యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.. ప్రత్యర్థులను మట్టి కరిపించడంలోనే కాదు, వారిపై పంచులు విసరడంలోనూ దిట్ట! ఇతడు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్ షో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ షోలోని లేటెస్ట్ ఎపిసోడ్‌కు షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 5 జడ్జిలు హాజరయ్యారు. వారిలో ఒకరైన అమన్ గుప్తా.. మీరు జీవితంలో బాగా ఇబ్బందిపడ్డ సంఘటన ఏది? అని అడిగాడు.
ఎంత చెప్పినా వినడే..
అందుకు అక్షయ్ ఏదైనా ఫన్నీ సంఘటన చెప్తాడనుకుంటే ఏకంగా ఒకరిని లాగి పెట్టి కొట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. నా క్లోజ్ ఫ్రెండ్‌తో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తి నా స్నేహితుడిని తిడుతున్నాడు. ఆపమని వారించినా సరే వినకుండా దుర్భాషలాడుతున్నాడు. మొదట మంచిగా చెప్పి చూశా.. తర్వాత వార్నింగ్ ఇచ్చా.. అయినా వినలేదు. ఇక ఆరోసారి మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇచ్చాను.
ఆవేశం పట్టలేక..
అందరిముందు అలా తిడుతుండేసరికి నా ఫ్రెండ్ ఏడుస్తున్నాడు. అది చూసి భరించలేకపోయిన నేను అతడి చెంప చెళ్లుమనిపించాను. ఒక్క దెబ్బకే అతడు కిందపడిపోయి స్పృహ కోల్పోయాడు. అయిపోయింది, నా కెరీర్ ఖతం అని భయపడ్డా.. అతడికి మెలకువ రావాలని దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాను. ముఖంపై నీళ్లు చల్లిన కొద్ది క్షణాలకే అతడు లేచి కూర్చో వడంతో ఊపిరి పీల్చుకున్నా..
ఈరోజు అయితే..
అదే సంఘటన ఈరోజు జరిగి ఉంటే అక్కడి నుంచి వెళ్లిపోయేవాడిని కానీ అలా కొట్టేవాడిని కాదు. అదే నాకు ఇబ్బందిగా అనిపించిన సంఘటన అని గుర్తు చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ చివరగా జాలీ ఎల్‌ఎల్‌బీ 3 సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ సినిమా భూత్ బంగ్లా ఏప్రిల్ 10న విడుదల కానుంది.
చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న నటి


