యుఎఇ లాటరీలో తొలిసారిగా దిర్హామ్ 100 మిలియన్ (రూ. 240 కోట్లు) గెలుచుకున్న వ్యక్తిగా నిలిచిన తెలంగాణకు చెందిన 29 ఏళ్ల అనిల్‌కుమార్ బొల్లా తన అదృష్టాన్ని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలో ప్రస్తుతం ఆలోచిస్తున్నాడు. ఖమ్మం జిల్లాలోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన అనిల్ ఐటీ రంగంలో పనిచేయడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం అబుదాబికి వెళ్లాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు, తరువాత ఉద్యోగం కోసం అబుదాబికి వెళ్లే ముందు ప్రభుత్వ పాఠశాలలో ఎలా చదువుకున్నాడో గుర్తుచేసుకుంటూ’ఒక టికెట్ నా జీవితాన్ని మార్చివేసింది’ అని ఈ లాటరీ విజేత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనందంగా చెప్పాడు. తనకు విజయాన్ని అందించిన టికెట్ ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉందని, ఎందుకంటే దానిలో తన తల్లి పుట్టిన తేదీని నంబర్ కాంబినేషన్‌లో చేర్చారని అన్నాడు. తన తల్లిదండ్రులు సోదరుడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి తరలించడం తన తొలిప్రాధాన్యత అని అనిల్ చెబుతున్నాడు.
యుఎఇ లాటరీ లో దాదాపు ఒక సంవత్సరం గా పాల్గొంటున్న బొల్లా, గత అక్టోబర్ 18 డ్రా కోసం 12 టిక్కెట్లను కొనుగోలు చేశానని, వాటిలో ఒకటి తనను దిర్హామ్‌ల 100 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను పొందిన మొదటి వ్యక్తిగా నిలిపిందని చెప్పాడు. రాబోయే తన సంపదను ఎలా నిర్వహించాలనుకుంటున్నాడో చెబుతూ తెలివిగా పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తున్నానన్నాడు. ‘ఈ మొత్తాన్ని నేను ఎలా పెట్టుబడి పెట్టాలి – దానిని సరైన మార్గంలో ఖర్చు చేయడం గురించి నేను ఆలోచిస్తున్నాను‘ అని అనిల్ అన్నాడు. ‘గెలిచిన తర్వాత, నా దగ్గర డబ్బు మాత్రమే ఉన్నట్టు నాకు అనిపించింది, కానీ ఇప్పుడు ఇక నా ఆలోచనలు సరైన మార్గంలో ఉండాలి. ఏదైనా భారీగా ప్లాన్ చేయాలనుకుంటున్నాను.‘ అన్నాడు.
తనకు వ్యక్తిగత కలలు ఉన్నాయని, కానీ వాటిని కుటుంబ ప్రాధాన్యతలతో కలిపి సమతుల్యం చేసుకోవాలనుకుంటున్నానని ఆయన అన్నారు. ‘‘నాకు సూపర్ కారు కొనాలనే కల ఉంది.అలాగే గొప్ప రిసార్ట్‌లో లేదా సెవెన్ స్టార్ హోటల్‌లో నా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. నా కుటుంబాన్ని ఇక్కడకు తీసుకువచ్చి వారితో కలిసి నా జీవితాంతం ఆనందించాలనుకుంటున్నాను. మా అమ్మా నాన్నవి చాలా చాలా చిన్న కలలు , నేను వారి కలలన్నింటినీ నెరవేర్చి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాను’’ అని వివరించాడు. అంతేకాకుండా బహుమతిలో కొంత భాగాన్ని ఛారిటీకి ఇవ్వాలనే ప్రణాళికలను కూడా వెల్లడించాడు.
‘‘విరాళాలు నిజంగా సహాయం అవసరమైన వ్యక్తులకు చేరుతాయని నమ్ముతున్నాను కాబట్టి నేను ఛారిటీకి కొంత డబ్బును ఇవ్వాలి అనుకుంటున్నాను. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది’’ అని ఆయన అన్నాడు. తన ప్రయాణం ఇతరులకు ప్రేరణగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నాడు ‘‘ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఆటగాడు ఆడుతూనే ఉండాలని సూచిస్తున్నాను. ఏదో ఒక రోజు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది’’ అంటూ ఉద్భోధిస్తున్నాడు.
మరోవైపు ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో నివసించే అతని తల్లిదండ్రులు మాధవరావు భూలక్ష్మి తమ కొడుకు సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఓ ఆంగ్ల పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ, భూలక్ష్మి ఈ వార్త విన్న తర్వాత తమ కుటుంబం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.‘లాటరీ గెలుపొందినట్లు మేం విన్నాము. మేం చాలా సంతోషంగా ఉన్నాము,‘ అని ఆమె అంటున్నారు.


