డిసెంబర్‌లో వచ్చిన ఆ ఒక్క సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకారణంగా నెట్టింట దూద్ సోడా అనే పానీయం తెగ వైరల్‌గా మారింది. అసలేంటి పానీయం తాగొచ్చా, ఆరోగ్యానికి మంచిదేనా అంటే..
ధురంధర్ సినిమాలో నటుడు గౌరవ్ గేరా ఒక భారతీయ గూఢచారిగా, మొహమ్మద్ ఆలం అనే సోడా విక్రేత వేషంలో కనిపిస్తారు. "డార్లింగ్ డార్లింగ్ దిల్ క్యూ తోడా.. పీలో పీలో ఆలం సోడా" అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఇప్పుడు వైరల్ కావడంతో పాటు, ఈ దూద్ పానీయం పై అందరి దృష్టి పడేలా చేసింది. ఒకరకంగా మరుగున పడిపోతున్నకొన్ని రుచులు మళ్లీ గుర్తుకుతెచ్చేలా ముందుకు తీసుకు వస్తాయి ఈ సినిమాలు.
దూద్ సోడా అంటే..
దూద్ సోడా అనేది పాకిస్తానీకి చెందిన ప్రసిద్ధ పానీయం . లాహోర్, కరాచీ వంటి నగరాల్లో రోజువారీ ఇష్టమైన పానీయం ఇది. చల్లటి పాలు, సోడా, తగినంత చక్కెర కలిపి దీనిని తయారు చేస్తారు. రుచి కోసం కొందరు ఇందులో రోజ్ ఎసెన్స్ లేదా జాజికాయ పొడిని కూడా జోడిస్తుంటారు. పాకిస్తానీ ఆహార సంస్కృతిలో ఒక జ్ఞాపకశక్తినిచ్చే, రిఫ్రెషింగ్ డ్రింక్‌గా పరిగణిస్తారు.
తయారీ..
ప్రముఖ ఫుడ్ బ్లాగర్ 'సాహిలోజీ' ఇటీవల లాహోర్‌లో ఈ పానీయాన్ని ఎలా తయారు చేస్తారో వివరిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. "ముందుగా ఒక గ్లాసులో కొద్దిగా చక్కెర వేసి, ఆపై వేడి వేడి పాలను పోస్తారు. పాకిస్థాన్‌లో మాత్రమే కనిపించే ఒక ప్రత్యేక పద్ధతిలో ఈ పాలను చల్లబరుస్తారు. ఆ తర్వాత, ఎరుపు రంగులో ఉండే కోకాకోలాను ఆ పాల మిశ్రమంలో కలుపుతారు. చివరగా సాంప్రదాయ పద్ధతిలో సోడాను బాగా మిక్స్ చేస్తే నోరూరించే దూద్ సోడా సిద్ధమవుతుంది" అని వీడియోలో ఆయన వివరించారు .చాలా మంది 1:1 లేదా 1.5:1 పాలు-సోడా నిష్పత్తిని ఉపయోగిస్తారు. ఇది పానీయాన్ని క్రీమీగా ఉంచుతుంది. అయితే ఎక్కువమంది ఈ పానీయాన్ని రూహ్ అఫ్జా, రోజ్ సిరప్, తులసి గింజలు లేదా ఏలకులు వంటి రుచులను కూడా జోడించి సేవిస్తారు.
బ్రిటిష్ కాలం నాటిది..
బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ రాకముందే, ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో దూద్ సోడాకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇది బ్రిటీష్ కాలం నాటిది. ఉత్తర భారతదేశంలో దీన్ని తయారు చేసేవారు కూడా. అప్పట్లో స్థానిక హకీంలు నిర్వహించే సోడా ఫౌంటైన్లలో రోజ్, ఖుస్, నిమ్మకాయతో పాటు ఈ పాల సోడాను కూడా ప్రయోగాత్మకంగా తయారు చేసేవారు.
వాస్తవానికి ఈ పానీయం విక్టోరియన్ ఇంగ్లాండ్‌లో పుట్టి, బ్రిటిష్ సామ్రాజ్యం ద్వారా భారతదేశానికి చేరుకుంది. 1947 దేశ విభజన తర్వాత, పాకిస్థాన్‌లో ఇఫ్తార్ సమయంలో తాగే ప్రధాన పానీయంగా ఇది మారిపోయింది. అక్కడ దీనిని 'రూహ్ అఫ్జా'తో కలిపి ఎక్కువగా తీసుకుంటారు. అటు భారతదేశంలో పంజాబ్, పాత ఢిల్లీ, అమృత్‌సర్ వంటి ప్రాంతాల్లో ఈ పానీయం నేటికీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
ఎవరికి మంచిదకాదంటే..
ఈ పానీయం కడుపులోకి వెళ్లగానే చాలామందికి కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలిగే అవకాశాల ఉంటాయి. ఒక్కోసారి గుండెల్లో మంట, అరుగుదలలో సమస్యలు వస్తుంటాయి. ఇందులో సోడా ఉపయోగించడం వల్ల ప్రేగులపై కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. పాలు తేలికపాటి ఆమ్లతను ఉపశమనం చేసినా..ఇందులో ఉపయోగించే సోడా వల్ల జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
లాక్టోస్ పడనివారు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నావారునివారించడమే ఉత్తమం అని చెబుతున్నారు. అతిగా తాగితే మాత్రం బరువు పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు నిపుణులు.
(చదవండి: హీరో మహేశ్ నేర్చుకుంటున్న కలరిపయట్టుతో..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!)


