లే తొందర.. సమయం సరిపోకపోవడం.. ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. కానీ కొందరి భోజనం చేసే స్టైల్ మాత్రం అందరికీ కనిపిస్తుంది. పక్కన కూర్చున్న వారు ఇంకా మొదటి ముద్దలో ఉండగానే.. వీరు మాత్రం ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఒక్కో ముద్దను వేగంగా తీసుకుంటూ.. మధ్యలో పెద్దగా విరామం లేకుండా భోజనం ముగించేస్తారు. “త్వరగా తినడం ఒక అలవాటే కదా.. ఇందులో ఏముంది?” అనుకుంటాం. కానీ..మనం తినే వేగం కూడా మన ఆలోచనా విధానం, జీవనశైలి, కొన్ని ప్రవర్తనా లక్షణాలకు చిన్న సంకేతం కావచ్చట. సైకాలజిస్టులు చెబుతున్న విషయం ఆసక్తికరంగా ఉంది మరి. ఆ విషయాలు పరిశీలిస్తే.. వేగంగా తినే అలవాటు వెనుక కేవలం తొందర మాత్రమే కాకుండా.. సమయాన్ని చూసే విధానం, పనులను పూర్తి చేసే తీరు, రోజువారీ జీవితంలో ఉండే వేగం వంటి అంశాలు కూడా దాగి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది వ్యక్తిత్వాన్ని పూర్తిగా అంచనా వేసే పరీక్ష కాదని.. కేవలం కొన్ని ప్రవర్తనా ధోరణులను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే చిన్న సంకేతంగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు.లక్ష్యాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుందా?.. వేగంగా తినే వ్యక్తుల్లో.. కొంతమంది లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టే స్వభావం కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీరికి సమయం చాలా విలువైనదిగా అనిపిస్తుంది. చేయాల్సిన పనుల జాబితాను త్వరగా పూర్తి చేసి.. తర్వాతి లక్ష్యానికి వెళ్లాలనే ఆలోచన ఎక్కువగా ఉండొచ్చు. అందుకే భోజనం కూడా ఆస్వాదించే సమయం కంటే.. పూర్తి చేయాల్సిన మరో పనిలా మారిపోయే అవకాశం ఉంటుంది.వేచి ఉండటం నచ్చదా?.. వేచి ఉండటాన్ని ఇష్టపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యూలో నిలబడటం, ఆలస్యంగా జరిగే పనులు, నెమ్మదిగా సాగే చర్చలు వారికి అసహనాన్ని కలిగించవచ్చు. వారి జీవనశైలి కూడా వేగంగానే సాగుతూ ఉంటుంది. ఒక పని పూర్తయిన వెంటనే మరో పని మొదలుపెట్టాలనే ఆలోచన వారిలో కనిపించవచ్చు. అయితే ప్రతి వేగంగా తినేవారు అసహన స్వభావం కలిగిన వారే అని చెప్పలేం. సమయాభావం, పని ఒత్తిడి వంటి కారణాలు కూడా దీనికి కారణం కావచ్చు.ఎప్పుడూ తర్వాతి పని గురించే ఆలోచనా?.. కొంతమంది భోజనం చేస్తున్నప్పటికీ వారి మనసు అక్కడ ఉండదు. ఫోన్లో మెసేజ్‌లు చూడటం.. ఆఫీస్ పనుల గురించి ఆలోచించడం.. తర్వాత చేయాల్సిన పనుల జాబితా సిద్ధం చేసుకోవడం వంటి అలవాట్లు ఉండొచ్చు. సైకాలజిస్టుల ప్రకారం ఇది ‘టాస్క్-ఫోకస్డ్ మైండ్‌సెట్’ కావొచ్చు. అంటే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం కంటే.. తర్వాతి పని పూర్తి చేయడంపై దృష్టి పెట్టే స్వభావం.👉..అయితే.. వేగంగా తినడం వల్ల శరీరం ఇచ్చే ముఖ్యమైన సంకేతాలను మనం పట్టించుకోకపోవచ్చు. ముఖ్యంగా “ఇక చాలు” అనే తృప్తి సంకేతం మెదడుకు చేరడానికి కొంత సమయం పడుతుంది. కానీ వేగంగా తినేవారిలో భోజనం అప్పటికే పూర్తవుతుంది. దీంతో అవసరానికి మించి తినే అవకాశం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే నెమ్మదిగా తినడం వల్ల ఆకలి, తృప్తి స్థాయిని మెరుగ్గా అర్థం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.👉ఈ అలవాటు ఉన్నవారు బిజీ షెడ్యూల్స్కు త్వరగా అలవాటు పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ సమయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు, ఒత్తిడితో కూడిన పనులు, వేగంగా మారే పరిస్థితుల్లో వీరు సౌకర్యంగా పనిచేయగలరని నిపుణులు భావిస్తున్నారు. అయితే కొందరు కేవలం పరిస్థితుల వల్లే వేగంగా తింటారు. ఉదాహరణకు.. తక్కువ లంచ్ బ్రేక్, కుటుంబ బాధ్యతలు, చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు కూడా కారణం కావచ్చు.👉భోజనం చేసే సమయంలో ఆహారం రుచి, వాసన, ఆకలి, తృప్తిని గమనిస్తూ తినడాన్ని ‘మైండ్‌ఫుల్ ఈటింగ్’ అంటారు. వేగంగా తినే వారిలో ఈ అలవాటు తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నెమ్మదిగా తినడం వల్ల ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు.. శరీరం ఇచ్చే సంకేతాలను కూడా మెరుగ్గా గమనించవచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. తినే వేగం ఆధారంగా ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేం. చిన్ననాటి అలవాట్లు, కుటుంబ వాతావరణం, సంస్కృతి, పని ఒత్తిడి, జీవన పరిస్థితులు.. ఇలా ఎన్నో అంశాలు మన తినే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వేగంగా తింటున్నారని మీరు తప్పనిసరిగా ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వారని కాదు. కానీ మీ రోజువారీ అలవాట్లను గమనించడానికి ఇది ఒక చిన్న సంకేతం కావచ్చు. మరి మీరు ఏ రకం? ప్లేట్ అందరికంటే ముందే ఖాళీ చేసేవారా.. లేక నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినేవారా?. -
గాయపడ్డ శరీరాలు.. బాంబులకు బదులు బంతితో సమాధానం!
