విన్స్‌మోర్‌ | Sanae Takaichi Wins Snap Election in Japanese parliamentary elections | Sakshi
Sakshi News home page

విన్స్‌మోర్‌

Feb 11 2026 1:24 AM | Updated on Feb 11 2026 1:41 AM

Sanae Takaichi Wins Snap Election in Japanese parliamentary elections

‘నీ దగ్గర సైన్యం లేదు... మరచిపో... నీ దగ్గర ఆయుధం లేదు... మరచిపో... అయితే ఆశ... అనే అద్భుతాన్ని మాత్రం ఎప్పుడూ మరచిపోవద్దు. ఆ ఆశే నీ ఆయుధం అవుతుంది... సైన్యం అవుతుంది’... అనేది జపాన్‌ ప్రఖ్యాత నాయకుడు షింజో అబే మాట. ఆ మాటే సనై తకాయిచికి ధైర్యాన్నిచ్చింది. ‘జపాన్‌ ఐరన్‌ లేడీ’ని చేసింది. గత సంవత్సరం జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన తకాయిచి... తాజాగా జపాన్‌ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో (ముందస్తు) ఘన విజయం సాధించారు...

మూడు నెలల్లోనే పార్లమెంట్‌ను రద్దుచేసి, ఎన్నికల బరిలోకి దిగడం ఆషామాషీ విషయం కాదు. తమ మీద తమకు గట్టి నమ్మకం ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఆ నమ్మకం ఎప్పుడూ తకాయిచితోనే ఉంది. అందుకే ఆమె సనై తకాయిచి అయ్యారు! తాజా ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోసారి తానేమిటో నిరూపించుకున్నారు.

టకాయిచి టాక్‌ చాతుర్యం... అమోఘం!
తకైచి గురువు షింజో అబే. ఆయన వాక్చాతుర్యం అంటే తకైచికి బాగా ఇష్టం. షింజో జపాన్‌లోని ప్రముఖ ప్రజానాయకుడు. లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎల్‌డీపీ) అధ్యక్షుడు అయిన షింజో అబే జసాన్‌ చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. ‘ప్రజలతో కలిసి పనిచేస్తున్నంత కాలం నాకు వేరే శక్తి అవసరం లేదు. ప్రజలే నా శక్తి. ఆ శక్తితో ఎన్ని రకాల సవాళ్లనైనా ఎదుర్కోగలను’ ‘మనిషికి ఆశ ఎప్పుడూ ఉండాలి. ఆ ఆశే అయుధం. కలను సాకారం చేసుకునే సాధనం’... గురువు నోట వినిపించే ఇలాంటి మాటలు అంటే తకాయిచికి చాలా ఇష్టం. ‘ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తుంటే ఎవరో పరాయి వ్యక్తి వచ్చి మాట్లాడినట్లు ఉండకూడదు. మన ఊరి వ్యక్తో, కుటుంబ సభ్యులో మాట్లాడుతున్నట్లు సహజంగా ఉండాలి.’.. అని చెప్పకనే చెప్పినట్లుగా ఉంటుంది షింజో అబే వాక్చాతుర్యం. అలాంటి సహజ వాక్చాతుర్యాన్ని సొంతం చేసుకున్నారు తకాయిచి.

ధైర్యమే దారి చూపింది
అమెరికాలో యూనివర్శిటీ విద్య పూర్తయిన తరువాత స్వదేశానికి తిరిగి వచ్చిన తకాయిచి కొంత కాలం టీవీ యాంకర్‌గా పనిచేశారు. 1996లో లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీలో చేరారు. ఆ పార్టీ అగ్రనేత షింజో అబేకు ప్రియ శిష్యురాలు అయ్యారు. అంతర్గత వ్యవహారాలు, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎల్‌డీపీ) 2024లో ఉభయ సభలలో మెజారిటీ కోల్పోయింది. కొమైటో పార్టీతో దశాబ్దాల పొత్తు కూలిపోయింది. ఎటు చూసినా నిరాశే అన్నట్లుగా ఉంది పరిస్థితి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యం, ఆశ కోల్పోలేదు తకాయిచి. 

