ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇవాళ కన్నుమూశారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా దశబ్దాలుగా చెరగని ముద్రవేసిన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర మృతితో బాలీవుడ్తో పాటు సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
1935 డిసెంబర్ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ఆయన కేవలం 19 ఏళ్ల వయసులోనే ప్రకాశ్ కౌర్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే అనే మూవీతో తన సినీ ప్రస్థాన ప్రారంభమైంది. ఆ తర్వాత 'షోలే'లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. అంతేకాకుండా రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పని చేశారు.
అయితే ఇవాళ ధర్మేంద్ర మరణించడంతో ఆయన ఆస్తులపై చర్చ మొదలైంది. తన కెరీర్లో ఎన్ని ఆస్తులు కూడబెట్టరనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఓవరాల్గా చూస్తే ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.335 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం హీరోగానే కాదు.. తన కెరీర్లో హోటల్, అతిథ్యరంగంలో బిజినెస్ చేశారు. 2015లో న్యూఢిల్లీలో తన మొదటి రెస్టారెంట్ గరం ధరం ధాబాను ప్రారంభించారు. ఆ తర్వాత 2022లో, కర్నాల్ హైవేలో హీ మ్యాన్ అనే రెస్టారెంట్ ప్రారంభించారు.
లోనావాలాలో 100 ఎకరాల ఫామ్‌హౌస్
పుణె సమీపంలోని లోనావాలాలోని అతని 100 ఎకరాల ఫామ్‌హౌస్ కూడా ఉంది. ఆయన తన కుటుంబంతో ముంబయి నుంచి ఈ ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి వస్తుంటారు. ఈ ఫామ్‌హౌస్‌లో అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ధర్మేంద్ర రూ. 17 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఆయన పేరిట ఉన్నాయి. రూ. 88 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమితో పాటు రూ. 52 లక్షల విలువైన వ్యవసాయేతర ప్లాట్స్ ఉన్నాయి. ఫామ్‌హౌస్ సమీపంలోని 12 ఎకరాల స్థలంలో ఓ రిసార్ట్‌ను అభివృద్ధి చేశారు.
లగ్జరీ కార్లు..
లగ్జరీ కార్లు అంటే ధర్మేంద్రకు చాలా ఇష్టం. ఆయన మొదట వింటేజ్ ఫియట్ అనే కారును కొన్నారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు రేంజ్ రోవర్ ఎవోక్ (రూ. 85.74 లక్షలు), మెర్సిడెస్-బెంజ్ (రూ. 98.11 లక్షలు)ను కొనుగోలు చేశాడు. అంతేకాకుండా 1983లో ధర్మేంద్ర విజేత ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించారు. తన బ్యానర్లోనే కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌లను బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. 1983లో బేతాబ్‌తో సన్నీ, 1995లో బర్సాత్‌తో బాబీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తన మనవడు కరణ్ డియోల్ పాల్ పాల్ దిల్ కే పాస్ అనే మూవీతో 2019లో అరంగేట్రం చేశాడు. అలా తనతో పాటు భారతీయ సినిమాపై కుటుంబ వారసత్వం శాశ్వతంగా ఉండేలా ప్రోత్సహించారు ధర్మేంద్ర.