ప్రపంచమంతా ఫిఫా ప్రపంచకప్ ఉత్సాహంలో మునిగిపోయింది. స్టేడియాలు అభిమానుల సందడితో మారుమోగుతున్నాయి. కానీ గాజాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. కరెంట్ ఉండే కొద్దిసేపైనా టీవీ ముందు గుమిగూడటం.. ఇంటర్నెట్ సిగ్నల్ కోసం భవనాలపైకి ఎక్కడం.. బ్యాటరీని పొదుపుగా వాడుకుంటూ మ్యాచ్‌లు చూడటం అక్కడి ప్రజల దైనందిన దృశ్యం. అలాంటి యుద్ధ వాతావరణంలోనూ ఫుట్‌బాల్ మాత్రం వారికి కాసేపైనా భయాన్ని మరిచిపోయే ప్రపంచంగా మారింది.అయితే అక్కడి నుంచే ఇప్పుడు మరో ఫుట్‌బాల్ కథ ప్రపంచాన్ని కదిలిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో అవయవాలు కోల్పోయిన గాజా యువతులు.. ఇప్పుడు ఫుట్‌బాల్ మైదానంలో తమ జీవితానికి కొత్త అర్థం వెతుకుతున్నారు. పుట్టుకతోనే వైకల్యం ఉన్న అమ్మాయిలతో కలిసి పాలస్తీనాలో తొలి మహిళల అంప్యూటీ ఫుట్‌బాల్ జట్టుగా ఏర్పడి(amputee).. చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతి వారం.. డీర్ అల్-బలాహ్‌లో దాడుల్లో మిలిగిన కొద్దిపాటి గడ్డి మైదానంలో వారు సాధన చేస్తున్నారు. వారి లక్ష్యం ఒక్కటే.. ఒకరోజు ప్రపంచ వేదికపై పాలస్తీనా జెండాను ఎగురవేయడం.గాజా ఆరోగ్య శాఖ అంచనా ప్రకారం యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడ దాదాపు ఆరు వేల మంది అవయవాలు కోల్పోయారు. వీరందరికీ కృత్రిమ అవయవాలు, దీర్ఘకాలిక పునరావాసం అవసరమైంది. ఈ పరిస్థితుల్లోనే 2018లో స్థాపించబడిన పాలస్తీనా అంప్యూటీ ఫుట్‌బాల్ అసోసియేషన్ కొత్త ఆశాకిరణంగా మారింది. యుద్ధం తర్వాత వికలాంగుల సంఖ్య పెరగడంతో మహిళల జట్టులో చేరిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.‘‘మా మైదానాలు ధ్వంసమయ్యాయి. సామగ్రి లేదు. అయినా ఈ అమ్మాయిల సంకల్పమే మమ్మల్ని ముందుకు నడిపించింది" అని అసోసియేషన్ వ్యవస్థాపకుడు ఫౌద్ అబూ ఘూలియన్ చెబుతున్నారు. ప్రపంచకప్ సందర్భంగా గాజా నుంచి వినిపించాల్సిన గొంతులు కూడా ఉన్నాయని, ముఖ్యంగా ఈ మహిళలు నిజమైన ఛాంపియన్లని ఆయన అంటున్నారు. 2027లో జరగనున్న మహిళల అంప్యూటీ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొనడమే తమ లక్ష్యమని వెల్లడించారు.24 ఏళ్ల రోజాన్ ఖైరా జీవితాన్ని మాత్రం యుద్ధమే ఒక్కసారిగా మార్చేసింది. 2023 నవంబరులో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కుటుంబ ఇంటిపై బాంబు పడటంతో ఆమె ఒక కాలును కోల్పోయింది. ఒకప్పుడు పరుగుపందేల్లో పతకాలు గెలిచిన ఆమెకు అది పెద్ద దెబ్బే. కానీ అదే సంఘటన ఆమె సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఇప్పుడు అంప్యూటీ ఫుట్‌బాల్ జట్టులో చేరి తన జీవితానికి కొత్త అర్థం వెతుక్కుంటోంది.గోల్‌కీపర్ ఐషా అల్ అబద్లా కథ మరింత హృదయవిదారకం. 2008 యుద్ధ సమయంలో ఆమె తల్లి తెల్ల భాస్వర(వైట్ పాస్పరస్) రసాయన ప్రభావానికి గురికావడంతో ఐషా ఒక చేయి పూర్తిగా అభివృద్ధి చెందకుండా జన్మించింది. అయినా దానిని ఆమె ఎప్పుడూ బలహీనతగా భావించలేదు. ఎనిమిదేళ్లుగా ఫుట్‌బాల్ ఆడుతున్న ఆమెకు ఆటే జీవితం. "మైదానంలోకి దిగితే యుద్ధానికి ముందు ఉన్న రోజులు గుర్తొస్తాయి. మా జీవితంలో ఆనందం మళ్లీ తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది" అని చెబుతోంది.అయితే వీరి పోరాటం మైదానంలోనే ముగియడం లేదు. చాలామందికి శరణార్థి శిబిరాల నుంచి సాధనకు రావడానికి ప్రయాణ ఖర్చులే భారంగా మారుతున్నాయి. ఆహార కొరత, పోషకాహార లోపం, క్రీడా సామగ్రి కొరత వంటి సమస్యలు ప్రతిరోజూ వెంటాడుతున్నాయి. అయినా "పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మా పట్టుదల మాత్రం తగ్గదు" అని రోజాన్ ధైర్యంగా చెబుతోంది.ప్రపంచం మొత్తం ఫిఫా ప్రపంచకప్‌ను చూస్తుంటే... డీర్ అల్-బలాహ్లోని ఈ యువతులు కూడా వీలైనప్పుడల్లా ఆ మ్యాచ్‌లను చూస్తున్నారు. కానీ వారు కేవలం ప్రేక్షకులుగా ఉండాలని కోరుకోవడం లేదు. ఒకరోజు అదే ప్రపంచం తమ ఆటను కూడా చూడాలని... తమ గాయాలను కాదు, తమ గెలుపును గుర్తించాలని కలలు కంటున్నారు. యుద్ధం వారి అవయవాలను దూరం చేసినా... ఫుట్‌బాల్‌పై ప్రేమను, జీవితంపై ఆశను మాత్రం ఏ బాంబూ చెరిపేయలేకపోయింది. -
హమ్మయ్యా... అది కూడా ఆరోగ్యమేనట!
ఆరోగ్యం అంటే ఏమిటి? కండలు తిరిగిన దేహమా? జబ్బుల్లేని జీవితమా? ఎంత తిన్నా లావు కాకపోవడమా? లేక ఎలాంటి చింతా, దిగులు లేకుండా జీవించడమా?..నిజానికి, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అయితే భారతీయ సమాజంలో ఇప్పటికీ మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నప్పటికీ, వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. "మెంటల్" అనే ముద్ర పడుతుందేమో, నలుగురికి తెలిస్తే పరువు పోతుందేమో అనే భయంతో చాలామంది తమ సమస్యను బయటకు చెప్పడానికే వెనుకాడుతున్నారు.అయితే ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. మణిపాల్ సిగ్నా నిర్వహించిన ఇండియా హెల్త్ కోషెంట్ సర్వే ప్రకారం తొలిసారిగా భారతీయులు శారీరక, మానసిక ఆరోగ్యాలకు దాదాపు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. 35 ఏళ్లలోపు వారిలో 54 శాతం మంది మానసిక ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని భావిస్తుండగా, 50 ఏళ్లు దాటిన వారిలో 53 శాతం మంది ఇప్పటికీ వ్యాయామం, ఫిట్‌నెస్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.మెదడు పగిలేంత ఒత్తిడి... కానీ సమస్యే కాదట!ఈ అధ్యయనం బయటపెట్టిన మరో ఆందోళనకర విషయం భారతీయులు.. స్ట్రెస్‌ను చాలా తేలికగా తీసుకోవడం!. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పినా, అది తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని అంగీకరించింది కేవలం ఒక శాతం మాత్రమే. అంటే ఒత్తిడి ఎంత తీవ్రమైనా, దాన్ని ఆరోగ్య సమస్యగా భావించే అవగాహన ఇంకా చాలామందిలో లేదన్నమాట.ఆరోగ్యానికి, ఆర్థిక పరిస్థితికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆరోగ్య ఖర్చుల భారం చాలామందిలో ఆందోళన (యాంగ్జైటీ)ని పెంచుతుండగా, ఆరోగ్య బీమా ఉన్నవారిలో ఈ ఒత్తిడి కొంత తక్కువగా కనిపించింది.శారీరక, మానసిక ఆరోగ్యాలను వేర్వేరుగా చూడలేమని, రెండూ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయని మణిపాల్ సిగ్నా సీఈవో జోయ్‌దీప్ సాహా పేర్కొన్నారు. ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యం పెరగడం సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే సవాళ్లు ఇంకా పెద్దవే. దాదాపు 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మానసిక వైద్యుల సంఖ్య పదివేలకు కూడా చేరకపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. అయినప్పటికీ, మానసిక ఆరోగ్యంపై అవగాహన క్రమంగా పెరుగుతుండటం మాత్రం ఆశాజనక పరిణామమే.భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఐదు మానసిక సమస్యలు1. డిప్రెషన్:సుమారు 4.57 కోట్ల మంది భారతీయులు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. దేశంలో ఏటా జరిగే దాదాపు 2.5 లక్షల ఆత్మహత్యలకు ఇది ప్రధాన కారణంగా భావిస్తున్నారు. నిరుద్యోగం, లింగ వివక్ష, సామాజిక అసమానతలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటి అంశాలు దీనికి కారణమవుతున్నాయి. పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.2. యాంగ్జైటీ డిజార్డర్స్:ఓసీడీ, పీటీఎస్డీ, పానిక్ డిజార్డర్, సోషల్ యాంగ్జైటీ, ఫోబియాలు వంటి అనేక సమస్యలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని చాలామంది అసలు మానసిక సమస్యలుగానే గుర్తించకపోవడం వల్ల లక్షలాది మంది చికిత్సకు దూరమవుతున్నారు.3. మద్యం, మత్తు పదార్థాల వ్యసనం: దేశంలో దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తుండగా, వారిలో 83 లక్షల మంది తీవ్ర వ్యసనపరులుగా ఉన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగించే వారు 3.7 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. సుమారు 18 లక్షల మంది చిన్నారులు కూడా వివిధ రకాల మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళన కలిగించే విషయం.4. బైపోలార్ డిజార్డర్:దేశ జనాభాలో కనీసం రెండు శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంతకాలం అమితమైన ఉత్సాహంతో ఉండటం, ఆ తర్వాత తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోవడం దీని లక్షణం. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఆత్మహత్య ప్రమాదం కూడా పెరుగుతుంది.5. స్కిజోఫ్రేనియా:ప్రతి వెయ్యి మందిలో ముగ్గురు ఈ మానసిక సమస్యతో బాధపడుతున్నారు. లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, భ్రాంతులు, ఆలోచనల్లో గందరగోళం, సమాజానికి దూరంగా ఉండడం దీని ప్రధాన లక్షణాలు. పురుషుల్లో ఇది తక్కువ వయసులోనే కనిపించగా, మహిళల్లో గర్భధారణ, ప్రసవం సమయంలో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక సమస్యలు కూడా ఇతర అనారోగ్యాల్లాగే వైద్య చికిత్స అవసరమయ్యే పరిస్థితులే. వాటిని దాచిపెట్టడం కాదు, గుర్తించి సరైన సమయంలో నిపుణులను సంప్రదించడమే నిజమైన ఆరోగ్యానికి మొదటి అడుగు.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
పిల్లలకు టై కడుతున్నారా? ఈ తప్పు చేయొద్దు!