ఆమెకు ప్రజలలో ఉన్న ఆదరణే పార్టీని నిలబెట్టింది. గత ఏడాది ఆమె ప్రధానిగా ఎన్నికైనప్పుడు... ‘ప్రధానిగా తకాయిచి ఎన్నిక పార్టీకి అదృష్టాన్ని తెస్తుందా?  పార్టీని పునర్జీవింపజేస్తుందా?’ అనే ప్రశ్న వేశారు రాజకీయ విశ్లేకులు. ఆ ప్రశ్నకు తాజా విజయం జవాబు చెప్పింది. తకాయిచి పాలనకు జనం ఆమోదముద్ర వేశారు. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. తకాయిచి దారి... రహదారి!

వర్క్‌ వర్క్‌ వర్క్‌ అండ్‌ వర్క్‌!
‘వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి’ అనే మాట ఎప్పుడూ వినబడుతూ ఉంటుంది. అయితే ఈ సమన్వయ ధోరణికి తకాయిచి వ్యతిరేకం.
‘దేశం కోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలి. వర్క్‌ వర్క్‌ వర్క్‌ అండ్‌ వర్క్‌. అందరూ గుర్రంలా పనిచేయాలి’ అంటారు తకాయిచి.
‘వర్క్‌ వర్క్‌ వర్క్‌ అండ్‌ వర్క్‌’ అనే మాట జపాన్‌లో బాగా పాపులర్‌ అయింది. ప్రతి సంవత్సరం జపాన్‌లో విడుదల చేసే పాపులర్‌ మాటల పుస్తకంలో ఈ మాట చేరింది!

ఆ దూకుడు... ఇప్పటికీ!
చిన్నప్పుడు సనై తకాయిచికి ‘బైకర్‌ అమ్మాయి’ అని పేరు. జపాన్‌ రోడ్లపై స్పీడ్‌గా దూసుకెళ్లేది. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత బైక్‌ డ్రైవింగ్‌కు దూరమైనా ఆ దూకుడు, స్పీడ్‌ మాత్రం తగ్గలేదు. అదే ఆమె ఎనర్జీ! కరుడు కట్టిన సంప్రదాయవాది, జాతీయవాదిగా ముద్ర పడినప్పటికీ ఆమె గిరి గీసుకొని కూర్చోలేదు. కొరియన్‌ సంగీతం, నాటకాలను బాగా ఇష్టపడతారు.

యస్‌... ఇప్పటికీ డ్రమ్స్‌ మోగాల్సిందే!
యూనివర్శిటీ రోజుల్లో సరదాగా డ్రమ్స్‌ వాయించడమే కాదు ఒక మ్యూజిక్‌ బ్యాండ్‌లో కూడా చేరారు సనై తకాయిచి. పాకెట్‌మనీకి సరిపడ డబ్బులు వచ్చేవి! మరి ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆ డ్రమ్స్‌ మూలన పడ్డాయా? గత జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయా?

అదేమీ కాదు. ఆమె ఇప్పటికీ డ్రమ్స్‌ వాయిస్తారు. వేదికలపై కాదు... ఇంట్లోనే! రాజకీయ రణరంగంలో బోలెడు ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి బయట పడడానికి, తనను తాను రీఛార్జ్‌ చేసుకోవడానికి ఇప్పటికీ డ్రమ్స్‌ వాయిస్తుంటారు.

గత నెల జపాన్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో చర్చలు జరిపారు తకాయిచి. చర్చలు పూర్తయిన తరువాత ఇద్దరూ సరదాగా కె–పాప్‌ పాటలు పాడుకున్నారు. డ్రమ్స్‌ ప్లే చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement