టీమిండియా జెర్సీలో రుతురాజ్ (ఫైల్ ఫొటో)
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి శతక్కొట్టాడు. గోవాతో మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైన వేళ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రుతు.. మొత్తంగా 131 బంతులు ఎదుర్కొని 134 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
రుతురాజ్ (Ruturaj Gaikwad) శతక ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కాగా దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 279 పరుగులు సాధించాడు. తాజాగా గోవాతో గురువారం నాటి మ్యాచ్‌లో ఈ మహారాష్ట్ర కెప్టెన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
గోవా బౌలర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలు
జైపూర్ వేదికగా గోవాతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేసింది. గోవా పేసర్ వాసుకి కౌశిక్ అర్షిన్ కులకర్ణిని డకౌట్ చేయగా.. మరో ఓపెనర్ పృథ్వీ షా (1)ను అర్జున్ టెండుల్కర్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన కౌశిక్.. వన్‌డౌన్ బ్యాటర్ అంకిత్ బావ్నే(0), సిద్ధార్థ్ మాత్రే (27 బంతుల్లో 3)లను కూడా వెనక్కి పంపాడు.
🚨 Ruturaj Gaikwad Show in Vijay Hazare Trophy
Runs - 134
Balls - 131
4/6 - 8/6
Maharastra was 5 down on Just 25 runs and then he scored valuable century.
He deserved the part of Indian ODI squad but he got dropped due to politics of Gautam Gambhir 💔pic.twitter.com/Ts0ubxdo1b— Tejash (@Tejashyyyyy) January 8, 2026
ఆదుకున్న రుతురాజ్
ఈ క్రమంలో సింగిల్ డిజిట్ స్కోరుకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన మహారాష్ట్రను రుతురాజ్ అజేయ శతకం (134)తో ఆదుకున్నాడు. అతడికి తోడుగా లోయర్ ఆర్డర్‌లో విక్కీ ఓస్త్వాల్ హాఫ్ సెంచరీ (53)తో మెరవగా.. రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ (19 బంతుల్లో 32 నాటౌట్) ధనాధన్ దంచికొట్టాడు. ఫలితంగా మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగలిగింది.
శతకాలు బాదుతున్నా.. సెలక్టర్లు పట్టించుకోరుగా!
ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రుతురాజ్ శతకం సాధించాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరాఖండ్‌పై, తాజాగా గోవాపై శతక్కొట్టాడు. అయితే, సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డేలు ఆడే భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు.
గత సిరీస్‌లో సెంచరీతో అలరించినా సెలక్టర్లు రుతురాజ్‌కు మొండిచేయి చూపారు. గాయం నుంచి కోలుకుని మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో అతడిపై వేటు పడింది. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు వన్డేల్లో మెరుగైన రికార్డు లేకపోయినా మరోసారి అతడికి జట్టులో చోటు దక్కింది.
వికెట్ కీపర్‌గానూ సత్తా చాటితేనే
ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. వికెట్ కీపర్‌గానూ రుతురాజ్ సత్తా చాటితేనే తిరిగి అతడు టీమిండియాలో అడుగుపెట్టగలడని అభిప్రాయపడ్డాడు. మరోవైపు.. రుతుకు టీమిండియా తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్లే కనిపిస్తోందని మరో మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ అన్నాడు.
కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 వన్డేలు ఆడిన రుతు.. 28.5 సగటుతో 228 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే, రుతు బ్యాటింగ్ సగటు తక్కువగా ఉండటం వల్ల బ్యాకప్ ఓపెనర్‌గా అయినా అతడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోయిందని చెప్పవచ్చు.
చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త