తెలుగు రాష్ట్రాల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై పాఠశాలలు సందడిగా మారాయి. యూనిఫాంలు, షూస్, బ్యాగులతో చిన్నారులు మళ్లీ బడిబాట పట్టారు. అయితే స్కూల్ యూనిఫాంలో భాగమైన ఒక అంశం గురించి వైద్య నిపుణులు హెచ్చరికలను ఓసారి చర్చిద్దాం. చాలామంది తల్లిదండ్రులు సాధారణంగా భావించే ఈ విషయం.. పిల్లల సౌకర్యం, ఆరోగ్యంతో ముడిపడి ఉందని చెబుతున్నారు. స్కూల్ యూనిఫాంలో టై అనేది తప్పనిసరి. పిల్లలు చక్కగా కనిపించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు టైలను సరిగ్గా కట్టి పంపిస్తుంటారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఊడిపోకూడదని భావిస్తుంటారు. అయితే టైని అతిగా బిగించడం వల్ల పిల్లలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.మెడకు బిగిగా టై ధరించడం వల్ల.. మెదడుకు వెళ్లే రక్తప్రసరణపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. జర్మనీకి చెందిన పరిశోధకులు.. నిర్వహించిన అధ్యయనంలో బిగుతుగా కట్టిన టై మెదడుకు వెళ్లే రక్తప్రసరణను తాత్కాలికంగా తగ్గించే అవకాశం ఉందని గుర్తించారు. పిల్లల డాక్టర్లు చెబుతోంది ఏంటంటే.. పిల్లలు రోజులో చాలా గంటల పాటు తరగతి గదుల్లో కూర్చుంటారు. అలాంటి సమయంలో మెడపై అనవసర ఒత్తిడి పడితే తలనొప్పి, తలతిరుగుడు, వికారం, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. టై బిగుతుగా ఉందా? లేదా? అనేది కొందరు పిల్లలు చెప్పలేని సందర్భాలు ఉంటాయి. కొందరు అసౌకర్యంగా ఉన్నా కూడా స్కూల్ నిబంధనల కారణంగా భరిస్తుంటారు. అందుకే ఉదయం పిల్లలను స్కూల్‌కు పంపే ముందు టై మరీ గట్టిగా ఉందేమో ఒకసారి పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.మరోవైపు పరిశుభ్రత విషయంలో కూడా టైలను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూనిఫాంలను తరచూ ఉతికే తల్లిదండ్రులు టైలను మాత్రం చాలాసార్లు మర్చిపోతుంటారు. పిల్లలు టైలను చేతులతో తాకడం, కొన్నిసార్లు నోటికి దగ్గరగా తీసుకెళ్లడం వల్ల వాటిపై సూక్ష్మక్రిములు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే టైలను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం.తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు..* టైని మెడకు అతిగా బిగించవద్దు.* మెడకు, టైకి మధ్య ఒకటి లేదా రెండు వేళ్లు వెళ్లేంత ఖాళీ ఉండాలి.* పిల్లలు అసౌకర్యంగా ఉందని చెబితే వెంటనే టైని వదులుగా చేయాలి.* ఇంటికి వచ్చిన తర్వాత టైని తీసేయాలి.* టైలను కూడా యూనిఫాంల మాదిరిగానే క్రమం తప్పకుండా ఉతకాలి.* తలనొప్పి, తలతిరుగుడు వంటి సమస్యలు తరచూ ఉంటే వైద్యులను సంప్రదించాలి.అయితే పైన చెప్పిన అధ్యయనం నేరుగా చిన్నారులపై జరగకపోయినా.. పిల్లల విషయంలో కూడా అతిగా బిగించిన టైలు ఇబ్బందులకు దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు. టై అనేది యూనిఫాంలో చిన్న భాగమే కావచ్చు. కానీ పిల్లల సౌకర్యం, ఆరోగ్యం విషయంలో ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. స్కూల్‌కు పంపే ముందు టై సరిగ్గా ఉందా, బిగుతుగా లేదో ఒకసారి చూసుకోవడం ద్వారా అనవసరమైన అసౌకర్యాన్ని నివారించవచ్చు. పిల్లలు చక్కగా కనిపించడం ఎంత ముఖ్యమో.. వారు రోజంతా సౌకర్యంగా, ఆరోగ్యంగా ఉండటం అంతకంటే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. -
30 ఏళ్లు దాటాయా? జాగ్రత్త.. ఈ అలవాటు లేకపోతే ఇబ్బందులే!
చాలామంది వృద్ధాప్యం వచ్చాకే శరీరం బలహీనపడుతుందని భావిస్తారు. కానీ కండరాల బలం తగ్గే ప్రక్రియ 30 ఏళ్ల తర్వాతే నెమ్మదిగా ప్రారంభమవుతుంది. 60 ఏళ్లు దాటాక ఇది మరింత వేగంగా సాగుతుంది. ఫలితంగా శక్తి తగ్గడం, నడకలో సమతుల్యత కోల్పోవడం, తరచూ పడిపోవడం, ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు పెరుగుతాయి. అంటే సమస్య వయసు కాదు.. వయసుతో పాటు తగ్గిపోతున్న కండరాల బలమే అని నిపుణులు చెబుతున్నారు.వయసు పెరుగుతోందంటే వెంట్రుకలు తెల్లబడటం, ముడతలు పడటమే కాదు. మీకు తెలియకుండానే శరీరంలోని కండరాలు కూడా క్రమంగా బలహీనపడుతున్నాయి. 30 ఏళ్లు దాటిన తర్వాత మొదలయ్యే ఈ ప్రక్రియను పట్టించుకోకపోతే.. 60, 70 ఏళ్ల వయసులో మెట్లు ఎక్కడం, కుర్చీ నుంచి లేవడం, రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.నడక ఒక్కటే సరిపోదంట: ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడిస్తే చాలని చాలా మంది అనుకుంటారు. అయితే నడక గుండె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. కండరాల బలాన్ని కాపాడుకోవడానికి మాత్రం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం జిమ్‌కు వెళ్లి భారీ బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. కుర్చీ నుంచి లేచి కూర్చోవడం, స్క్వాట్స్, గోడకు ఆనుకుని పుష్అప్స్ చేయడం, మెట్లు ఎక్కడం, రెసిస్టెన్స్ బ్యాండ్లతో చేసే వ్యాయామాలు కూడా కండరాలను బలోపేతం చేస్తాయి.మొదట్లోనే అతి వద్దు: అయితే ఒక్కసారిగా ఎక్కువ వ్యాయామం చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికి రెండు లేదా మూడు రోజులు, రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలతో ప్రారంభించాలని సూచిస్తున్నారు. శరీరం అలవాటు పడిన తర్వాత క్రమంగా తీవ్రత పెంచాలని చెబుతున్నారు.కండరాలు బలపడితే: స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల కేవలం కండరాలే కాదు.. ఎముకలు కూడా బలపడతాయి. రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. శరీర సమతుల్యత పెరుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించే సామర్థ్యం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.50.. 60.. 70 వచ్చినా.. డోంట్ వర్రీ: "ఇప్పుడేం ఉపయోగం?" అని అనుకునేవారికి నిపుణులు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నారు. కండరాల బలాన్ని పెంచుకోవడానికి వయసు అడ్డంకి కాదని చెబుతున్నారు. 50, 60, 70 ఏళ్ల వయసులో కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొంటున్నారు.వ్యాయామంతో పాటు: కండరాల నిర్మాణానికి ప్రోటీన్ చాలా అవసరం. పాలు, పెరుగు, గుడ్లు, పప్పులు, చేపలు, మాంసాహారం వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం తర్వాత సరైన విశ్రాంతి కూడా అవసరమే. ఎందుకంటే కండరాలు వ్యాయామం చేసే సమయంలో కాకుండా.. విశ్రాంతి సమయంలోనే మరింత బలపడతాయి.వయసు పెరగడం ఎవరి చేతుల్లోనూ లేదు. కానీ వయసు పెరిగాక ఎంత చురుకుగా, ఎంత స్వతంత్రంగా జీవించాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది. అందుకే 30 దాటిందంటే నిర్లక్ష్యం చేయొద్దు. మీ శరీరంలోని కండరాలు నిశ్శబ్దంగా బలహీనపడకముందే అప్రమత్తం కావాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మొదలుపెట్టకపోతే.. వృద్ధాప్యంలో మూల్యం చెల్లించాల్సి రావచ్చని స్పష్టం చేస్తున్నారు. -
చద్దన్నం తినడం మంచిదా? కాదా?..
