బాలీవుడ్ లెజెండ్, 'హీ-మ్యాన్' ధర్మేంద్రకు కేవలం నటనపైనే కాదు, ఆహారం, ఆతిథ్యంపై కూడా మక్కువ ఎక్కువ. ఆయన సినీ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, పంజాబీ కల్చర్ ను ప్రతిబింబించేలా ప్రారంభించిన రెస్టారెంట్ ప్రాజెక్టే ఈ 'గరం ధరం - ధాబా తే ఠేకా'.
రెస్టారెంట్ ప్రత్యేకతలు ఇవే..
'గరం ధరం ధాబా' కేవలం భోజనశాల కాదు, ధర్మేంద్ర అభిమానులకు ఒక ఆలయం లాంటిది. ధర్మేంద్ర వ్యక్తిత్వం, ఆయన నటించిన సినిమా లలోని ముఖ్య ఘట్టాలు, డైలాగ్‌లు ఈ ధాబాలోని ప్రతి గోడపై కనిపిస్తాయి.

సందర్శకులను ఆకర్షించే థీమ్..
ఈ రెస్టారెంట్ మొత్తం బాలీవుడ్ థీమ్‌తో అలంకరించి ఉంటుంది. ధర్మేంద్ర క్లాసిక్ చిత్రాల పోస్టర్లు, అద్భుతమైన డైలాగ్స్ గోడలపై కనిపిస్తాయి.

ఐకానిక్ ఆర్ట్ వర్క్స్..
ధర్మేంద్ర వివిధ రూపాల పోర్ట్రెయిట్‌లు, గ్రాఫిటీ ఆర్ట్ ఈ స్థలాన్ని నింపుతాయి. 'షోలే' సినిమాలోని ప్రసిద్ధ 'ట్యాంకీ' సీన్, జై-వీరు ప్రయాణించిన ఐకానిక్ కారు మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

'దేశీ' ఇంటీరియర్ తో..
ఇటుక గోడలు, రంగుల దీపాలు, పాతకాలపు హెడ్‌లైట్స్, చేతిపంపులు వంటివి ధాబాకు దేశీ రూపాన్ని ఇస్తాయి. హర్యానాలోని ముర్తల్‌లో ప్రారంభించిన మొట్టమొదటి అవుట్‌లెట్ 1,200 మంది కూర్చునే సామర్థ్యంతో, 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారతదేశంలోనే అతిపెద్ద ధాబాగా ప్రసిద్ధి చెందింది.

రుచికరమైన ఆహారం, దేశీ ఫ్లేవర్స్..
ఈ ధాబాలో నార్త్ ఇండియన్, పంజాబీ వంటకాలకు పెద్ద పీట వేస్తారు. రుచిలో రాజీ పడకుండా, ఇంటి భోజనాన్ని తలపించేలా ఇక్కడ వడ్డిస్తారు.
మఖానీ పరాఠాలు, దాల్ మఖానీ, గలోటి కబాబ్‌లు, తందూరి పనీర్ టిక్కా, బిర్యానీ, వివిధ రకాల రుచికరమైన కూరలు ఇక్కడ లభిస్తాయి.
ప్రత్యేక మెనూ ఏమిటంటే..?
మెనూలో కొన్ని వంటకాలకు ఆయన సినిమాల పేర్లు పెట్టి, 'ధరం జీ స్పెషల్' అనే ప్రత్యేక పేజీని కూడా ఉంచారు. క్విర్కీ డ్రింక్స్ 'వీరూ కీ ఘుట్టీ', 'ప్యారే మోహన్ మసాలా నింబు' వంటి మోక్‌టైల్స్ ను బంటా అంటే దేశీ స్టైల్ సీసాలలో అందిస్తారు.
ధాబా ఆవిర్భావం..
ధర్మేంద్ర రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు చాలా రీసెర్చ్ చేశారు. ఆ తర్వాత ఉమాంగ్ తివారీ, మిక్కీ మెహతా లతో కలిసి భాగస్వామ్యంలో మొదటి రెస్టారెంట్ ను ప్రారంభించారు.
మొదటి ఔట్‌లెట్ ప్రారంభమైందిలా..
ఫిబ్రవరి 23, 2018 న హర్యానాలోని ప్రసిద్ధ ఫుడ్ స్టాప్ ముర్తల్‌లో ఈ 'గరం ధరం ధాబా' తన మొదటి బ్రాంచ్ ను ఓపెన్ చేశారు. ముర్తల్ బ్రాంచ్ విజయవంతం అయిన తర్వాత, దీని శాఖలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఘజియాబాద్ అర్థాలా, మోహన్ నగర్), నోయిడా, న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వంటి అనేక ప్రదేశాలలో విస్తరించాయి.
'హీ-మ్యాన్' రెస్టారెంట్..
'గరం ధరం' విజయం తర్వాత, ధర్మేంద్ర కర్నాల్‌లో 'ఫామ్-టు-ఫోర్క్' కాన్సెప్ట్‌తో 'హీ-మ్యాన్' అనే తన రెండవ రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించారు. ఈ 'గరం ధరం ధాబా' ధర్మేంద్ర అభిమానులకు ఆయన గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన దేశీ జీవనశైలి గురించి గుర్తుచేసే ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.
- సాక్షి స్పెషల్


