చాలా మందికి కదలడం కూడా కష్టంగా ఉండే వయస్సులో ఆ నటి నృత్యం చేస్తున్నారు. చురుకైన కదలికలు, వన్నె తరగని ముఖ వర్ఛస్సుతో ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఆమె ప్రముఖ సీనియర్ నటి–నర్తకి వైజయంతిమాల బాలి. ప్రస్తుతం 92 ఏళ్ల ఈ ఐకానిక్ సంగం స్టార్ ఇప్పటికీ తరగని తేజస్సుతో కళాత్మక శక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ట్వింకిల్ టోస్ అని ప్రేమగా పిలువబడే ఆమె, ఒక ప్రదర్శనకారిణి, గురువు, పండితురాలు సాంస్కృతిక సంరక్షకురాలిగా బహుళ పాత్రలను సజావుగా సమతుల్యం చేసుకుంటున్నారు. ప్రేక్షకులను తన ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేశారు, భావోద్వేగ లోతు శాస్త్రీయ వైభవంతో నిండిన ప్రదర్శన సమర్పించారు.
నాట్యమే...ఆరోగ్యం
ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా , తన శారీరక బలాన్ని మానసిక స్పష్టతను నిలబెట్టిన సూత్రాల గురించి వైజయంతిమాల మీడియాతో పంచుకున్నారు. నిర్మాణాత్మక జీవనం, బుద్ధిపూర్వక ఆహారం వీటన్నింటితో పాటు భరతనాట్యం పట్ల అచంచలమైన నిబద్ధత తదనుగుణ శారీరక శ్రమల సమ్మేళనమే తన దీర్ఘాయువు రహస్యం అంటారామె. తన జీవితంలో భరతనాట్యం కేంద్ర శక్తిగా మిగిలిపోయిందని వైజయంతిమాల వివరించారు. ప్రస్తుతం ఆమె ప్రతిరోజూ సాధన చేయకపోవచ్చు, కానీ ఎంపిక చేసిన యువ విద్యార్థుల బృందానికి శిక్షణ ఇవ్వడం ద్వారా తన జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. తన రోజులో మిగిలిన గంటలు పరిశోధనలో పెట్టుబడి పెడతారు, ఇది ఆమె దశాబ్దాలుగా అనుసరించిన కళారూపంతో మేధోపరంగా నిమగ్నమై ఉండటానికి వీలు కల్పిస్తుంది.
మితాహారం...యోగా ధ్యానం...
ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె దినచర్య గురించి మరింత విపులంగా వెల్లడయింది. ఆ ఛానల్ ప్రకారం, వైజయంతిమాల తన ఉదయాలను క్రమం తప్పని నడకలతో ప్రారంభిస్తుంది, ఈ అలవాటు శరీరాన్ని అప్రమత్తంగా శక్తివంతం చేస్తుందని ఆమె నమ్ముతుంది. ఆమె ఆరోగ్య దినచర్యలో స్థిరమైన యోగాభ్యాసం ధ్యానం కూడా భాగమై ఉంటాయి, ఆహారం కూడా ఆమె చురుకైన జీవనశైలిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె సాంప్రదాయ శాఖాహార దక్షిణ భారత భోజన శైలికి కట్టుబడి ఉంటారు.
ఆమె ఉదయం పూట తరచుగా దోస, ఊతప్పం లేదా ఉప్మా వంటి సుపరిచితమైన అల్పాహారాలను తీసుకుంటారు, అదే విధంగా తాజా పండ్ల రసంతో పాటు. పోషకాలతో నిండిన తేలికపాటి భోజనం చేస్తారు. భోజనంలో సాధారణంగా బియ్యంతో రసం లేదా పప్పు చావల్ వడ్డిస్తారు. సాయంత్రం వేళలో ఆమె పండ్ల రసం లేదా కొద్దిగా పొడి పండ్ల వంటి తేలికపాటి రిఫ్రెష్‌మెంట్‌లను ఇష్టపడతారు. రాత్రి పూట ఆహారం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా తన డిన్నర్ కూరగాయలతో రోటీ లేదా పప్పు చావల్ లలో ముగుస్తుంది. నమ్మిన వృత్తి పట్ల నిబద్ధత క్రమశిక్షణతో కూడిన జీవనశైలి నిత్యనూతనంగా ఉంచే అభిరుచులు కలగలిపిన మనిషి వయసుతో సంబంధం లేని ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు అనే దానికి వైజయంతిమాల బాలి జీవితం ఓ నిదర్శనం.