మిగిలిపోయిన అన్నాన్ని నీటిలో, పెరుగులో లేదా మజ్జిగలో నానబెట్టి మరుసటి రోజు తినడం ఒకప్పుడు మన ఇళ్లలో సాధారణ అలవాటు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చద్దన్నం ఉదయపు ఆహారంలో అంతర్భాగంగా ఉండేది. అయితే కాలం మారేకొద్దీ ఈ అలవాటు క్రమంగా కనుమరుగవుతోంది. రాత్రంతా నానబెట్టిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం చాలామందిలో బలపడింది. కానీ తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆహారపు అలవాటు వెనుక నిజంగా ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? చద్దన్నం కేవలం పాతకాలపు ఆహారమేనా, లేక ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఇందులో నిజంగానే దాగి ఉన్నాయా?.. సైన్స్ మరోసారి ఈ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది.. వండిన అన్నాన్ని రాత్రంతా నీటిలో నానబెడితే ఉదయానికి సహజ కిణ్వ ప్రక్రియ (ఫెర్మెంటేషన్) ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పెరిగి, అన్నంలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో అన్నం మరింత సులభంగా జీర్ణమవుతుంది. ఇది కేవలం పుల్లటి రుచిని ఇవ్వడమే కాదు.. శరీరానికి ఉపయోగపడే మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు కూడా దోహదపడుతుంది. అందుకే చద్దన్నాన్ని సహజ ఫెర్మెంటెడ్ ఆహారంగా పరిగణిస్తారు.మిగిలిపోయిన అన్నం.. పోషకాల నిల్వ?ఫెర్మెంటేషన్ వల్ల ఆహారంలోని కొన్ని పోషకాలు శరీరానికి మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీ-కాంప్లెక్స్ విటమిన్ల లభ్యత పెరగడంతో పాటు ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను శరీరం మరింత సమర్థంగా గ్రహించగలుగుతుంది. సాధారణంగా ఆహారంలోని కొన్ని పదార్థాలు ఖనిజాల శోషణకు అడ్డుపడతాయి. ఫెర్మెంటేషన్ ఆ అవరోధాలను తగ్గించడం వల్ల పోషకాలు మరింత ఉపయోగకరంగా మారుతాయి.గట్ హెల్త్‌పై ఎందుకింత చర్చ?ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా "గట్ హెల్త్" అంటే పేగుల ఆరోగ్యం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, శరీర పోషకాల శోషణలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గట్ హెల్త్‌ను మెరుగుపరిచే ఆహారాలపై ఆసక్తి పెరిగింది.ఇక్కడే చద్దన్నం ప్రాధాన్యం పెరుగుతోంది. ఖరీదైన ప్రోబయోటిక్ డ్రింక్స్, సప్లిమెంట్లకు బదులుగా ఇందులో సహజంగా ఏర్పడే లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు ఉబ్బరం తగ్గించడంలో, మలబద్ధకం వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.వేసవిలో ఎందుకు ఎక్కువగా తినేవారు?భారతదేశంలో చద్దన్నం సంప్రదాయం ఎక్కువగా వేసవికాలంలో కనిపించడం యాదృచ్ఛికం కాదు. ఇది శరీరాన్ని చల్లబరచడంలో, హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. చద్దన్నంలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరానికి తేమ అందుతుంది. అలాగే ఫెర్మెంటేషన్ వల్ల ఏర్పడే లాక్టిక్ యాసిడ్ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒకప్పుడు రైతులు, కూలీలు ఎండలో పనికి వెళ్లే ముందు చద్దన్నం తినేవారు. ఇది కడుపు నిండిన భావనను కలిగించడంతో పాటు రోజంతా శక్తిని అందించేదని పెద్దలు చెబుతుంటారు.ఎలా తింటే మంచిది?రాత్రి మిగిలిన అన్నాన్ని శుభ్రమైన పాత్రలో నీటితో నానబెట్టి, ఉదయం పెరుగు లేదా మజ్జిగ కలిపి తినవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు జోడిస్తే రుచితో పాటు పోషక విలువలు కూడా పెరుగుతాయి. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం మట్టి పాత్రలో నానబెడితే సహజ ఫెర్మెంటేషన్‌కు మరింత అనుకూలంగా ఉంటుంది.అందరికీ సరిపోతుందా?చద్దన్నం చాలామందికి మేలు చేసినా.. ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా సరిపోతుందని చెప్పలేం. మధుమేహం ఉన్నవారు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే జీర్ణకోశ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.మొత్తానికి... చద్దన్నం గురించి ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలకు శాస్త్రం ఆసక్తికరమైన సమాధానం చెబుతోంది. ఇది ఏదో అద్భుత ఔషధం కాకపోయినా.. సహజ ఫెర్మెంటేషన్ వల్ల జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి, వేసవిలో శరీరానికి తేమ అందించడంలో ఉపయోగపడే సంప్రదాయ ఆహారంగా గుర్తింపు పొందుతోంది. ఒకప్పుడు "మిగిలిపోయిన అన్నం"గా తక్కువగా చూసిన చద్దన్నం.. ఇప్పుడు శాస్త్రీయ పరిశోధనల్లో కొత్త కోణంలో కనిపిస్తోంది. ఖరీదైన ఆరోగ్య ఆహారాల కోసం వెతుకుతున్న ఈ కాలంలో.. మన వంటింట్లోనే తరతరాలుగా ఉన్న ఈ సాధారణ ఆహారం వెనుక దాగి ఉన్న విజ్ఞానాన్ని సైన్స్ మరోసారి గుర్తు చేస్తోంది. -
పుచ్చకాయ.. నిజంగానే ప్రాణాలు తీస్తుందా?
