టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మరో రంగంలోనూ సత్తా చాటనున్నారు. అగ్రస్థాయి నటుడుగా, చిన్నితెర పై టాప్ హోస్ట్‌గా, నిర్మాత, స్టూడియో అధినేత... వంటి బహుముఖ పాత్రలతో రాణిస్తున్న నాగ్... ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో సినిమా పంపిణీదారుగా కూడా కొత్త పాత్ర పోషించనున్నారు. పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన సినీ పంపిణీ రంగంలోకి లాంఛనంగా అడుగుపెట్టారు, రాబోయే సంవత్సరాల్లో తన పంపిణీ సామ్రాజ్యాన్ని గణనీయంగా విస్తరించాలని యోచిస్తున్నారు.
బాలీవుడ్ బాటలో...
ప్రస్తుతం తెలుగు హీరోలలో ఎవరూ పంపిణీ రంగంలో లేని పరిస్థితుల్లో.. ఈ రంగంలోకి దిగిన తొలి తెలుగు హీరోగా నాగార్జున నిలవనున్నారు. బాలీవుడ్ లో చూస్తే రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్ మెంట్ పేరిట షారూఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, దక్షిణాది హీరోల్లో రాజ్ కమల్ ఫిలింమ్స్ ఇంటర్నేషనల్ పేరిట కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్...వంటివారు పంపిణీ రంగంలో ఉన్నారు. ఈ హీరోలు ముఖ్యంగా బాలీవుడ్ హీరోల స్ఫూర్తితోనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. తెరపై పాత్రల ఎంపిక విషయంలో మాత్రమే కాదు వాణిజ్య ప్రణాళికల విషయంలోనూ ఎప్పుడూ మిగిలిన వారికంటే ఓ అడుగు ముందే నాగ్ ఉంటారనేది గతంలో ఎన్నోమార్లు రుజువైన విషయం.
తెలుగు రాష్ట్రాల్లో కార్యాలయాలు...
అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక పంపిణీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు విశాఖపట్నంలో కూడా కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది, ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విస్తరణకు సంకేతంగా చెప్పుకోవచ్చు. దాదాపు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న నిర్మాణ సంస్థ నాగార్జున స్వంతం. ఇప్పుడు ఆయన మరిన్ని సినిమాలను నిర్మించాలని మరోవైపు తన పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని యోచిస్తున్నారని తెలుస్తోంది..ఆర్థికపుష్టి ఉన్న అగ్రహీరోల్లో ఒకరైన నాగార్జున డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టడం ప్రస్తుత అగ్రగామి పంపిణీదారులకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
పోటాపోటీ...పంపిణీ
తెలుగు రాష్ట్రాలలో పంపిణీ రంగం ఇప్పటికే పలు మార్పులకు నిదర్శనంగా నిలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు సిండికేట్‌గా మారాయి. ఈ నేపధ్యంలో నాగార్జున ప్రవేశంతో రెండు రాష్ట్రాల్లో పంపిణీ ఆధిపత్యం కోసం జరిగే పోరు మరింత తీవ్రమవుతుందని సినీ పరిశీలకులు భావిస్తున్నారు. నిజాం, వైజాగ్ ప్రాంతాలలో ప్రధాన పంపిణీదారుగా దిల్ రాజు కొనసాగుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పంపిణీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత, చాలా మంది నిర్మాతలు మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్‌తో, ముఖ్యంగా నిజాం ప్రాంతంలో, భాగస్వామ్యం కావడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా, ఏషియన్ థియేటర్స్‌కు చెందిన సునీల్, సురేష్ బాబులు కొన్ని ఎంపిక చేసిన ప్రాజెక్టుల పంపిణీ బాధ్యతలు చేపడుతున్నారు.
మారనున్న స్నేహాలు...
గత కొంత కాలంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రాలను దిల్ రాజు, క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నారు. అయితే, నిజాం ప్రాంతంలో ఇటీవల తన పంపిణీ కార్యాలయాన్ని ప్రారంభించిన అన్నపూర్ణ స్టూడియోస్‌తో ఇకపై నాగవంశీ భాగస్వామ్యం కావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరం బహుళ చిత్రాలను విడుదల చేస్తూన్న నాగవంశీ తెలుగు సినిమాలో అత్యంత చురుకైన విజయవంతమైన నిర్మాతలలో ఒకరనేది తెలిసిందే అంతేకాక దిల్ రాజుతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఈ మార్పు కార్యరూపం దాల్చితే, నిజాం ప్రాంతంలో దిల్ రాజు ఆధిపత్యానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించవచ్చు.
ఓ వైపు పంపిణీదారులుగా మారుతున్న నిర్మాతల సంఖ్య పెరుగుతుండడం, సురేష్ బాబు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్ వంటి పంపిణీ రంగంలో స్థిరపడిన వారికి సవాలు గా మారనుందని, నాగార్జున ప్రవేశం తెలుగు సినిమా పంపిణీ వ్యాపారాన్ని పునర్నిర్వచించబోతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.


