జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై వేటు పడింది. తనపై అతడు లైంగిక దాడికి పాల్పడినట్లు భారత షూటర్, పదిహేడేళ్ల అమ్మాయి హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫరీదాబాద్ హోటల్‌లో అంకుశ్ భరద్వాజ్ తనపై అత్యాచారం చేసినట్లు ఆమె ఆరోపించింది.
రూమ్‌కు రావాల్సిందిగా ఒత్తిడి
న్యూఢిల్లీలో డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్న వేళ.. ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు తెలిపింది. పోటీలో తన ప్రదర్శను విశ్లేషిస్తున్నట్లుగా నటిస్తూ అత్యాచారానికి ఒడిగట్టినట్లు పేర్కొంది. తొలుత హోటల్ లాబీలో తనను కలవాలని ఆదేశించిన కోచ్ అంకుశ్.. ఆ తర్వాత రూమ్‌కు రావాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు తెలిపింది.
అతడు చెప్పినట్లు వినకపోయినా.. ఈ విషయం గురించి బయటకు చెప్పినా తన కెరీర్ నాశనం చేస్తానని.. కుటుంబాన్ని కూడా వదిలిపెట్టనని అతడు బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు సదరు మైనర్ షూటర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మహిళా పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అంకుశ్ భరద్వాజ్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణ చేపట్టాము
ఈ విషయం గురించి ఫరీదాబాద్ పోలీసులు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటనపై విచారణ చేస్తున్నాము. ఘటన జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజీ, ఇతర వివరాలు ఇవ్వాల్సిందిగా హోటల్ అధికారులను అడిగాము’’ అని తెలిపారు. కాగా నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) నియమించిన 13 మంది జాతీయ కోచ్‌లలో అంకుశ్ ఒకడు.
ఈ ఘటన నేపథ్యంలో NRAI సెక్రటరీ జనరల్ పవన్ కుమార్ సింగ్ స్పందిస్తూ.. ‘‘మీడియా ద్వారా మాకు ఈ విషయం తెలిసింది. విచారణ పూర్తయ్యేంతవరకు అంకుశ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నాం. అతడికి ఇకపై ఎలాంటి పనులు అప్పగించబోము’’ అని తెలిపారు.
కాగా ఘటన తర్వాత బాధితురాలు భయంతో హోటల్ వీడగా.. ఇంట్లో వాళ్లు ఆరా తీయడంతో విషయం మొత్తం వారికి చెప్పినట్లు సమాచారం. తనతో పాటు మరో మహిళా షూటర్‌ను కూడా అంకుశ్ ఇబ్బందిపెట్టాడని కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు అతడిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: భారత క్రికెటర్‌కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!