ముంబైలో బిర్యానీ, పుచ్చకాయ తిని ఓ కుటుంబం మరణించిదన్న వార్త కొత్త ఆందోళనలకు దారి తీసింది. సీజన్‌తో సంబంధం లేకుండా చాలామందికి బిర్యానీ ఫేవరెట్ ఫుడ్. అలాగే వేసవిలో ఎక్కువగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. అలాంటివి ప్రాణాలు తీసేంత ప్రమాదకరమా? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు ఆ అపోహలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ముంబైలో జరిగిందేంటి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు శనివారం రాత్రి 10.30గం. ప్రాంతంలో మొదట బిర్యానీ తిన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న పుచ్చకాయ (వాటర్మెలన్)ను తిన్నారు. కొన్ని గంటల్లోనే వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతూ 12 గంటల వ్యవధిలోనే ఆ నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.ట్రీట్మెంట్ సమయంలో ఆ నలుగురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్ జరిగిందనడానికి నిదర్శనమని వైద్యులు ప్రకటించారు. పోలీసులు మాత్రం దీన్నొక యాక్సిడెంటల్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్లు తినగా మిగిలిన బిర్యానీ, పుచ్చకాయ ముక్కలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. పోస్ట్‌మార్టం.. హిస్టోపాథాలజీ రిపోర్టులు వచ్చాకే వాళ్లు ఎలా చనిపోయారన్న దానిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఈలోపే.. బిర్యానీ తిన్న మిగతా బంధువులు బాగానే ఉండడంతో.. పుచ్చకాయనే ఈ మరణాలకు కారణమై ఉంటుందనే చర్చ(సోషల్ మీడియా రచ్చ) మొదలైంది. నిపుణులు చెబుతోంది ఏంటంటే.. పుచ్చకాయకు త్వరగా కలుషితమయ్యే గుణం ఉంటుందని. పుచ్చకాయ వేసవిలో తినడానికి అత్యంత ఆరోగ్యకరమైన పండు. ఇది 90% పైగా నీటితో నిండి ఉండి శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, విటమిన్ A, C, లైకోపిన్, పొటాషియం వంటి పోషకాలు అందిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చర్మం, కళ్లకు మేలు చేస్తుందని డైటీషియన్ డాక్టర్ అర్చనా బాత్రా అంటున్నారు. అయితే ముంబై కేసుపై ఆమె స్పందిస్తూ.. పుచ్చకాయలో సాల్మొనెల్లా, లిస్టీరియా, ఎస్టరేషియా కొలై లాంటి హానికరమైన పాథోజెన్లు చేరితే కలుషితం అవుతుందని.. అప్పుడు అది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుందని చెబుతున్నారు. ‘‘ఈ ప్రభావంతో తిన్న వ్యక్తులు తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇన్ఫెక్షన్ సోకి అవయవాలపై ప్రభావం చూపవచ్చు. ట్రీట్మెంట్ ఆలస్యమైతే ప్రాణాల మీదకు రావొచ్చు’’ అని ఆమె అంటున్నారు. పుచ్చకాయలో అధిక నీరు, సహజ చక్కెర ఉండడం కూడా బ్యాక్టీరియా వేగంగా పెరగడానికి కారణమని ప్రముఖ న్యూట్రీషనిస్ట్ రుపాలి దత్తా అంటున్నారు. కొన్నిసార్లు పుచ్చకాయల్లో తీపి పెంచడానికి గ్లూకోజ్ నీరు లేదంటే చక్కెర నీరు ఇంజెక్ట్ చేస్తారని.. ఆ సమయంలోనూ కలుషితం కావొచ్చని.. అలాంటివి ప్రాణాలకు ముప్పు తేవొచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు.అలాగని పుచ్చకాయ ప్రాణం తీస్తుందని కాదు. పండ్లు కలుషితం కావడం, సరిగా నిల్వ చేయకపోవడంతో కచ్చితంగా ప్రమాదకరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను కొనేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి తొక్కతో సహా బాగా కడగాలి.. చాలా మంది ఈ జాగ్రత్త పాటించరుపుచ్చకాయను కోయడానికి శుభ్రమైన కత్తులు, బోర్డులు వాడాలి.కట్ చేసిన పుచ్చకాయ గది ఉష్ణోగ్రత వద్ద త్వరగా చెడిపోతుంది పుచ్చకాయను కట్ చేశాక 2 గంటలకు మించి బయట ఉంచకూడదుకట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయను తింటే ప్రమాదమేం కాదని న్యూట్రీషనిస్ట్ రుపాలి దత్తా చెబుతున్నారుఅయితే ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ చేస్తే రుచి, పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయను రెండు, మూడు రోజులకు మించి ఉంచకూడదని ఆమె సూచిస్తున్నారు.. సరైన పుచ్చకాయను ఎంచుకోవడం ఎలా..?1.తొక్క రంగు చూసుకోవాలిగాఢమైన ఆకుపచ్చ రంగులో ఉండి, గీతలు స్పష్టంగా కనిపిస్తే అది పండిన పుచ్చకాయ.చాలా మెరిసే తొక్క ఉంటే ఇంకా పండలేదని అర్థం.2. ఫీల్డ్ స్పాట్ (పసుపు మచ్చ) చూడాలినేలపై పెరిగిన చోట పసుపు లేదంటే క్రీమ్ రంగు మచ్చ ఉంటుంది. అది గాఢంగా ఉంటే పుచ్చకాయ బాగా పండింది.తెల్లగా లేదంటే లేతగా ఉంటే ఇంకా పండలేదు.3. తట్టి చూడాలిపుచ్చకాయను తట్టి చూసినప్పుడు లోపల ఖాళీగా ఉన్నట్టుగా “తక్కువ శబ్దం” వస్తే అది పండింది.ఎక్కువగా ఘనంగా శబ్దం వస్తే ఇంకా పండలేదని అర్థం.4. బరువు చూసుకోవాలిపరిమాణానికి తగినంత బరువుగా ఉంటే అది రసంతో నిండిన పుచ్చకాయ.తేలికగా ఉంటే లోపల నీరు తక్కువగా ఉంటుంది.5. ఆకారం గమనించాలిగుండ్రంగా, సమంగా ఉన్న పుచ్చకాయలు సాధారణంగా తీపిగా ఉంటాయి.పొడవుగా లేదంటే అసమంగా ఉన్నవి తక్కువ తీపి కలిగి ఉండే అవకాశం ఉంది.పుచ్చకాయ మాత్రమే కాదు.. రాత్రి ఆలస్యంగా ఏ పండ్లు తినడం జీర్ణక్రియను కష్టతరం చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేదంటే మధ్యాహ్నా సమయంలోనే పండ్లు తినడం మంచిదని సూచిస్తున్నారు. -
రూ. 240 కోట్ల విజేత: అమ్మానాన్నల కలలు తీరుస్తా...
యుఎఇ లాటరీలో తొలిసారిగా దిర్హామ్ 100 మిలియన్ (రూ. 240 కోట్లు) గెలుచుకున్న వ్యక్తిగా నిలిచిన తెలంగాణకు చెందిన 29 ఏళ్ల అనిల్‌కుమార్ బొల్లా తన అదృష్టాన్ని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలో ప్రస్తుతం ఆలోచిస్తున్నాడు. ఖమ్మం జిల్లాలోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన అనిల్ ఐటీ రంగంలో పనిచేయడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం అబుదాబికి వెళ్లాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు, తరువాత ఉద్యోగం కోసం అబుదాబికి వెళ్లే ముందు ప్రభుత్వ పాఠశాలలో ఎలా చదువుకున్నాడో గుర్తుచేసుకుంటూ’ఒక టికెట్ నా జీవితాన్ని మార్చివేసింది’ అని ఈ లాటరీ విజేత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనందంగా చెప్పాడు. తనకు విజయాన్ని అందించిన టికెట్ ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉందని, ఎందుకంటే దానిలో తన తల్లి పుట్టిన తేదీని నంబర్ కాంబినేషన్లో చేర్చారని అన్నాడు. తన తల్లిదండ్రులు సోదరుడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి తరలించడం తన తొలిప్రాధాన్యత అని అనిల్ చెబుతున్నాడు.యుఎఇ లాటరీ లో దాదాపు ఒక సంవత్సరం గా పాల్గొంటున్న బొల్లా, గత అక్టోబర్ 18 డ్రా కోసం 12 టిక్కెట్లను కొనుగోలు చేశానని, వాటిలో ఒకటి తనను దిర్హామ్‌ల 100 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను పొందిన మొదటి వ్యక్తిగా నిలిపిందని చెప్పాడు. రాబోయే తన సంపదను ఎలా నిర్వహించాలనుకుంటున్నాడో చెబుతూ తెలివిగా పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తున్నానన్నాడు. ‘ఈ మొత్తాన్ని నేను ఎలా పెట్టుబడి పెట్టాలి – దానిని సరైన మార్గంలో ఖర్చు చేయడం గురించి నేను ఆలోచిస్తున్నాను‘ అని అనిల్ అన్నాడు. ‘గెలిచిన తర్వాత, నా దగ్గర డబ్బు మాత్రమే ఉన్నట్టు నాకు అనిపించింది, కానీ ఇప్పుడు ఇక నా ఆలోచనలు సరైన మార్గంలో ఉండాలి. ఏదైనా భారీగా ప్లాన్ చేయాలనుకుంటున్నాను.‘ అన్నాడు.తనకు వ్యక్తిగత కలలు ఉన్నాయని, కానీ వాటిని కుటుంబ ప్రాధాన్యతలతో కలిపి సమతుల్యం చేసుకోవాలనుకుంటున్నానని ఆయన అన్నారు. ‘‘నాకు సూపర్ కారు కొనాలనే కల ఉంది.అలాగే గొప్ప రిసార్ట్‌లో లేదా సెవెన్ స్టార్ హోటల్లో నా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. నా కుటుంబాన్ని ఇక్కడకు తీసుకువచ్చి వారితో కలిసి నా జీవితాంతం ఆనందించాలనుకుంటున్నాను. మా అమ్మా నాన్నవి చాలా చాలా చిన్న కలలు , నేను వారి కలలన్నింటినీ నెరవేర్చి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాను’’ అని వివరించాడు. అంతేకాకుండా బహుమతిలో కొంత భాగాన్ని ఛారిటీకి ఇవ్వాలనే ప్రణాళికలను కూడా వెల్లడించాడు. ‘‘విరాళాలు నిజంగా సహాయం అవసరమైన వ్యక్తులకు చేరుతాయని నమ్ముతున్నాను కాబట్టి నేను ఛారిటీకి కొంత డబ్బును ఇవ్వాలి అనుకుంటున్నాను. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది’’ అని ఆయన అన్నాడు. తన ప్రయాణం ఇతరులకు ప్రేరణగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నాడు ‘‘ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఆటగాడు ఆడుతూనే ఉండాలని సూచిస్తున్నాను. ఏదో ఒక రోజు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది’’ అంటూ ఉద్భోధిస్తున్నాడు.మరోవైపు ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో నివసించే అతని తల్లిదండ్రులు మాధవరావు భూలక్ష్మి తమ కొడుకు సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఓ ఆంగ్ల పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ, భూలక్ష్మి ఈ వార్త విన్న తర్వాత తమ కుటుంబం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.‘లాటరీ గెలుపొందినట్లు మేం విన్నాము. మేం చాలా సంతోషంగా ఉన్నాము,‘ అని ఆమె అంటున్నారు. -
దేశంలో మగాడికి కష్టమొచ్చింది!
హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ IPS అధికారి పూరన్ కుమార్ ఈనెలలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తనను వేధించిన కస్టమ్స్, అధికారులు పేర్లు 8-పేజీల సూయిసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ముంబయిలో టీసీఎస్ మేనేజర్ మానవ్ శర్మ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య వేధింపులతో ఆత్మాహుతి పాలయ్యాడు. ‘‘ఆడవాళ్ల బాధపై అందరూ ఉద్యమిస్తారు. పురుషుల కష్టం ఎవ్వరు చూడరు’’ అని తన చివరి వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. మరొక స్టార్టప్ టెకీ ఈ ఏడాది మార్చిలో మెంటల్ డిస్ట్రెస్ కు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, స్టార్ట్-అప్ బిజినెస్‌లో నష్టాలతో బెంగళూరులో 12వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడుఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. వాస్తవాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. దేశంలో ప్రతి ఏడాది వేలాదిమంది పురుషులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. 2004లో 51,623 మంది వివాహిత పురుషులు ఆత్మహత్య చేసుకోగా, 2021 నాటికి ఈ సంఖ్య 81,063కి పెరిగింది.అదే సమయంలో వివాహిత మహిళల సంఖ్య మాత్రం 28,045 నుండి 28,680 వరకు మాత్రమే ఉంది. అంటే వివాహిత మహిళల సంఖ్య అలాగే ఉండగా, పురుషుల సంఖ్య 50శాతం పెరిగింది. ఇవి కేవలం గణాంకాలు కాదు, మన సమాజంలో పురుషుల మానసిక ఆరోగ్యం కూలిపోతుందనడానికి సంకేతం. దీనికి కారణాలు తెలుసుకుని, పరిష్కారాలు అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదట కారణాలు తెలుసుకుందాం.1. కుటుంబ సంబంధాల ఒత్తిడిఈ మధ్య మా క్లినిక్ కు కౌన్సెలింగ్ కు వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘‘సర్, నా జీతం సరిపోవడంలేదని నా భార్య తిట్టింది. మరోవైపు అమ్మ, తన మాట వినడంలేదని ఎత్తిపొడుస్తోంది. ఇద్దరినీ సంతోషపెట్టాలనుకున్నా, కానీ ఎవ్వరూ సంతోషంగా లేరు. చచ్చిపోవాలనిపిస్తుంది” అని వాపోయాడు.మగాడు కుటుంబానికి ‘రక్షకుడు’ అనే భావన బలంగా ఉంది. దీంతో పిల్లల భవిష్యత్తు, ఇంటి భారం, తల్లిదండ్రుల బాధ్యతలన్నీ పురుషులు మోస్తారు. వీటిలో విఫలమైనప్పుడు తీవ్రమైన అపరాధభావనకు, నిస్సహాయతకు, ఆత్మన్యూనతకు లోనవుతారు. ఇంటి సమస్యలు, భార్యతో విభేదాలు, వృత్తి ఒత్తిడి... ఇవన్నీ బయటకు చెప్పుకోలేని స్థితిలో, ఆ ఒత్తిడి ఆత్మహత్యవైపు నడిపించే ప్రమాదం ఉంది.2. మానసిక సమస్యలపై మౌనంమగాళ్లు ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి, సమస్యలను తనలోనే దాచుకోవాలనే సామాజిక కట్టుబాట్లు పురుషులకు అతిపెద్ద శత్రువులు. ఈ భావనను టాక్సిక్ మాస్క్యులినిటీ అంటారు. దీనివల్ల పురుషుడు తమ ఎమోషన్స్, బాధ, భయం, ఆందోళన వంటి వాటిని మనసులోనే తొక్కిపెడతాడు. డిప్రెషన్, యాంగ్జయిటీలాంటి సమస్యలున్నా సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లడాన్ని బలహీనతగా భావిస్తారు. ‘నేను బలహీనుడిని కాను’ అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ అణచివేత చివరకు మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసి తీవ్ర నిర్ణయాలవైపుకు నెడుతుంది.3. ఆర్థిక ఒత్తిళ్లు... కరోనా తర్వాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొంతమంది అప్పుల్లో కూరుకుపోయారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వారి గుర్తింపు ఉద్యోగం, సంపాదనతో ముడిపడి ఉండటమే దీనికి కారణం. అందరిముందూ తల దించుకోవాల్సిన పరిస్థితి, అవమాన భారం, భవిష్యత్తుపై అభద్రతాభావం వారిని నిరాశలోకి నెట్టేస్తాయి. ఇటీవల బెంగళూరులో ఒక టెకీ ఉద్యోగం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన వార్త దీనికి నిదర్శనం.4. చట్టపరమైన ఒత్తిళ్లు...మరికొంతమంది పురుషులు వివాహ సంబంధిత చట్టాలు, కుటుంబ వివాదాలు, లేదా తప్పు ఆరోపణలు వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. “నేను తప్పు చేయలేదు, కానీ ఎవరూ నమ్మలేదు” అని కొద్ది నెలల క్రితం బెంగళూరులో ఒక టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు మన సమాజంలో మగాళ్ల బాధను ఎవరూ వినడం లేదనే భావనను పెంచుతున్నాయి.5. మత్తు పదార్థాలు... చాలామంది పురుషులు మద్యం లేదా డ్రగ్స్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందాలని ప్రయత్నిస్తారు. కానీ అది ఒక్కరోజు సాంత్వన మాత్రమే. మరుసటి రోజు మళ్లీ అదే బాధ, అదే శూన్యత, మళ్లీ మద్యం. అలా అలా దానికి బానిసలవుతారు. ఈ విషవలయం చివరకు స్వీయ విధ్వంసానికి దారి తీస్తుంది.6. ఒంటరితనం... మహిళలకు కష్టమొస్తే వెంటనే ఎవరో ఒకరితో పంచుకుంటారు. కానీ పురుషులు మాత్రం మౌనంగా భరిస్తారు. కాఫీ లేదా స్క్రీన్‌తో మాట్లాడతారు. ఓసారి ఒక 42 ఏళ్ల వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ‘‘నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్లు అడిగేది... జీతం ఎంత? కారు కొత్తదా? అని. నిజంగా నా మనసులో ఏముందో విన్నవాడు లేడు’’ అని చెప్పాడు. అదీ పరిస్థితి.గణాంకాలు చెబుతున్నది ఏమిటి?• భారతదేశంలో మొత్తం ఆత్మహత్యలలో 70% కంటే ఎక్కువ పురుషులవి.• 18–45 ఏళ్ల మధ్య వయసు గలవారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. • వివాహిత మహిళల కంటే వివాహిత పురుషులు 1.8 రెట్లు ఎక్కువగా ప్రాణాలు తీసుకున్నారు.• కుటుంబ సమస్యలు పురుషుల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా ఉంది.పరిష్కార దిశలు1. మానసిక సమస్యల గురించి మాట్లాడాలి. పురుషుడికి కూడా సహాయం అవసరం అవుతుందని అంగీకరించాలి.2. కౌన్సెలింగ్‌ను మొదటి అడుగుగా చూడాలి, చివరి ప్రయత్నంగా కాదు.3. ‘మగాడు ఏడవకూడదు’ అన్న మాట మార్చాలి. ఎమోషన్స్ కు జెండర్ తో సంబంధం లేదని గుర్తించాలి. 4. తండ్రులు, భర్తలు, సోదరులు మాట్లాడుకునే సపోర్ట్ గ్రూపులు ఏర్పాటు చేయాలి. 5. మీడియా పురుషుల బాధను నాటకీయంగా కాకుండా, అవగాహనతో చూపించాలి.ఒక పురుషుడు చనిపోవడమంటే, ఒక తండ్రి, ఒక కుమారుడు నిశ్శబ్దంగా మాయమవ్వడం. ఒక కుటుంబం కష్టాల్లో, దు:ఖంలో పడటం. ఆత్మహత్యలు కేవలం వ్యక్తిగత వైఫల్యాలు కాదు, అవి సామాజిక వైఫల్యాలు. పురుషులు కూడా మనుషులే, వాళ్లకు కూడా అర్థం చేసుకునే హృదయం అవసరం.-సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్-జీనియస్ మ్యాట్రిక్స్ హబ్, 8019 000066, www.psyvisesh.com -
