ఏమాత్రం తేడా కొట్టినా చంపేసేవాళ్లు.. కృష్ణవంశీ | Krishna Vamsi about Mahesh Babu Murari Movie Climax | Sakshi
Sakshi News home page

Murari Climax: తేడా కొడితే నన్ను చంపేసేవాళ్లు.. మహేశ్‌ పస్తులుండి సింగిల్‌ టేక్‌లో..

Jan 1 2026 10:37 AM | Updated on Jan 1 2026 11:14 AM

Krishna Vamsi about Mahesh Babu Murari Movie Climax

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అయిష్టంగా ఒప్పుకున్న సినిమా మురారి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2001లో రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తర్వాత రీరిలీజ్‌ సమయంలోనూ కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ ఎలా జరిగిందనే విషయాలను కృష్ణ వంశీ తాజాగా చెప్పుకొచ్చాడు.

క్లైమాక్స్‌ ఒక్కటే..
అది ఆయన మాటల్లోనే చూద్దాం.. మురారి సినిమా షూటింగ్‌ మొదలైంది. కానీ పతాక సన్నివేశం ఎలా అనేది ఎటూ తెగడం లేదు. మనసులో, మెదడులో అంతా అలజడి. అన్ని సన్నివేశాలు అద్భుతంగా అమరినా క్లైమాక్స్‌ మాత్రం అస్పష్టంగానే ఉంది. మామూలు సినిమాలా ఒక ఫైట్‌తో ముగించాలని లేదు, ఏదో అద్భుతం జరగాలి. సరే అని తెగించి ఒక ఆలోచనను పట్టుకున్నాను.

అదీ సీన్‌
తనే చచ్చిపోతున్నాను అని మురారికి తెల్సిపోయిన తర్వాత ఛట్‌.. అదేం కుదరదు అని తన చావుకీ, బామ్మ మాటకి ఎదురెళ్తాడు. దైవశక్తికి తన స్వశక్తిని అడ్డం వేస్తాడు. కానీ, బుల్లిగాడు గునపం దించేశాడు. బొట్టు బొట్టులో ప్రాణం జారిపోతుంది. వసు ఇది చూసి స్పృహ తప్పింది.. బుల్లి రక్తం చూసి కంగారొచ్చేసి పారిపోయాడు. విశాలమైన పొలాల మధ్యలో కనుచూపు మేరలో ఎవరూ లేరు. తిరిగొస్తానని బామ్మకి మాటిచ్చాడు. స్పృహలో లేని వసుని అక్కడినుంచి తీసుకెళ్ళిపోవాలి. ఏ సహాయం లేదు, రాదు.

మహేశ్‌కు ఎక్కించా..
శరీరం సహకరించడం లేదు... ప్రాణం పోతూపోతూ ఉంది. నాకు నేనే శక్తి కూడగట్టుకోవాలి. నేను ఏ తప్పూ చేయునప్పుడు నేనెందుకు లొంగాలి? చావైనా సరే నేను తగ్గను అనుకుంటూ ముందుకెళ్లాలి. గొప్పగా అనిపించిన ఈ కాన్సెప్ట్ మొత్తం మహేశ్‌కు ఎక్కించా... చుట్టూ పంచభూతాలు తప్ప ఎవరూ ఉండరు, ఏమీ ఉండదు. ప్రాణం పోతున్న నొప్పి, ఎవరూ లేని అసహాయత, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, వసూని తీసుకెళ్ళి పోవాలి. బామ్మ ఆఖరి పూజకి అందుకోవాలి.... చావకూడదు... బతకాలి.. వసూని పెళ్లి చేసుకోవాలి.

పిచ్చిపిచ్చిగా.. తిక్కతిక్కగా..
తల నిండా చిత్రమైన మంచీ చెడూ ఆలోచనలు... నవ్వొస్తుంది, ఏడుపొస్తుంది. నవ్వాలి.....ఏడవాలి.... గంతులెయ్యాలి ... డాన్స్ చేయాలి. నొప్పితో నొప్పిని ఆపుకోవడానికి పాట పాడాలి, అరవాలి... గుర్తొచ్చి మట్టితో గాయంమీద రాసుకోవాలి. పిచ్చిపిచ్చిగా... తిక్కతిక్కగా అటూఇటూ తిరగాలి. అమ్మ గుర్తొస్తోంది, అందరూ గుర్తొస్తున్నారు.... మొత్తానికి వెళ్ళాలి వెళ్ళి తీరాలి. సంకల్పం అంతే! మొత్తం అర్థమయేలా మహేశ్‌కు వివరించా.... గునపం గుచ్చుకున్న దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ ఏం చేయాలో చిన్న గుర్తులతో చెప్పా..

