నవతరం టెస్టు క్రికెట్‌లో ‘ఫ్యాబ్ ఫోర్’గా టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ లెజెండ్ కేన్ విలియమ్సన్, ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ పేరొందారు. ఈ నలుగురిలో కోహ్లి మాత్రమే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. మిగతా ముగ్గురు సంప్రదాయ ఫార్మాట్లో కొనసాగుతున్నారు.
సచిన్ శతకాల రికార్డుకు చేరువగా
వీరిలో ముఖ్యంగా రూట్ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ మేటి బ్యాటర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) శతకాల రికార్డుకు చేరువవుతున్నాడు. యాషెస్ సిరీస్ 2025-26 ద్వారా ఇటీవలే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ బాదిన రూట్... సిడ్నీ వేదికగా ఐదో టెస్టులోనూ శతక్కొట్టాడు.
టెస్టుల్లో అతడికి 41వ సెంచరీ. తద్వారా టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్ (41)ను సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్ కలిస్ (45) మాత్రమే వీరి కంటే ముందున్నారు.
ప్రస్తుత ఫామ్ దృష్ట్యా రూట్ (Joe Root) త్వరలోనే రెండో స్థానానికి ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకొన్నాళ్లు ఇదే జోరు కొనసాగిస్తే సచిన్ రికార్డును సమం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. కోహ్లిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
లోపాలను సరిచేసుకోకుండా
టెస్టు క్రికెట్‌లో తన లోపాలను సరిచేసుకోకుండా కోహ్లి రిటైర్మెంట్ పేరిట తప్పించుకున్నాడని మంజ్రేకర్ అన్నాడు. టాపార్డర్ బ్యాటర్‌కు ఎంతో సులువైన వన్డే ఫార్మాట్లో మాత్రం కొనసాగుతున్నాడని.. అది తనకు ఏమాత్రం నచ్చలేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘‘టెస్టు క్రికెట్‌లో జో రూట్ రోజురోజు సరికొత్త శిఖరాలు అందుకుంటున్నాడు.
నా మనసు మాత్రం విరాట్ కోహ్లి వెంటే పరుగులు తీస్తోంది. చాలా ముందుగానే అతడు టెస్టుల నుంచి నిష్క్రమించాడు. రిటైర్ అవ్వడానికి ఐదేళ్ల ముందు నుంచి అతడు నిలకడలేమి ఫామ్‌తో సతమతమయ్యాడు. అయినా సరే పట్టువీడకుండా పోరాడాడు.
గత ఐదేళ్లలో అతడి బ్యాటింగ్ సగలు 31. అలాంటపుడు తన లోపాలు సరిచేసుకుని ముందుకు సాగాల్సిందిపోయి గుడ్‌బై చెప్పాడు. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో మరింత గొప్పగా పేరు తెచ్చుకుంటూ ఉంటే కోహ్లి మాత్రం ఇలా చేయడం విచారకరం.
సులువైన వన్డేలలో మాత్రం
విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికినా బాగుండేది. కానీ అతడు టాపార్డర్ బ్యాటర్‌కు ఎంతో సులువైన వన్డేలలో మాత్రం కొనసాగడం మాత్రం నన్ను నిరాశకు గురిచేసింది. నాకు ఇది నచ్చలేదు.
టెస్టు క్రికెట్, టీ20 క్రికెట్.. ఈ రెండు భిన్నమైన సవాళ్లు విసురుతాయి. టెస్టు క్రికెట్ ఓ ఆటగాడిని ఎల్లప్పుడూ పరీక్షిస్తూ ఉంటుంది. కానీ కోహ్లి దానినే వదిలేశాడు. సూపర్ ఫిట్‌గా ఉండి కూడా ఇంకొన్నాళ్లు పోరాడకుండా అతడు అలా సంప్రదాయ ఫార్మాట్‌ను వదిలివేయడం సరికాదు.
ఫస్ల్ క్లాస్ క్రికెట్‌లో ఆడి ఫామ్‌లోకి రావాల్సింది. కచ్చితంగా పునరాగమనంలో అతడు రాణించేవాడే’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
ముప్పై శతకాలతో వీడ్కోలు
కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. అనూహ్య రీతిలో గతేడాది టెస్టులకూ గుడ్‌బై చెప్పేశాడు. తన కెరీర్‌లో 123 టెస్టులు ఆడిన కుడిచేతి వాటం బ్యాటర్.. 30 సెంచరీల సాయంతో 9230 పరుగులు సాధించాడు.
చదవండి: షమీ బౌలింగ్‌ను చితక్కొట్టాడు.. కరీంనగర్ కుర్రాడి డబుల్ సెంచరీ


