దురదృష్టవశాత్తు, ఈ ప్రపంచంలోని ప్రతి మహిళ తన జీవితంలో కనీసం ఒక్కసారైనా లైంగిక వేధింపులకు గురవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి మహిళకు ఈ వేధింపుల తప్పడం లేదు. తాజాగా మలయాళ స్టార్ నటి పార్వతి తిరువోత్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిన్నప్పటి నుంచి పలు ఘటనలు ఆమెను మానసికంగా కలచివేశాయని చెప్పుకొచ్చారు.
ఛాతీపై కొట్టాడు..
నా చిన్నప్పుడు ఒకసారి అమ్మా నాన్నలతో కలిసి రైల్వే స్టేషల్‌కు వెళ్లాను. ట్రైన్ కోసం పెరెంట్స్‌తో కలిసి నిలబడితే.. ఒకడు వచ్చి నా ఛాతీపై కొట్టి పారిపోయాడు. అతను కావాలనే అక్కడ టచ్ చేశాడు. ఆ సంఘటన నన్ను చాలా మానసిక క్షోభకు గురిచేసింది. ఆ తర్వాత నేను బయటకు వెళ్తే.. ఎలా ఉండాలో అమ్మ చెప్పేది. మగాళ్ల చేతులను చూస్తూ నడవాలని చెప్పాలి. ఒక తల్లి తన కూతురికి ఇలా నేర్పించాల్సిన పరిస్థితి రావడం దారుణం. ఆ ఒక్క సంఘటననే కాదు. చిన్నప్పుడు నాకు ఇలాంటివి చాలానే ఎదురయ్యాయి. కొంతమంది మగాళ్లు ప్రైవేట్ పార్ట్‌ని చూపిస్తూ.. అసభ్యకరంగా మాట్లాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. స్కూల్‌లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించా. అతను నన్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కోరిక తీర్చమని వేధించాడు. ప్రేమిస్తే.. అనుమతి లేకపోయినా సరే ఆ పనికి ఒప్పుకోవాల్సిందేనా?
లిఫ్ట్‌లో అలా.. కొట్టేశా
19-20 ఏళ్ల వయసులో కూడా ఓ ఘటన జరిగింది. సినిమా కోసం స్నేహితులతో కలిసి మాల్‌కి వెళ్లాను. అనంతరం లిఫ్ట్‌లో కిందికి వస్తుంటే..ఒక వ్యక్తి నా దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. అతని ప్రైవేట్ పార్ట్ నాకు తగిలినట్లుగా అనిపించింది. లిఫ్ట్ దిగగానే అతన్ని చెంపపై కొట్టాను. సెక్యూరిటీ వచ్చి ఆపారు. పోలీసులకు ఫోన్ చేసి రప్పించాను. చివరికి అతను నా కాళ్ళ మీద పడి, 'నాకు ఇప్పుడే గల్ఫ్‌లో ఉద్యోగం వచ్చింది, నేను పెళ్లి చేసుకుంటున్నాను' అనడంతో వదిలేశా. నేను అతన్ని కొట్టినప్పుడు, అందరూ నన్ను అభినందించారు. కానీ అది పెద్ద విజయం అని నేను అనుకోలేదు. నన్ను నేను రక్షించుకోవడం పెద్ద విషయం కాదు’ అని పార్వతి చెప్పుకొచ్చింది.
సినిమాలో విషయానికి వస్తే.. 2024లో వచ్చిన ‘ఉల్లోజుక్కు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పార్వతీ, ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.


