టైటిల్: వనవీర
నటీనటులు : అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, నందు, ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి, తదితరులు
నిర్మాణ సంస్థ: సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్
నిర్మాతలు : అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి
దర్శకత్వం: అవినాష్ తిరువీధుల
సంగీతం: వివేక్ సాగర్
విడుదల తేది: జవవరి 1, 2026
కథేంటంటే..
అగ్ర కులానికి చెందిన దేవా(నందు).. ఈ సారి గోదావరి జిలాల్లోని వనపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటాడు. సీనియర్ నేత మనోహర్(కోన వెంకట్) చెప్పడంతో నవ నిర్మాణ పార్టీ అదిష్టానం దేవాకి టికెట్ ఇస్తుంది. ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తాడు. ఈ ర్యాలీకి అదే ప్రాంతానికి చెందిన రఘు(అవినాష్ తిరువీధుల) బైక్ని బలవంతంగా తీసుకెళ్తారు. మరుసటి రోజు నుంచి తన బైక్ ఇవ్వమని పార్టీ నేత బసవన్న(ప్రభాకర్) చుట్టూ తిరుగుతాడు. బైక్ కోసమే పార్టీలో చేరతాడు. తన తరుపున మరో 250 మందిని పార్టీలో చేరిపిస్తాడు. ఇష్టం లేకపోయినా..పార్టీ ఆఫీసులో టీ సప్లై చేస్తాడు. అయినప్పటికీ బైక్ ఇవ్వకపోవడంతో చివరకు దేవాతో కూడా గొడవకు దిగి..అతనిపై పోటీగా మరో వ్యక్తిని బరిలోకి దింపుతాడు. కేవలం బైక్ కోసమే రఘు..దేవాతో వివాదానికి దిగాడా? లేదా వేరే కారణం ఏమైనా ఉందా? రఘు అన్నయ్యకు దేవాకు ఉన్న సంబంధం ఏంటి? రఘు తండ్రి(శివాజీ రాజా)కి ఏమైంది? ఈ కథలో ఆమని పాత్ర ఏంటి? రామాయణ గాథకు హీరో చేసే పోరాటానికి మధ్య ఉన్న సంబంధం ఏటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఎలాంటి కథకైనా పురాణాలతో ముడిపెడుతూ సినిమాలు తీయడం ఇప్పుడో ట్రెండ్. వనవీర కూడా అలాంటి ప్రయత్నమే. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే రివేంజ్ డ్రామాకి పురాణాల టచ్ ఇచ్చి రొటీన్ కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో కులం, రాజకీయాలు వంటి సున్నిత అంశాలను చర్చించారు. తండ్రి-కొడుకు బంధాన్ని కూడా అద్భుతంగా చూపించారు.
రామాయణం, వానరసైన్యం గొప్పదనాన్ని తెలియజేస్తూ.. ధర్మాన్ని రక్షించేందుకు ప్రతి యుగంలో వనవీరుడు పుడుతూనే ఉంటారంటూ ఈ సినిమా కథను ప్రారంభించారు. పెద్ద చదువులు చదువకొని ఊర్లో ఖాలీగా ఉంటున్న యువకుడిలా హీరో పాత్ర పరిచయం.. తండ్రితో అతనికి ఉన్న అనుబంధం.. మరదలు (సిమ్రాన్ చౌదరి)తో ప్రేమాయణం..ఇలా రొటీన్ సీన్లతో ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా సాగుతుంది. బైక్ కోసమే హీరో చేసే పనులన్నీ తొలుత సిల్లీగా అనిపిస్తాయి కానీ సెకండాఫ్ చూశాక..ఆశ్చర్యం కలుగుతుంది. ఇంటర్వెల్ వరకు కథనం సాదాసీదాగా సాగుతుంది.
అసలు కథంతా సెకండాఫ్లోనే ఉంటుంది. హీరో చేసే ప్రతి చిల్లర పని వెనుక ఓ కారణం ఉండడం.. ఒక్కో ట్విస్టు రివీల్ అవుతుంటే ప్రేక్షకుల్లో కథనంపై ఆసక్తి అమాంతం పెరిగిపోతుంది. చివరిలో ఊహించని ట్విస్టులు ఉంటాయి. క్లైమాక్స్లో వచ్చే ఓ క్యామియో రోల్ కూడా సినిమా స్థాయిని పెంచేలా చేసింది. ఇప్పటికీ కొన్ని చోట్ల కుల వివక్ష ఉందని, గ్రామాల్లో అగ్రకులం వాళ్లు తక్కువ కులం వాళ్లను ఎలా చూస్తారనేది ఇందులో కాస్త లోతుగానే చూపించారు. చివరిలో మన ఇతిహాసాలకు ఈ కథకు ముడిపెట్టిన విధానం బాగుంది. తక్కువ బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి.. వానర సైన్యం విజువల్స్ని వండర్ఫుల్గా చూపించారు. అయితే కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగడం.. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం కాస్త మైనస్ అని చెప్పొచ్చు.
ఎవరెలా చేశారంటే..
హీరోగా, దర్శకుడిగా అవినాష్ మంచి ప్రతిభను కనబరిచాడు. యాక్షన్తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. నందు విలనిజం బాగా పండించాడు. గ్రామీణ యువతీగా సిమ్రాన్ బాగా చేసింది. హీరోగా తండ్రిగా శివాజీ రాజా తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కోన వెంకట్, ఆమని, దేవి ప్రసాద్, ప్రభాకర్.. మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


