ప్రధాని సనే తకాయిచీ అనూహ్య నిర్ణయం
టోక్యో: జపాన్ ప్రధానమంత్రి సనే తకాయిచీ అనూహ్య నిర్ణయం తీసుకు న్నారు. పార్లమెంట్‌ను రద్దు చేసి, తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం టోక్యోలో జరిగిన మీడియా సమావేశంలో తకాయిచీ ఈ విషయం ప్రకటించారు. పార్లమెంట్‌లోని శక్తివంతమైన దిగువ సభను ఈ నెల 23వ తేదీన రద్దు చేస్తానని వెల్లడించారు.
ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు నిర్వహించడం ద్వారా తమకున్న ప్రజామద్దతును దిగువ సభలో అత్యధిక మెజారిటీ సాధించేలా మల్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇది అత్యంత కఠినమైన నిర్ణయం. ప్రజలతో కలిసి జపాన్ పురోగమనాన్ని ఖరారు చేసే నిర్ణయం. తకాయిచీ ప్రధాని పదవికి అర్హురాలా, కాదా? అన్నది ప్రజలు తేల్చే నిర్ణయం’అని ఆమె వ్యాఖ్యానించారు. గతేడాది అక్టోబర్ 21వ తేదీన దేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తకాయిచీకి, ఆమె కేబినెట్‌కు ప్రజల మద్దతు ఉంది.
అయితే, ఆమె లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ(ఎల్‌డీపీ) మాత్రం ప్రజాదరణలో వెనుకబడింది. అయిదేళ్ల కాలంలో ప్రధానిగా పీఠం ఎక్కిన నాలుగో ఎల్డీపీ నేత తకాయిచీ. దీంతో, ఆకస్మిక ఎన్నికల వ్యూహం ఏమేరకు ఫలిస్తుందన్నది తెలియాల్సి ఉంది. దిగువ సభలోని 465 మంది సభ్యుల ఎన్నికకు సంబంధించిన ప్రచారం ఈ నెల 27వ తేదీ నుంచి మొదలుకానుంది. 1955 నుంచి జపాన్‌లో అత్యధిక కాలం ఎల్డీపీయే అధికారంలో ఉంది. ఈ పార్టీకి దిగువ సభలో 199 మంది సభ్యుల బలముంది. మాజీ ప్రధాని షింజో అబే శిష్యురాలిగా తకాయిచీకి పేరుంది. షింజో అబే తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలుగా తకాయిచీ నిలిచారు.


