
సాక్షి, బంజారాహిల్స్: ఏఐ టెక్నాలజీతో ఓ బాలీవుడ్ నటుడి ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేస్తూ ఆయన స్నేహితులకు, దర్శక, నిర్మాతలకు, కుటుంబ సభ్యులకు పోస్ట్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న యువతిపై బంజారాహిల్స్‌లో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నివాసి, ఫ్రీలాన్స్ నటుడు ఆనంద సురేష్ కుమార్ రెన్వా (36)ను జియా ఉనిస్సా నస్రీన్ అనే మహిళ మూడు సంవత్సరాలుగా నిరంతరం వేధిస్తోంది.
ఏఐతో మార్ఫింగ్
అతని ఇన్‌స్ట్రాగామ్, వాట్సప్, ఫోన్ అకౌంట్స్ హ్యాక్ చేసి, అతని పేరుతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన సెమీ న్యూడ్, న్యూడ్ ఫోటోలు, వీడియోలు సృష్టించింది. ఆ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను పరిశ్రమలోని దర్శకులకు, రెండు ప్రొడక్షన్ హౌస్‌లకు పంపించి అరాచకానికి పాల్పడిందని, ఈ కారణంగా తన వృత్తిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ బాధిత నటుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సోదరికి సైతం అశ్లీల సందేశాలు
దాదాపు 15 నుంచి 20 నకిలీ ఖాతాల ద్వారా అతన్ని అవమానపరిచేలా పలు సందేశాలను, వీడియోలను పంపింది. అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడిందని, హృద్రోగ లక్షణాలు కూడా వచ్చాయని బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా అతని సోదరికి కూడా అశ్లీల సందేశాలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్