Wah Ustad Wah: జాకీర్ హుస్సేన్ చివరి పోస్ట్ వైరల్
‘‘ఎంతటి కళాకారుడైనా.. ఎంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మంచి విద్యార్థిగానే ఉండాలి’’.. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తరచూ చెప్పే మాట ఇది. మూడేళ్ల వయసుకే తబలాపై చిట్టి చేతులేసి.. ఏడేళ్లకే స్టేజ్ షో ఇచ్చి.. 12 ఏళ్లకే అంతర్జాతీయ సంగీత కచేరీలు.. ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన సంగీత ప్రయాణం ముగిసింది. జాకీర్ హుస్సేన్ మరణంతో.. ఆయన జ్ఞాపకాలను కొందరు తెరపైకి తెస్తున్నారు. ఆయన నేపథ్యం, ఆయన పరిచయాలు, ఆసక్తికర ఘటనలు.. ఇలా ఎన్నింటినో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ తబలా విద్వాంసుడు.. చివరి పోస్టుగా ‘అద్భుతమైన క్షణం’ ఉంచారు. View this post on Instagram A post shared by Zakir Hussain (@zakirhq9)ఈ అక్టోబర్‌లో అమెరికాలో ఉన్న ఆయన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటూ.. ప్రకృతి వీడియోను స్వయంగా చిత్రీకరించి షేర్ చేశారాయన. ఆ పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది.ఓ గురువు నేర్పడం కాదు.. ఓ విద్యార్థి నేర్చుకోవడం అనేది ముఖ్యం. గురువును ఆ విద్యార్థి నేర్పే విధంగా ఇన్స్పైర్ చేయాలి. అంటూ ఆయన చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అలాగే.. నా మొదటి గురువు నా తండ్రే. ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎప్పుడూ నేర్చుకోగలగడం చాలా ముఖ్యం. మనల్ని మనం బెస్ట్ అని అనుకోకూడదని మా నాన్న చెబుతుండేవారు. ఓ కళాకారుడు ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మంచి విద్యార్థిగా ఉండాలి. అప్పుడే విజయం సాధిస్తారు.గొప్ప గొప్ప సంగీత విద్వాంసులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే చెప్పారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉన్నామన్నారు. వారి మాటలు నాలో స్ఫూర్తినింపాయి. నా రంగంలో నేను అత్యుత్తమంగా ఉన్నాను. అయినా ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదు. నాకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే కనీసం 15 మంది పేర్లు చెబుతాను.. అని జాకీర్ హుస్సేన్ మాటలు ‘‘వహ్ ఉస్తాద్ వహ్..’’ అని నెటిజన్లతో అనిపిస్తున్నాయి.క్లిక్ చేయండి: ఇక సెలవు మిత్రమా.. చితి వద్ద జాకీర్ హుస్సేన్ కన్నీళ్లు -
అడవిలో అమ్మప్రేమ!
పులి – ఆవు.. పాము – కాకి నీతి కథలుఅందరికీ తెలిసే ఉంటాయి. కథల సారాంశం ఏదైనా.. అందులో తల్లి ప్రేమ కనిపిస్తుంది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా కమ్మనైన అమ్మతనం ఎంతో మధురం. తల్లి జంతువు ప్రేమ ముందు ఏ ప్రాణి అయినా, జీవి అయినా తలవంచక తప్పదు.తన కళ్లముందు తన బిడ్డకు కష్టం వస్తే తిరగబడి పోరాడుతుంది. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. అతి చిన్న ప్రాణి అయిన గిజిగాడు మొదలు అతి క్రూరమైన జంతువులుగా చెప్పుకునే పులి, చిరుత, ఎలుగుబంటి వంటి జంతువుల వరకు వాటి పిల్లల లాలన చూస్తే ‘తల్లి ప్రేమ అడవంతా’ అని అనకమానరు.– ఆత్మకూరు రూరల్పశుపక్షాదుల్లో తల్లి ప్రేమను దగ్గరిగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కోతి, పిల్లులు తమ పిల్లల పెంపకం అందరికీ తెలిసే ఉంటుంది. మాతృప్రేమలో మాత్రం మర్కటాలు మనుషులకే పాఠాలు చెబుతాయి. ఇక పిల్లి నిండు గర్భంతో ఉన్నపుడే తను ప్రసవించే ప్రదేశాన్ని ఎంచుకుని ప్రసవానంతరం కొంత సమయ వ్యత్యాసంతో పిల్లలను కనీసం ఏడు చోట్లకు మార్చడం దాని విశిష్ట లక్షణం. కీటకాలు, పక్షులు, జంతువుల్లో తల్లి ప్రేమ నిశితంగా పరిశీలిస్తే ఔరా.. అనాల్సిందే.నల్లమల అడవుల్లో పెద్దపులులు ప్రధాన రక్షిత జీవి. అంతరించి పోయే దశకు చేరుకుంటున్న వాటి సంతతిని పెంచి పోషించడంలో ఆడ పులులు ఒక యుద్ధ్ధమే చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే ఆడపులి వాటిని పెంచడంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. పులి పిల్లలకు ప్రధాన ముప్పు మగపులుల నుంచే ఉంటుంది. సాధారణంగా పులి తన పిల్లలకు మూడేళ్ల వయçస్సు దాటేంత వరకు అవి స్వయంగా తమ ఆహారం సంపాదించుకునే నైపుణ్యం పొందే వరకు తిరిగి సమాగానికి సిద్ధపడదు. అందుకే మగ పులులు ఈ పిల్లలను అడ్డు తొలగిస్తే ఆడపులితో సమాగానికి సిద్ధ పడవచ్చనే ధోరణే పులి పిల్లలకు ప్రమాదం తెచ్చి పెడుతుంది.అందుకే తన సంతానం సమీపంలోకి మగపులి రాకుండా ఆడపులి తరిమి కొడుతుంది. పులిపిల్లలకు మరో ప్రమాదం నక్క, తోడేలు, కొండ్రాసిగాడుగా పిలువబడే దొమ్మలగొండి (హైనా)వంటి స్కావెంజర్ జంతువుల నుంచి కూడా పొంచి ఉంటుంది. తల్లి పులి ఆహారం కోసం వెళ్లినప్పుడు ఈ జంతువులు పులి పిల్లలకు హాని కలిగిస్తాయి. అందుకే తల్లి పులి తన పిల్లలను గుహల్లో, చెట్టు బొరియల్లో ఉంచి వాటి ఉనికి బయటకు తెలియనంతగా జాగ్రత్త పడుతుంది. ఆహార సేకరణ కోసం పెద్దగా పిల్లలను విడిచి దూరం వెళ్లదు. పిల్లలు కాస్త తిరుగాడే వయస్సు వచ్చినపుడు వాటిని వెంట పెట్టుకునే వేటకు ఉపక్రమిస్తుంది. అప్పుడు పులి పిల్లలు మొదట తల్లి చేసే వేట పద్ధతులను పరిశీలిస్తూ మెల్లమెల్లగా వేటాడేందుకు సిద్ధమవుతాయి.