టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య చెన్నుపల్లి విద్య మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాయుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
మగ బిడ్డతో ఆశీర్వదించబడినందుకు సంతోషంగా ఉందంటూ తల్లీబిడ్డతో సెల్ఫీ తీసుకున్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. విషయం తెలిశాక రాయుడుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు, క్రికెట్ సహచరులు రాయుడును విష్ చేస్తున్నారు.
మాజీ టీమిండియా సహచరులు శిఖర్ ధవన్, హర్భజన్ సింగ్ రాయుడుకు స్పెషల్ విషెస్ తెలిపారు. 40 ఏళ్ల రాయుడుకు తాజాగా జన్మించిన బాబు మూడో సంతానం. బాబు కంటే ముందు అతనికి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. రాయుడు-విద్య దంపతులు 2009లో వివాహం చేసుకున్నారు.
రాయుడు క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. 2013లో వన్డేల ద్వారా టీమిండియా అరంగేట్రం చేసిన ఈ స్టయిలిష్ బ్యాటర్.. 55 వన్డేలు, 6 టీ20లు ఆడి 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1700 పైచిలుకు పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌తో పోలిస్తే రాయుడు ఐపీఎల్ కెరీర్ (204 మ్యాచ్‌ల్లో సెంచరీ, 22 అర్ద సెంచరీల సాయంతో 4348 పరుగులు) అద్భుతంగా సాగింది.
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్, సీఎస్‌కేలో రాయుడు కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. 2023లో రాయుడు ఐపీఎల్ సహా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన రాయుడు దేశవాలీ క్రికెట్‌లో హైదరాబాద్, ఆంధ్ర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.


