బెంగాల్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్ అమన్ రావు పేరాల ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నమెంట్లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. మొహమ్మద్ షమీ (Mohammed Shami) వంటి టీమిండియా సీనియర్ బౌలర్‌తో కూడిన పటిష్ట బెంగాల్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ.. అజేయ ద్విశతకంతో దుమ్ములేపాడు.
చరిత్ర సృష్టించిన అమన్ రావు
తద్వారా హైదరాబాద్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా.. ఓవరాల్‌గా తొమ్మిదో ప్లేయర్‌గా అమన్ రావు చరిత్ర సృష్టించాడు. దేశీ వన్డే టోర్నీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా గ్రూప్-బి నుంచి బెంగాల్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
12 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో
ఓపెనర్లు అమన్ రావు పేరాల, గహ్లోత్ రాహుల్ సింగ్ ఆది నుంచే బెంగాల్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో 154 బంతులు ఎదుర్కొన్న అమన్ రావు 12 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 200 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరోవైపు.. రాహుల్ సింగ్ సైతం అర్థ శతకం (54 బంతుల్లో 65)తో మెరిశాడు.
తిలక్ వర్మ విఫలమైనా
అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ (45 బంతుల్లో 34) మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. మిగతా వారిలో అభిరథ్ రెడ్డి (5), ప్రణవ్ వర్మ (7) విఫలం కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రజ్ఞయ్ రెడ్డి (22) ఓ మోస్తరుగా రాణించాడు.
ఓవైపు వికెట్లు పడుతున్నా అమన్ రావు మాత్రం నిలకడగా ఆడుతూ.. జట్టుకు భారీ స్కోరు అందించడంలో సఫలమయ్యాడు. అతడికి తోడుగా చామా మిలింద్ ఆరు పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో హైదరాబాద్ ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు సాధించింది.
షమీ బౌలింగ్‌ను చితక్కొట్టాడు
బెంగాల్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా.. షాబాజ్ అహ్మద్, రోహిత్ దాస్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా షమీ బౌలింగ్‌లో అమన్ రావు ఫోర్లు, వరుస సిక్సర్లతో చెలరేగడం విశేషం. అంతేకాదు ఆఖరి బంతికి ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో సిక్స్ బాది డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం మరో విశేషం.
కరీంనగర్ కుర్రాడు
కాగా 21 ఏళ్ల అమన్ రావు స్వస్థంల కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో గల వెన్నంపల్లి గ్రామం. ఇటీవల ఐపీఎల్ మినీ వేలం-2026లో రాజస్తాన్ రాయల్స్ రూ. 30 లక్షల కనీస ధరకు ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ను కొనుగోలు చేసింది.


