సినిమా మాధ్యమం చాలా పవర్‌ఫుల్. దీనికి చాలా మంది ఆకర్షితులవుతారు. పలువురు నటించాలని కలలు కంటారు. అందుకు కొందరు స్ఫూర్తి దాయకులవుతారు. అలా అగ్ర హీరోయిన్ నయనతారని స్ఫూర్తిగా తీసుకుని కథానాయికగా మారింది వర్ధమాన నటి ఐశ్వర్య కేఎస్. ఈమె హీరోయిన్‌గా నటించిన జస్టీస్ ఫర్ జెనీ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందింది.
చిన్నతనం నుంచి ఆసక్తి
పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా భావోద్వేగాలతో కూడిన పాత్రలో నటించిన ఐశ్వర్య నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తాజాగా ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలు చెప్పింది. తనకు చిన్నతనం నుంచి కళలు, క్రీడలపై ఆసక్తి ఎక్కువ అంది. తాను కబడ్డీ క్రీడలో రాష్ట్ర స్థాయిలో తమిళనాడు తరఫున పోటీల్లో పాల్గొన్నానని చెప్పింది. అలా శారీరక వ్యాయామం చేయడం వల్ల నటనపై కూడా ఆత్మవిశ్వాసం కలిగిందని తెలిపింది.
నా జీవితాన్ని మలుపు తిప్పింది
కోవిడ్ కాలంలో ఒక షార్ట్ ఫిలింలో నటించే అవకాశం వచ్చిందని, అదే తన జీవితాన్ని మలుపు తిప్పిందని పేర్కొంది. తర్వాత జస్టిస్ ఫర్ జెనీలో నటించే అవకాశం వచ్చిందంది. తాజాగా నట్టి నటరాజ్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయంది. స్వయంకృషితో శ్రమించి అగ్ర కథానాయికగా ఎదిగిన నయనతార తనకు స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చింది. దర్శకులు వెట్రిమారన్, మారిసెల్వరాజ్ చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానంది. అలాగే కొత్త ఆలోచనతో వస్తున్న యువ దర్శకుల చిత్రాల్లోనూ నటించడానికి సిద్ధమంటోంది.


