బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా, ఆయన భార్య సునీత ఆహుజా విడాకులు తీసుకోబోతున్నారనే వార్త గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం వీరిద్దరు సపరేట్‌గా ఉంటున్నారు. కానీ అధికారికంగా విడాకులు అయితే తీసుకోలేదు. కోర్టు ద్వారా గోవిందాకు నోటీసులు అందించారని..త్వరలోనే విడాకులు తీసుకునే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భర్త గోవిందాపై సునీత(Sunita Ahuja) సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తకు మరొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని.. డబ్బుల కోసమే ఆమె ఆయనకు దగ్గరైందని ఆరోపించారు.
తాజాగా ఆమె ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల రూమర్స్‌పై స్పందించారు. ‘మేమిద్దరం సపరేట్‌గా ఉంటున్న విషయం నిజమే. గోవిందా(Govinda) మరోక అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నాడు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించడం లేదు.. డబ్బుల కోసమై దగ్గరైంది. ఆమె హీరోయిన్ అయితే కాదు. హీరోయిన్లు ఇతరుల కాపురాల్లో చిచ్చు పెట్టేంత చెడ్డవాళ్లు కాదు’ అని సునీత చెప్పుకొచ్చారు.
ఇంకా మాట్లాడుతూ..గోవింద జీవితంలో ముగ్గురే మహిళలు కీలకంగా ఉండాలని కోరుకున్నాం. ఆమె తల్లి, భార్య, కూతురు.. ఈ ముగ్గురు మహిళలే ఆయన జీవితంలో ఉండాలకున్నాం. కానీ నాలుగో మహిళ రావడం జీర్ణించుకోలేకపోయామని సునీత ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికైనా గోవింద తన చుట్టు ఉన్న చెంచాలను వదిలేసి.. వర్క్‌పై ఫోకస్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.
కాగా.. సునీతా అహుజా, గోవిందల పెళ్లి 1987లో జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు యశ్, కూతురు పేరు టీనా. గత ఏడాదిగా వీరిద్దరు వేరు వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విడాకుల రూమర్స్ వినిపిస్తున్నా.సునిత మాత్రం గోవిందా ఎప్పటికీ తనవాడే అని.. వదిలేసే ప్రసక్తే లేదన్నారు.


