సక్సెస్ అనేది ఎంతో కష్టపడి సాధించుకోవాల్సిందే. అలుపెరగని పోరాటం, కఠిన శ్రమ తోడు అయితే గానీ గెలుపుని పాదాక్రాంతం చేసుకోలేం. అంత కష్టపడ్డా ఒక్కోసారి దోబుచులాడి బాధపెడుతుంటుంది. ఓర్పుతో పోరాడితే ఓటమిని ఓడించి విజయాన్ని వశం చేసుకోగలం. అలా కష్టపడి శదేశానికి సేవ చేసే అత్యుతన్న హోదాని కైవసం చేసుకున్నాడు భవ్య షా. భవ్యమైన అతడి సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..
భవ్య షా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన అబ్బాయి. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసులోనే భాద్యతలు తీసుకుంది. పూణేలోని కళాశాలలో చదువుతున్నప్పుడే మెక్‌డొనాల్డ్స్ కౌంటర్‌లో పార్ట్‌టైమ్ పనిచేసేవాడు. ఆ ఉద్యోగం అతడికి తనను తాను పోషించుకోవడం తోపాటు, క్రమశిక్షణ, సమయ నిర్వహణ, స్వతంత్రంగా వ్యవహరించడం వంటి విలువైన జీవిత పాఠాలను నేర్పింది.
ఒకపక్క పార్ట్‌టైం ఉద్యోగం, మరోవైపు చదువు సాగిస్తున్నప్పుడే ఎదురయ్యే నిరుత్సాహాన్ని ఎలా బలంగా మార్చుకోవాలో నేర్చుకున్నాడు. చదువు, పనిని అంకితభావంతో చేస్తూనే..దేశానికి సేవ చేయాలనే తన డ్రీమ్‌ని అస్సలు మర్చిపోయేవాడు కాదు. ఆ తర్వాత నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC), ఎయిర్ వింగ్‌లో చేరినప్పుడు భవ్య జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. NCC శిబిరాలు, శిక్షణ ద్వారా, అతను క్రమశిక్షణా జీవితాన్ని అనుభవించాడు.
ఆ తర్వాత మైక్రోలైట్ ఫ్లయింగ్‌లో అనుభవం గడించాడు. ఆ అనుభవం భారత వైమానిక దళంలో పైలట్‌గా చేరాలనే లక్ష్యానికి నాంది పలికింది. అలా భవ్య షా సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB)కి ప్రిపరయ్యేందుకు సన్నద్ధమయ్యాడు. ఆ క్రమంలో ఎన్నో తిరస్కరణలు, వైఫల్యాలు ఎదుర్కొనక తప్పలేదు. అయితే సాధించేంత వరకు ఆపేదే లే అన్నట్టు మరింత దృఢనిశ్చయంతో ఆ ఎగ్జామ్‌కి ప్రపేరయ్యాడు.
చివరికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో చేరినప్పుడు తన కల సఫలమైంది. శిక్షణ పొందిన కేవలం మూడు నెలలలోనే, భవ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరిట్ జాబితాలో స్థానం సంపాదించి IAF పైలట్ కావాలనే తన చిరకాల కలను సాకారం చేసుకున్నాడు. ఏళ్ల తరబడి కృషి, సంకల్పం, సడలని ఆత్మవిశ్వాసంతో తన కలను సాకారం చేసుకుని స్ఫూర్తిగా నిలిచాడు భవ్యషా.
అతడు సదా "తగ్డా రహో"(ఎల్లప్పుడూ బలంగా, ఆరోగ్యంగా ఉండటం)ని విశ్వసిస్తుంటాడు. కష్టాల్లో బలంగా, ప్రయత్నంలో స్థిరత్వం, శక్తివంతమైన ఆత్మవిశ్వాసమే గెలుపుని పాదాక్రాంతం చేసుకునే ఆయుధాలని తన విజయంతో చెప్పకనే చెప్పాడు భవ్యషా.
(చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గార్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..)


