ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'పైరసీ' అనే భూతంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఎప్పటినుంచో దీని గురించి అందరికీ తెలుసు. కానీ 'ఐ బొమ్మ' సైట్ నిర్వహకుడు రవి అరెస్ట్ కావడంతో మరోసారి చర్చకు కారణమైంది. సామాన్యులు చాలామంది రవికే తమ సపోర్ట్ అని అంటున్నారు. దానికి కారణాలు బోలెడు. నిర్మాతలు ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచేస్తున్నారని, దానికి తోడు థియేటర్లలోనూ పార్కింగ్, తినుబండరాల ధరలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. వీటికి తోడు ఇప్పుడు మరో సమస్య కూడా చేరినట్లు కనిపిస్తుంది.
గత శుక్రవారం 'ద ఫ్యామిలీ మ్యాన్' అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్, అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఓకే ఓకే అనిపించుకుంది. అయితే 50 నిమిషాలుండే ప్రతి ఎపిసోడ్‌లోనూ నాలుగైదు యాడ్స్ వస్తున్నాయని, దీంతో సిరీస్ చూడాలంటే చిరాకు వస్తుందని చాలామంది యూజర్స్.. సోషల్ మీడియాలో తన అసహనం బయటపెడుతున్నారు. యాడ్స్ భరిస్తూ కొందరు చూస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం నిర్ధాక్షిణ్యంగా ఈ కారణం వల్లే పైరసీ సైట్‌లో సిరీస్ చూశానని, అందులో ఒక్క యాడ్ కూడా రాలేదని పోస్టులు పెడుతున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
కొన్నేళ్ల క్రితం జనాలు యూట్యూబ్‌లో వీడియోలు, సినిమాలు చూసేవారు. విపరీతమైన యాడ్స్ రావడంతో.. వాళ్లలో చాలామంది ఓటీటీలకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అమెజాన్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లోనూ యాడ్స్ వస్తున్నాయి. దీంతో డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నాసరే ఈ యాడ్స్ గోలేంట్రా బాబు అని చిరాకు పడుతున్నారు. మరీ 40-50 నిమిషాల ఎపిసోడ్‌కి 4-5 యాడ్స్ రావడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇది ఇలానే జరిగితే ఓటీటీల్లోనూ జనాలు సినిమాలు చూడటం తగ్గించేయడం గ్యారంటీ. అప్పుడు కూడా నష్టపోయేది నిర్మాతలే.
ఓటీటీలు వచ్చిన తర్వాత కొంతమేర పైరసీ తగ్గిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు డబ్బుల కోసం వాళ్లు కూడా యాడ్స్ వేస్తున్నారు. ఇలాంటి అత్యాశ.. మరిన్ని పైరసీ సైట్ల పెంచి పోషించేందుకు కారణమయ్యే అవకాశాలే ఎక్కువ. అమెజాన్ ప్రైమ్ వీడియోనే తీసుకుంటే.. కొన్ని సినిమాల్ని నేరుగా రిలీజ్ చేస్తారు. కొన్నింటిని మాత్రం రెంటల్ బేసిస్(అద్దె విధానం) అని చెప్పి మళ్లీ కొంత డబ్బు చెల్లిస్తేనే చూడటం కుదురుతుందని అంటారు. చాలా ఛానెల్స్ చూపిస్తారు. మళ్లీ వాటిల్లో సినిమాలు చూడాలి అంటే సెపరేట్‌గా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి అంటారు. ఇవన్నీ గత కొన్నిరోజుల నుంచి ఉన్నప్పటికీ.. తాజాగా 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ వల్ల మరోసారి వెలుగులోకి వచ్చాయి.
(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)


