భారత స్టార్ పేసర్ క్రాంతి గౌడ్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారి కలలు ఫలించాయి. ఆమె తండ్రి మున్నా సింగ్ తిరిగి ఉద్యోగంలో చేరేందుకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
గతేడాది భారత్ తరఫున మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది క్రాంతి గౌడ్. ఇప్పటికి మొత్తంగా 15 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. వన్డేల్లో 23, టీ20లలో రెండు వికెట్లు తీసింది.
తొమ్మిది వికెట్లు కూల్చి..
అయితే, గతేడాది సొంతగడ్డపై జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో క్రాంతి గౌడ్ అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది. ఈ మెగా టోర్నీలో మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చి.. భారత్ తొలిసారిగా చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించింది. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.
కూతురి ప్రతిభ.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్రాంతి గౌడ్ సముచిత రీతిలో గౌరవించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్.. క్రాంతి తండ్రి మున్నా సింగ్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్‌కు గర్వకారణమైన తమ ముద్దుబిడ్డ పట్ల ప్రేమను చాటుకుంటూ నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ క్రమంలోనే మున్నా సింగ్ తిరిగి పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరవచ్చని సోమవారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ క్రీడా శాఖా మంత్రి విశ్వాస్ సారంగ్ వెల్లడించారు. ‘‘అథ్లెట్ల పట్ల గౌరవం, వారి బాగోగుల గురించి మా ప్రభుత్వం పట్టించుకుంటుందనేందుకు ఇదే నిదర్శనం.
మా నిర్ణయం వల్ల గౌడ్ కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి లాభం చేకూరకపోవచ్చు. అయితే, తన తండ్రి గౌరవప్రదంగా.. పోలీస్ యూనిఫామ్‌లో రిటైర్ అవ్వాలన్న క్రాంతి కల మాత్రం నెరవేరుతుంది’’ అని పేర్కొన్నారు. కాగా మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేసిన మున్నా సింగ్ 2012లో సర్వీస్ నుంచి తొలగించబడ్డారు.
మున్నా సింగ్‌పై అందుకే వేటు
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో మున్నా సింగ్‌పై వేటు పడింది. ఈ క్రమంలో మున్నా సింగ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడింది. నిలకడైన ఆదాయంలేక చాలీచాలని డబ్బులతో.. ఒక్క పూట భోజనం కూడా దొరకడం కష్టమైన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ క్రాంతి గౌడ్ క్రికెటర్ కావాలన్న తన కలను వదల్లేదు.
ట్విస్టు ఏంటంటే?
కష్టాల కడలిని దాటి భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది. అంతేకాదు వరల్డ్‌కప్ విజయంలోనూ కీలకంగా వ్యవహరించి కీర్తిప్రతిష్టలు సంపాదించింది. ఈ క్రమంలోనే ఆమె తండ్రికి ఉద్యోగం తిరిగి వచ్చింది. అయితే, ఇక్కడే ఓ ట్విస్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్‌డీటీవీ వివరాల ప్రకారం.. జూన్ 8, 2012 నుంచి జనవరి 5, 2026 వరకు మున్నా సింగ్ విధుల్లో లేడు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆయనకు ప్రభుత్వం ‘నో వర్క్, నో పే’ నిబంధనను వర్తింపజేసినట్లు సమాచారం. అంటే.. 2012- 2026 వరకు సర్వీసు కోల్పోయిన మున్నా సింగ్‌కు ఎలాంటి జీతభత్యాలు ప్రభుత్వం చెల్లించదు.
చదవండి: ఆ ముగ్గురిని చూస్తుంటే..: కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు


