రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
ఆరోగ్యంగా మంచి ఫిజిక్‌తో తమ వయసు కన్నా బాగా తక్కువున్నట్టు కనిపించే ఎవరిని ఫిట్నెస్ సీక్రెట్ చెప్పమన్నా....సాధారణంగా వచ్చే సమాధానాలు అన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ‘‘ఉదయాన్నే లేస్తాను, వ్యాయామం చేస్తా, తాజా పండ్లు తింటాను..దురలవాట్లకు దూరంగా ఉంటా, రాత్రుళ్లు త్వరగా నిద్రపోతా, కనీసం 7గంటలైనా నిద్ర ఉండేలా చూసుకుంటా...’’వంటివి. అయితే వీటన్నింటికీ భిన్నంగా చెబుతున్నాడో హీరో. మరో రెండు నెలల్లో 60ఏళ్ల వయసుకు చేరుకోబోతున్న ఆ హీరో ఇప్పటికే సిక్స్ ప్యాక్ మాత్రమే కాదు ఎయిట్ ప్యాక్ కూడా చేసేశాడు. అది కూడా మద్యం సేవించడం, రాత్రుళ్లు నిద్రపోకపోవడం...వంటివి చేస్తూనే... ఎవరా హీరో? ఏమాతని కధ?వచ్చే నవంబర్ 2వ తేదీ నాటికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)కు 60 ఏళ్లు నిండుతాయి, కానీ అతని వయస్సులో సగం ఉన్న పురుషులను కూడా సిగ్గుపడేలా చేసే శరీరాకృతి అతని స్వంతం. గత ఎన్నో సంవత్సరాలుగా గ్రీకు వీరుని తలపించే ఫిజిక్‌తో ఈ సూపర్ స్టార్ కొనసాగుతున్నాడు. ఇటీవలే తన ఫిట్నెస్ అలవాట్లు ఆహార క్రమశిక్షణ గురించి మీడియాతో పంచుకున్నాడు. బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో లాగే ఇప్పటికీ తనను చురుగ్గా కనిపించేలా చేసే దినచర్యల గురించి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నేషనల్ అవార్డ్ విన్నర్ వివరించాడు.‘నేను ఉదయం ఐదు గంటలకు పడుకుంటాను అంతేకాదు.. తొమ్మిది లేదా పది గంటలకు మేల్కొంటాను‘ అని ఆయన చెప్పాడు. అంతేకాదు రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు పని ముగించుకుని తాను ఇంటికి తిరిగి వస్తానన్నాడు. అప్పుడు ఆ టైమ్‌లోనే తాను వ్యాయామం చేస్తానని చెబుతున్నాడు. బహుశా చాలా మందికి ఇది అసాధ్యం., కానీ షారూఖ్‌కు కొన్ని సంవత్సరాలుగా అది సాధారణం. వ్యాయామం చేసి, స్నాన ం అన్నీ పూర్తి చేసుకుని తెల్లవారుఝామున 5గంటలకు నిద్రపోతాడన్నమాట. అంతేకాదు ఆసక్తికరంగా, షారూఖ్ తాను పండ్లు తిననని చెబుతున్నాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారి నుంచి సాధారణంగా ఇలాంటి మాట వినడం # జరగదు. ఆయన తన మందు అలవాటు గురించి మాట్లాడుతూ...‘‘ఒక నిర్దిష్ట పాత్ర కోసం ఒక షేప్ లోకి రావాలంటే మాత్రం ఆల్కహాల్‌ను మానేస్తాను అని చెప్పాడు. దానితో పాటే తెల్ల రొట్టె, తెల్ల బియ్యం, స్వీట్లు కూడా అంటూ వివరించాడు. కొన్నిసార్లు ఐస్ క్రీం లేదా చాక్లెట్ తింటాను అంటున్న షారుఖ్ జంక్ ఫుడ్ లేదా డెజర్ట్‌లను తానేమీ ప్రత్యేకంగా ఇష్టపడనని చెప్పాడు. అంతేకాదు తందూరీ చికెన్ అంటే తాను పడి చస్తానంటున్నాడీ హీరో.దశాబ్దాలుగా ఆయన వదల్లేని వంటకం ఏదైనా ఉంటే, అది తందూరీ చికెన్. దీనిని తన కంఫర్ట్ ఫుడ్ అని పేర్కొంటూ నేను దీనికి బానిసని చెప్పాలి. అవసరమైతే నేను సంవత్సరంలో 365 రోజులు ఇదే తినగలను’’ అన్నాడు.మరి మంచి లక్షణాలు, అలవాట్లు ఏమీ లేవా అంటే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కఠినమైన వ్యాయామం, ప్రోటీన్ అధికంగా ఉండే, శుభ్రమైన భోజనం తన ఆహారం, తన ఎవర్ గ్రీన్ ఎనర్జీకి ఆధారం అంటాడు షారుఖ్. తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ ‘నేను గ్రిల్డ్ చికెన్, లీన్ మీట్స్, పప్పుధాన్యాలు తీసుకుంటాను. గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటాను‘ అని స్పష్టం చేశాడు. ‘నేను తక్కువ పరిమాణంలోనే ఆహారం తీసుకుంటాను. ‘ అని ఆయన చెప్పాడు. ఇది వివిధ సినిమా పాత్రల డిమాండ్లకు అనుగుణంగా తన శరీరాన్ని త్వరగా మార్చుకోవడానికి తాను అనుసరించే వ్యూహం అని చెప్పాడు.సినిమా సెట్లలో తయారుచేసిన ఆహారానికి బదులుగా ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినడానికి ఇష్టపడతాడు. అతని సాధారణ మధ్యాహ్నం భోజనంలో తరచుగా చేపలు లేదా తందూరీ చికెన్ ఉంటుంది, కొన్నిసార్లు బీన్ స్ప్రౌట్స్ లేదా ఏదైనా వెజ్‌కర్రీ జతవుతుంది. ‘సాధారణంగా తందూరీ రోటీతో తందూరీ చికెన్, అప్పుడప్పుడు మటన్ డిష్‘ అంటూ తన డిన్నర్ మెనూ వివరిస్తాడు.ఆయన భార్య చిత్ర నిర్మాత ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ ‘డైజెస్టివ్ బిస్కెట్లతో మంచి ఐస్ క్రీం‘ అని పిలిచే దానిని తయారు చేస్తారు. మీ 50 ఏళ్ల వయసు దాటాక ఫిట్‌గా ఉండటం అంటే విపరీతమైన భోజన ప్రియత్వమో, దురలవాట్లో కాదు అలాగే ఆకలితో అలమటించడం కూడా కాదు. శరీరానికి ఏది పని చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం అంటాడు షారూఖ్.