కొడవ సంప్రదాయంలో ‘విరోష్‌’ వివాహం.. పెళ్లి ప్రత్యేకతలు ఇవే! | Virosh Wedding, What Is A Kodava Wedding, Rashmika Unseen Video Viral On Social Media Amid Marriage With Vijay Deverakonda | Sakshi
Sakshi News home page

కొడవ తెగ చీరలో రష్మిక..‘కొడవ’ పెళ్లి ఎలా జరుగుతుందో తెలుసా?

Feb 26 2026 2:15 PM | Updated on Feb 26 2026 2:53 PM

Virosh Wedding: What Is A Kodava Wedding, Rashmika, Vijay Devarakonda Marriage Special

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం ఉదయం 10:10 గంటలకు రష్మిక మెడలో విజయ్‌ దేవరకొండ మూడుమూళ్లు వేశాడు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్‌ ప్యాలెస్‌ ఈ పెళ్లికి వేదికగా మారింది. ఈ రోజు సాయంత్రం మరోసారి రష్మిక, విజయ్‌ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారు. తొలుత తెలుగు హిందూ పద్దతిలో ఈ జంట పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రష్మిక కుటుంబ మూలలను గౌరవిస్తూ కొడవ సంప్రదాయంలో వివాహం చేసుకోబోతున్నారు.

కొడవ పెళ్లి ఎలా జరుగుతుంది?
రష్మికది కర్ణాటకలోని కొడగు (కూర్గ్) ప్రాంతానికి చెందిన కొడవ సామాజిక వర్గం. అక్కడి వారి పెళ్లి సంప్రదాయ భారతీయ వివాహాలన్నింటిలోకి చాలా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లి తంతుని వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. ఈ పెళ్లిళ్లలో హిందూ సంప్రదాయాల్లో కనిపించే పురోహితులు (బ్రాహ్మణులు), అగ్ని సాక్షి (హోమం) వంటివి ఉండవు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుందట.

పెళ్లి రోజు ఉదయం వధూవరులు తమ తమ ఇళ్లలో అభ్యంగన స్నానం చేసి, సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు'కుప్య' (నల్లని కోటు), 'చేలే' (నడుముకు కట్టే పట్టీ) మరియు 'పీచే కత్తి' (చిన్న కత్తి) ధరిస్తాడు. పెళ్లి కూతురు వెనుక వైపు కుచ్చెళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కొడవ చీరను ధరిస్తుంది.

పెళ్లి వేదిక వద్దకు వరుడు వచ్చే ముందు, అడ్డుగా ఉన్న అరటి చెట్టు కాండాలను నరకడం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీక.

వధూవరులు పెళ్లి పీటలపై కూర్చున్నప్పుడు, కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి వారిని ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఎటువంటి మంత్రాలు ఉండవు. కేవలం పెద్దల దీవెనలే ప్రధానం. వధువుకి ఒడి బియ్యానికి బదులు ఒక చిన్న నాణేల మూట  అందిస్తారట.ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతం.

పెళ్లి తర్వాత వధువు తన అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు గంగా పూజ జరుగుతుంది. వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకుంటారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించే ఆహ్లాదకరమైన ఘట్టం ఇది. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా, కొడవ పెళ్లిళ్లలో మాంసాహారం (ముఖ్యంగా పంది మాంసం), మద్యం తప్పనిసరిగా వడ్డిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement