ముంబై: ఇదొక విచిత్రమైన పొత్తు. ఎవరూ ఊహించని పొత్తు. రాజకీయంగా బద్ధశత్రువులైన బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం)తో కూడా బీజేపీ జతకట్టింది. మహారాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఈ విచిత్రం చోటుచేసుకుంది. మొత్తానికి ఈ వ్యవహారం సంచలనాత్మకంగా మారింది. అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా స్థానిక నాయకులే పొత్తులు కుదుర్చుకోవడం గమనార్హం. దీనిపై ఆయా పార్టీల అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు.
మున్సిపల్ కౌన్నిళ్లకు డిసెంబర్ 20న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ, కాంగ్రెస్ అకోట్ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ, ఎంఐఎం చేతులు కలిపాయి. మున్సిపాల్టీల్లో పాగా వేయడానికి భిన్నధ్రువాలు ఒక్కటయ్యాయి. అంబర్‌నాథ్ కౌన్సిల్ కుర్చీ కోసం ‘అంబర్‌నాథ్ వికాస్ అఘాడీ’ పేరిట బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ(అజిత్ పవార్) పొత్తు కుదుర్చుకున్నాయి. శివసేన(íÙండే)ను పక్కనపెట్టాయి. మొత్తం 60 సీట్లకు గాను శివసేన(షిండే) 27 సీట్లు గెల్చుకొని ఏకైక అతిపెద్ద పారీ్టగా అవతరించింది.
బీజేపీ 14, కాంగ్రెస్ 12, ఎన్సీపీ(అజిత్ పవార్) 4, స్వతంత్రులు 2 సీట్లు గెల్చుకున్నారు. ఒక స్వతంత్ర కౌన్సిలర్ అఘాడీకి మద్దతు ప్రకటించడంతో కూటమి బలం 31కి చేరింది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే బలం చేకూరింది. మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్‌గా బీజేపీ సభ్యుడు తేజశ్రీ కరాంజులే పాటిల్ ఎన్నికయ్యారు. బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తమ పార్టీ కౌన్సిలర్లు బీజేపీకి మద్దతు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నాయకత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. నూతనంగా ఎన్నికైన 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు బ్లాక్ అధ్యక్షుడు ప్రదీప్ పాటిల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎలాంటి పొత్తు లేదని, రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా స్థానిక నేతలు నిర్ణయం తీసుకున్నారని, దీనికి తమ పార్టీ అధిష్టానం అనుమతి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ బుధవారం చెప్పారు.
బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు: ఒవైసీ
అకోట్ మున్సిపల్ కౌన్సిల్‌లో ‘అకోట్ వికాస్ మంచ్’ పేరిట బీజేపీ, ఎంఐఎం, శివసేన(ఉద్ధవ్), శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్), ఎన్సీపీ(శరద్ పవార్), ప్రహర్ శక్తి పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. 35 సీట్లకుగాను రెండు స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. పొత్తుతో కూటమి బలం 25కు చేరింది. బీజేపీ కౌన్సిలర్ మాయ ధూలే మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. మజ్లిస్‌కు చెందిన నలుగురు సభ్యులు ఆ పార్టీని వదిలేసి తమ పారీ్టకి మద్దతు ఇచి్చనట్లు బీజేపీ ఎంపీ అనూప్ ధాత్రే తెలిపారు. ఈ పరిణామంపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. బీజేపీతో ఎప్పటికీ పొత్తు ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు.
క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి: ఫడ్నవీస్
అనైతిక పొత్తులను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోరని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇతర పారీ్టలతో చేయి కలిపిన బీజేపీ స్థానిక నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా సరే పార్టీ క్రమశిక్షణకు, విధానాలకు కట్టుబడి ఉండాలన్నారు. మరోవైపు శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు బహిర్గతమయ్యాయని విమర్శించారు.


