గతేడాది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన మూవీ దురంధర్. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా బాలీవుడ్‌లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే ఈ మూవీ గురించి స్టార్ హీరో అమిర్ ఖాన్ మాట్లాడారు. అలా జరిగి ఉంటే దురంధర్‌కు ఇంకా వసూళ్లు వచ్చేవని అన్నారు. మనదేశంలో థియేటర్ల కొరత వల్లే దురంధర్ వసూళ్లు ఇంకా తగ్గాయని వెల్లడించారు. పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాలంటే దేశానికి మరిన్ని థియేటర్స్ అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరముందని తెలిపారు.
ధురంధర్ లాంటి సినిమాకు చైనీస్ సినిమాలకు లభించినంత థియేటర్స్ ఉండి ఉంటే..మరింత భారీ వసూళ్లు సాధించి ఉండేదని అన్నారు. భారత్‌లో తగినన్ని థియేటర్స్ లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. చైనాలో ఉన్నంత మౌలిక సదుపాయాలు మన దేశంలో ఉండి ఉంటే బాగుండేదని అన్నారు.
థియేటర్స్ మరింత అవసరం..
ఇండియాలో మరిన్ని థియేటర్స్ నిర్మించాల్సిన అవసరముందని తాజా ఇంటర్వ్యూలో అమిర్ ఖాన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కేవలం 9 వేల స్క్రీన్‌లు మాత్రమే ఉన్నాయని.. చైనాలో సుమారు లక్ష స్క్రీన్‌లు ఉన్నాయని తెలిపారు. అందుకే చైనాలో ఒక పెద్ద సినిమా విడుదలైనప్పుడు భారీగా బిజినెస్ జరుగుతుందదన్నారు. కేవలం చైనాలో మాత్రమే అక్కడి పెద్ద సినిమాలు బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తాయన్నారు. మనం మన స్క్రీన్‌ల సంఖ్య పెంచితేనే అది సాధ్యమవుతుందని అమిర్ ఖాన్ సూచించారు.
గతేడాది చైనీస్ చిత్రం 'నె ఝా 2' ఆ దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ మూవీతో పోలిస్తే 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన ధురంధర్.. దేశీయంగా 115 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లు) మాత్రమే రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 150 మిలియన్ డాలర్ల కంటే తక్కువ వసూలు చేసిందని తెలిపారు.
మరింత భారీ వసూళ్లు..
మనదేశంలో కూడా మరిన్ని స్క్రీన్‌లు అందుబాటులో ఉంటే భారతీయ సినిమాలు గొప్ప విజయాన్ని సాధించేవని అమిర్ ఖాన్ తెలిపారు. మనదేశంలో రూ.1000 కోట్ల వసూలు చేసిన దురంధర్.. 5 వేల స్క్రీన్స్ కాకుండా.. 15,000 స్క్రీన్‌లలో విడుదలై ఉంటే మరింత భారీ విజయం సాధించి ఉండేదన్నారు. థియేటర్స్ సంఖ్య పెరిగినప్పుడే నిజమైన మార్పు కనిపిస్తుందని.. ఎందుకంటే ప్రస్తుతం మనదేశంలో ఒక్క స్క్రీన్ కూడా లేని జిల్లాలు చాలా ఉన్నాయని ఆమిర్ ఖాన్ అన్నారు. కాగా.. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇక అమిర్ ఖాన్ విషయానికొస్తే.. గత సంవత్సరం 'సితారే జమీన్ పర్' చిత్రంలో కనిపించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత 'హ్యాపీ పటేల్', రజనీకాంత్ 'కూలీ' చిత్రాల్లో అతిథి పాత్రలలో మెరిశారు.


