ఏదో ఒక కథ రాసుకున్నామా? పెద్ద హీరోను పెట్టామా? రెండు ఫైట్ సీన్లు, రెండు లవ్ సాంగ్స్‌తో మమ అనిపించేశామా? అంటే కుదరదు. ఈరోజుల్లో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే వారి మనసును కదిలించేలా సినిమా ఉండాలి. వారు పెట్టిన డబ్బుకు సంతృప్తినిచ్చేదై ఉండాలి. అలాగైతేనే జనం సినిమాకు ఓటేస్తున్నారు, లేదంటే మూవీ చిన్నదైనా, పెద్దదైనా జనం ముఖం చాటేస్తున్నారు.
ఫస్ట్ సినిమాతోనే హిట్
అలాంటిది తొలి సినిమాతోనే టాలెంట్ చూపించాడు తమిళ దర్శకుడు అభిషన్ జీవింత్. యూట్యూబర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అతడు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అభిషన్. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది మే 1న విడుదలవగా ప్రేక్షకులను నవ్విస్తూనే హృదయాలను కదిలించింది. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ప్రేమ వివాహం
పెద్ద డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయకపోయినప్పటికీ సొంత టాలెంట్‌తో గొప్ప సినిమా తీసి అందరి మన్ననలు పొందాడు. రజనీకాంత్, సూర్య, రాజమౌళి, నాని.. ఇలా ఎందరో ప్రముఖులు ఆయన ప్రతిభను ప్రశంసించారు. ఈ ఆనందంలోనే అభిషన్.. ప్రియురాలిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ వివాహానికి టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మగేశ్ రాజు హాజరై బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చాడు.
హీరోగానూ టాలెంట్
ఇక దర్శకుడిగా నెక్స్ట్ ఏం సినిమా చేస్తాడు? అనుకుంటే హీరోగా మారాడు. విత్ లవ్ మూవీతో కథానాయకుడిగానూ విజయం సాధించాడు. అయితే ఒకప్పుడు అభిషన్ రోజూవారీ ఖర్చుల కోసం రూ.500 స్నేహితుడిని అప్పడిగాడు. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు బాక్సాఫీస్‌పై కోట్లు కురిపించే సినిమాలు తీసే రేంజ్‌కు ఎదిగాడు. 26 ఏళ్ల వయసులోనే ఇంత సక్సెస్ చూస్తున్న అభిషన్ మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిద్దాం!