నో రిహార్సల్‌
రిహార్సల్ వద్దన్నా.. డైరెక్ట్ టేక్ అన్నా.. ఒక సెకన్ నన్ను సూటిగా చూసి రెడీ సార్ అన్నాడు.  ఈసీన్ కోసమే రామలింగేశ్వరరావు గారికి మూడు కెమెరాలు కావాలి అని అడిగా.. ఆయన తెప్పించిన మూడు కెమెరాలు, లైటింగ్ అమరుస్తూ మహేష్ ఒక్కడ్నీ పది నిమిషాలు వదిలేసా... ఆ ప్రదేశం అంతా యూనిట్ వందమంది, షూటింగ్ చూడటానికి వచ్చిన ఒక వెయ్యి మంది.. నిశ్శబ్దం... భయంకరమైన నిశ్శబ్దం.... మహేశ్‌ తప్ప తెరమీద ఇంకెవ్వరూ కనపడని సన్నివేశం.... ఏమాత్రం తేడా కొట్టనా అభాసుపాలు అయిపోయే ప్రమాదం... మహేశ్‌ ఒక సూపర్ స్టార్‌గా, ఒక నటుడిగా మేక్ ఆర్ బ్రేక్!

ఏమాత్రం తేడా జరిగినా..
తేడా జరిగితే సీనియర్, జూనియర్ సూపర్ స్టార్ అభిమానులు డైరెక్టర్‌గా నన్ను చంపేసే ఉపద్రవం... కానీ నాకు మహేశ్‌ మీద మనసు మూలల్లో నాకే అర్థం కాని ఒక గొప్ప నమ్మకం...  చింపేస్తాడు అని...కెమెరాస్ రెడీ అన్నాడు రాంప్రసాద్ ... రెడీయా మహేష్ అని కూడా అడగలేదు. క్లాప్ అని అసంకల్పితంగా వచ్చేసింది.... మహేశ్‌ ఏం మాట్లాడలేదు... పొజిషన్‌లోకి వెళ్లిపోయాడు. 

పదినిమిషాలు ఆగకుండా..
యాక్షన్.. అంతే... ఏకధాటిగా మూడు నిముషాల నలభై సెకన్లు. ఆఖరులో కుండలో నీళ్ళు మొహం మీద ఒంపుకొని దాన్ని విసిరేస్తూ అదుపుతప్పి కింద పడిపోగానే కట్ చెప్పాను .... ఒక్క సారిగా అక్కడున్న వాళ్ళందరూ యూనిట్ అంతా కూడా చప్పట్ల హోరు.... ఆగకుండా పదినిమిషాలు కొట్టేశాం అని అర్థం అయింది. ఆర్నెళ్ల ఆత్రత, అలజడి కుదుటపడింది..... దటీజ్ మహేశ్‌!

పస్తులతో షూటింగ్‌
P.S. ముందు రోజు రాత్రి షూటింగ్ అరటితోట ఫైట్ అయిన తరువాత మరుసటిరోజు ఈ సీన్‌ షూటింగ్.... అప్పటినుంచి షూట్ అయ్యేంతవరకు ఏమీ తినొద్దు, మంచి నీళ్ళు, కాఫీ తప్ప! నాకు అప్పటికే రెండవరోజు.... సరే సార్ డైరెక్టర్ గారూ అని రామలింగేశ్వరరావు గారింటి నుంచి వచ్చిన డిన్నర్ క్యారేజీని అసిస్టెంట్‌లకు పంపించేశాడు.... పస్తున్నాడు ఎఫెక్ట్ కోసం .... చాలా ఎత్తుకి ఎదుగుతాడు. కృష్ణ గారి పేరు ఇంకా పైకెత్తుతాడు అని కనపడిపోయింది అని ఎక్స్‌ (ట్విటర్‌)లో ఆనాటి విశేషాలను గుర్తుచేసుకున్నాడు.

చదవండి: ఈషాపై నెగెటివిటీ.. ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement