గతేడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ధురంధర్. మౌత్ టాక్‌తోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోనూ దుమ్ము దులుపుతోంది.
అక్షయ్‌పై సర్వత్రా ప్రశంసలు
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్ కీలక పాత్రలు పోషించారు. సినిమా రిలీజయ్యాక అందరికన్నా ఎక్కువగా అక్షయ్ పేరే మారుమోగిపోయింది. అతడి స్వాగ్, డ్యాన్స్, లుక్స్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. రెహ్మాన్ డకాయిట్‌గా అక్షయ్ అదరగొట్టేశాడని ప్రశంసలు లభించాయి.
స్పందించిన నాగ్
అయితే రెహ్మాన్ పాత్ర కోసం అక్షయ్ కంటే ముందు నాగార్జునను సంప్రదించారని ఓ వార్త ఫిల్మీదునియాలో వైరలవుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని కింగ్ నాగ్ కొట్టిపారేశాడు. ధురంధర్ సినిమా కోసం తనను సంప్రదించలేదని కుండ బద్ధలు కొట్టాడు. ఒకవేళ తనకు అవకాశం ఇచ్చుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ధురంధర్ మూవీ చాలా బాగుందన్నాడు.
సినిమా
ఆదిత్య ధర్ దర్శకత్వం అదిరిపోయిందని, అతడి ముందు సినిమా ఉరి: ద సర్జికల్ స్ట్రైక్ కూడా తనకు ఎంతగానో నచ్చిందని ప్రశంసించాడు. సినిమాలో అందరూ బాగా నటించారని, అక్షయ్ ఖన్నా అద్భుతంగా యాక్ట్ చేశాడని మెచ్చుకున్నాడు. ధురంధర్ సీక్వెల్ కూడా మరింత బ్లాక్‌బస్టర్ అవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ధురంధర్ 2 మూవీ మార్చి 19న విడుదలవుతోంది.
చదవండి: కపుల్ ఫ్రెండ్లీకి హిట్ టాక్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?