ఆహారం భద్రపరిచి.. కూనల కడుపు నింపిపిల్లి కుటుంబానికే చెందిన చిరుతపులి (లెప్పర్డ్) కూడా రెండు నుంచి మూడు పిల్లలను పెడుతుంది. ఇది కూడా పెద్దపులిలాగే పిల్లల కోసం అత్యంత అప్రమత్తంగా సంచరిస్తుంది. పిల్లి జాతిలో పిల్లి తరువాత చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక పులి చిరుత మాత్రమే.ఈ ప్రత్యేకతను తన పిల్లలకు ఆహారం దాచి పెట్టే విషయంలో ఉపయోగించుకుంటుంది. పిల్లలను భధ్రమైన చోట దాచి వేటకు వెళ్లి తాను చంపి తెచ్చిన వేట జంతువు కళేబరాన్ని పిల్లల ముందు ఆహారంగా వేస్తుంది. అవి తినగా మిగిలిన భాగాన్ని చెట్టు కొమ్మపై భద్రపరచి మరుసటి రోజు మళ్లీ ఆకలిగొన్న పిల్లలకు పెడుతుంది.అంతా.. ఏకాంతం..ఎత్తైన, ముదిరిన వృక్షాల కాండాలపై సహజంగా ఏర్పడ్డ తొర్రలను ఆడ హార్న్‌బిల్ గూడుగా ఎంపిక చేసుకుంటుంది. వయస్సు కొచ్చిన మగపక్షి తనతో జతగట్టేందుకు అంగీకరించిన ఆడపక్షితో కలసి ఇలాంటి తొర్రల్లో ప్రవేశిస్తు్తంది. ఆపై ఆడపక్షి తొర్ర ప్రవేశ మార్గాన్ని చెట్ల బెరళ్లు, కర్ర పుల్లలు, బంక మట్టితో కలిపి మూసివేస్తుంది. గాలి చొరబడేందుకు మాత్రం చిన్న రంధ్రాన్ని మాత్రం ఉంచుకుంటుంది. సమాగమనంతరం మగ పక్షి మూసిన ప్రవేశ మార్గాన్ని తిరిగి తెరుచుకుని బయటకు వస్తుంది.ఆడపక్షి మాత్రం గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసే వరకు గూటిలోనే జైలు జీవితం గడుపుతుంది. మూసివేయబడిన తొర్ర ప్రవేశ మార్గానికి ఏర్పరచిన చిన్నపాటి రంధ్రం ద్వారానే ఆడపక్షికి.. మగపక్షి ఆహారాన్ని అందిస్తుంది. అనంతరం ఆడపక్షి గూటి వెలుపలికి వచ్చి పిల్లలున్న గూటిని తిరిగి మూసి వేస్తుంది. ఆ తరువాత పక్షి దంపతులు కలసి పిల్లల పోషణ భారం వహిస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చి గాలిలో ఎగిరే వరకు ఈ తరహా రక్షణలోనే వాటి పోషణ సాగుతుంది.నీ ప్రేమ భల్లూకం గాను..వన్యప్రాణుల్లో తల్లులన్నింటిలోను ఎలుగుబంటి అమితమైన ప్రత్యేక శైలి కలిగినది. ఆడ ఎలుగు బంటి తన పిల్లలను వాటికి వేగంగా పరిగెత్తగల వయçస్సు వచ్చే వరకు తన మూపున మోసుకుని తిరుగుతూ ఉంటుంది. పుట్టలు తవ్వి చెదపురుగులను, చెట్టు ఎక్కి తేనె పట్టును తెచ్చి పిల్లలకు పెడుతూ ఎంతో ప్రేమ పూర్వకంగా పిల్లలను సాకుతుంది. పిల్లలున్న ఎలుగు బంటి మరింత క్రోధంతో సమీపంలోకి వచ్చే జంతువును, మనిషిని చీల్చి చెండాడుతుంది. ళీ నల్లమలలోని హనీబాడ్జర్ నేల బొరియలలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తమ పిల్లలు ఇతర జంతువుల బారిన పడకుండా బొరియలో ప్రత్యేక గదులు తవ్వుకుని రక్షణ కల్పిస్తాయి. గిజిగాడు పక్షి అందమైన గూళ్లను అత్యంత భధ్రమైన ప్రదేశాలలో (చిటారు కొమ్మలకు నీటి తలం అంచున) కట్టి అందులో గుడ్లను పొదిగి పిల్లలకు నిరంతరం కీటకాలను, ధాన్యం గింజలను ఆహారంగా అందించి పెంచుతుంది.కందిరీగలు వివిధ కీటకాల లార్వాలను తీసుకు వచ్చి గూడులో ఉన్న పిల్లలకు ఆహారంగా పెడతాయి.తేనె టీగలు తెట్టెలో షడ్భుజాకారంలో ఉండే గదుల్లో ఉండే పిల్ల ఈగలకు అవి సేకరించిన మకరందాన్ని ఆహారంగా అందిస్తాయి.రేచుకుక్కలు (వైల్డ్ డాగ్స్) వేట జంతువులను చంపి మాంసాన్ని కడుపులో నిల్వ చేసుకుని తమ పిల్లల వద్దకు వెళ్లి వాటి ముందు మాంస కండలను కక్కి తినిపిస్తాయి. -
మ్యాగ్నెటిస్ట్.. విపిన్..
సాక్షి, సిటీబ్యూరో: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని నానుడి.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ ఉంటుంది. కొందరికి కాయిన్స్ సేకరించడం అలవాటు అయితే మరికొందరికి స్టాంప్స్ సేకరించడం అలవాటు. కానీ అందరికీ భిన్నంగా ఫ్రిడ్జ్ లకు అంటించే బొమ్మల మ్యాగ్నెట్స్ సేకరించడం ఆయనకు అలవాటు. ఆయన వృత్తి కంటి వైద్యం.. ఆయన ప్రవృత్తి ట్రావెలింగ్. అందరి లాగా ఏదో వెళ్లామా.. వచ్చామా అన్నట్టు కాకుండా ఆ ప్రదేశం చరిత్రను అందరికీ తెలియజేసేలా మ్యాగ్నెట్స్ సేకరించడం హాబీగా మలుచుకున్నాడు. అతడి పేరే డాక్టర్ అంథోనీ విపిన్ దాస్.ట్రావెల్లింగ్ ప్రాణం..విపిన్ దాస్ వృత్తి రీత్యా ఎంత బిజీ అయినా కూడా ఖాళీ సమయాల్లో ట్రావెలింగ్ చేయడం ఇష్టం. ట్రావెలింగ్‌తో ఎన్నో అనుభవాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎంతో తెలుసుకున్నానని విపిన్ చెబుతున్నాడు. అయితే ఏదైనా విభిన్నంగా చేయాలనే తలంపుతో కొత్తగా మ్యాగ్నెట్స్ సేకరించడం ప్రారంభించాడు.అలా దాదాపు ఏకంగా 500లకు పైగా మ్యాగ్నెట్స్ సేకరించాడు. అలా ఒక్కో ప్రదేశం చరిత్రను ఒక్కో మ్యాగ్నెట్ రూపంలో ఉండేలా చూసుకున్నాడు. అలా ఎన్నో దేశాలు, ప్రదేశాల చరిత్ర, సంప్రదాయాల గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా ట్రావెరి్నయా ఫెస్ట్‌ను నవంబర్ 15న హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరుపనున్నారు.తెలంగాణ చరిత్ర తెలుసుకునేలా.. సాధారణంగా ఒక్కో దేశం గురించి మ్యాగ్నెట్స్ సేకరించడం విపిన్ కు అలవాటు. కానీ తెలంగాణపై మక్కువతో తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై వినూత్నంగా మ్యాగ్నెట్స్ రూపొందించాడు విపిన్. అంతే కాకుండా తెలంగాణ సంస్కృతిపై మ్యాగ్నెట్స్ తో పాటు.. త్రీడీ బొమ్మలు కూడా రూపొందించారు. దీంతోపాటు అరౌండ్ ది వరల్డ్ పేరుతో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని కూడా రూపొందించాడు.


