ఆనందోత్సవాల నడుమ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పలాష్ ముచ్చల్‌తో కలిసి స్మృతి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమైన వేళ... ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన ఉన్నపళంగా అస్వస్థతకు గురయ్యారు.
తప్పనిసరి పరిస్థితుల్లో..
ఊహించని ఈ పరిణామంతో స్మృతి- పలాష్ పెళ్లితంతును నిరవధికంగా వాయిదా (Smriti Mandhana- Palash Muchhal Wedding Postponed) వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ‘ఆదివారం ఉదయం శ్రీనివాస్ అల్పాహారం తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ పెళ్లి సమయం కల్లా కోలుకుంటారనే ఇరు కుటుంబసభ్యులు ఎదురుచూశారు.
నాన్న చూడని వేడుక నాకొద్దు
కానీ ఆశించినట్లుగా ఆరోగ్యం ఏమాత్రం మెరుగవలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది’ అని స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా వెల్లడించారు. నాన్న గారాల పట్టి స్మృతి. అందుకే నాన్న చూడని తన కల్యాణ వేడుక నాకొద్దని స్మృతి కరాకండీగా చెప్పినట్లు తెలిసింది. తన తండ్రి ఆరోగ్యంగా తిరిగొచ్చాకే వివాహ వేడుక ఉంటుందని స్పష్టం చేసింది.
ఆస్పత్రి పాలైన పలాష్ ముచ్చల్!
కాగా ముందే నిర్ణయించిన సుమూహుర్తం ప్రకారం ఆదివారం స్మృతి, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం జరగాల్సింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తండ్రి అనారోగ్యం కారణంగా ఆందోళనలో మునిగిపోయిన స్మృతి మంధానకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. స్మృతికి కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రి పాలైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఎన్‌డీటీవీ అందించిన వివరాల ప్రకారం.. వైరల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా పలాష్ ముచ్చల్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఎసిడిటీ ఎక్కువ కావడంతో అతడు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, పలాష్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. మెరుగైన చికిత్స కోసం మాత్రమే అతడు ఆస్పత్రికి వెళ్లాడని సమాచారం.
స్మృతి తండ్రి హెల్త్ అప్‌డేట్ ఇదే!
ఇక స్మృతి తండ్రి శ్రీనివాస్‌ను పరీక్షించిన వైద్యుడు డాక్టర్ నమన్ షా పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో శ్రీనివాస్ మంధాన ఛాతీలో ఎడమవైపు నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన కుమారుడు నాకు కాల్ చేసి పరిస్థితి గురించి చెప్పగానే అంబులెన్స్ పంపించాము.
వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చి.. చికిత్స మొదలుపెట్టాము. కార్డియాక్ ఎంజైమ్స్ పెరిగిపోయాయి. బీపీ కూడా ఎక్కువగా ఉంది. పరిస్థితిని బట్టి ఆంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. స్మృతి, ఆమె కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు మాతో కాంటాక్టులో ఉండి.. అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు’’ అని తెలిపారు.
వారం రోజులుగా వేడుకలు
కాగా స్మృతి స్వస్థలం సాంగ్లీలో వారం రోజులుగా ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. భారత జట్టు క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ తదితరులు హల్దీ, సంగీత్ వేడుకలో ఉత్సాహంతో పాల్గొన్నారు. వధూవరులు స్మృతి- పలాష్ కూడా డాన్సులతో వేదికను హోరెత్తించారు.
ఇక మూడు ముళ్లు పడటమే తరువాయి అనే తరుణంలో ఇలా స్మృతి తండ్రి అనారోగ్యం పాలుకావడంతో వాతావరణమంతా ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని.. స్మృతి- పలాష్‌ల పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగిపోవాలని స్మృతి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. భారత బ్యాటర్లు అట్టర్ ప్లాప్


