మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ | The Family Man 3 Telugu Review: A Suspense-filled Season with Thrills and Drama | Sakshi
Sakshi News home page

The Family Man 3 Review: నాలుగేళ్ల తర్వాత కొత్త సీజన్.. ఇది ఎలా ఉందంటే?

Nov 21 2025 1:04 PM | Updated on Nov 21 2025 1:23 PM

The Family Man 3 Telugu Review

ఓటీటీలో ట్రెండ్ సెట్ చేసిన వెబ్ సిరీస్‌‌ల్లో 'ద ఫ్యామిలీ మ్యాన్' ఒకటి. దర్శకద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్ తొలి సీజన్ 2019లో రిలీజై సూపర్ హిట్ కాగా 2021లో రెండో సీజన్ వచ్చింది. ఇందులో సమంత  విలన్‌గా చేస్తే దీనికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మూడో సీజన్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సీజన్ తొలి రెండు సీజన్లని మెప్పించేలా ఉందా? ఈసారి శ్రీకాంత్ తివారీ ఎలాంటి అడ్వెంచర్స్ చేశాడనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
ఈశాన్య భారతంలో 'ఆపరేషన్ సహకార్' పేరుతో ప్రధానమంత్రి బసు ఓ ప్రాజెక్ట్ చేపడతారు. అక్కడి లోకల్ రెబల్ గ్రూప్స్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుంటాయి. దీంతో వీళ్లతో సమావేశమయ్యేందుకు ఎన్ఐఏ ఛీప్ కులకర్ణి (దలీప్ తాహిల్), టాస్క్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయ్) నాగాలాండ్ వెళ్తారు. కానీ అనుహ్య పరిస్థితుల్లో కులకర్ణిని బడా డ్రగ్ డీలర్ రుక్మా(జైదీప్ అహ్లవత్), అతడి రెబల్ గ్రూప్, దారిలో కాపుకాసి దారుణంగా చంపేస్తుంది. ఈ ప్రమాదం నుంచి శ్రీకాంత్ తివారీ తీవ్రగాయాలతో బయటపడతాడు. కానీ కులకర్ణి మృతికి ఇతడే ప్రధాన అనుమానితుడు అవుతాడు. ఇన్నాళ్లు పనిచేసిన వ్యక్తులే తనని టార్గెట్ చేయడంతో శ్రీకాంత్, ఫ్యామిలీతో పాటు తప్పించుకుని పారిపోతాడు. తర్వాత ఏమైంది? ఇంతకీ మీరా(నిమ్రత్ కౌర్) ఎవరు? ద్వారక్ అనే ఎన్నారైతో ప్రధానమంత్రి బసు చేసుకున్న ఆయుధాల డీల్‌కి, కులకర్ణి చావుకి సంబంధమేంటి? భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని ఫీనిక్స్ గ్రామాల సంగతేంటి? అనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పేరు చెప్పగానే కామెడీ, క్రేజీ యాక్షన్ గుర్తొస్తుంది. తొలి సీజన్ ముంబై, ఢిల్లీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో జరగ్గా.. రెండో సీజన్ చెన్నై, శ్రీలంకలో జరిగింది. మూడో సీజన్‌కి వచ్చేసరికి మొత్తం సెటప్ మారిపోయింది. ఈశాన్య భారతంలో కథంతా నడిచింది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని ఉద్రిక్త పరిస్థితులు, అక్కడ రెబల్ గ్రూప్స్‌తో కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బందులు, పాకిస్థాన్-మయన్మార్‌తో కలిసి భారత్‌పై చైనా చేస్తున్న కుట్రలు.. ఇలా ఒకటేమిటి చాలా విషయాల్ని మూడో సీజన్‌లో చూపించారు. ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయారు.

మూడో సీజన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బాగుంది. కాకపోతే ఏడు ఎపిసోడ్లలో చాలా విషయాలు చెప్పేందుకు ప్రయత్నించారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రెబల్ గ్రూప్స్‌ని అడ్డుపెట్టుకుని చైనా ఎలాంటి రాజకీయాలు చేస్తోంది. ప్రధానమంత్రి పక్కనుండే వాళ్లు ఇచ్చే సలహాల వల్ల అటు ప్రజలు, ఇటు ఆర్మీ.. ఎలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో చిక్కుకుంది. దేశం కోసం పనిచేసే శ్రీకాంత్ తివారీనే హత్యానేరంలో అనుమానితుడిగా ఎలా కార్నర్ అయ్యాడు. ఇలా ఒక్కొక్కటి నిదానంగా చెబుతూ వెళ్లారు.

గత రెండు సీజన్లలో శ్రీకాంత్ తివారీ చేసే అడ్వెంచర్స్, ఫ్యామిలీ డ్రామా, కొడుకు, కూతురు చేసే హంగామా, తోటి ఉద్యోగి జేకే చేసే కామెడీ ఇలా అన్ని బ్యాలెన్స్‌గా ఉండేవి. కానీ ఈ సీజన్‌లో మాత్రం శ్రీకాంత్ తివారీ పాత్ర నుంచి అవి మిస్ అయిపోయాయి. స్టోరీతో పాటు వెళ్లడం వల్ల శ్రీకాంత్ పాత్ర ఎలాంటి అడ్వెంచర్స్ చేయడానికి వీలుపడదు. మొత్తం ఏడు ఎపిసోడ్లు కలిపి దాదాపు 6 గంటల 14 నిమిషాల నిడివి. ఇందులో యాక్షన్ 20 శాతం ఉంటే డ్రామా 80 శాతం వరకు ఉంటుంది. యాక్షన్ కావాలనుకుని సిరీస్ చూస్తే డిసప్పాయింట్ అవుతారు. లేదు డ్రామా ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు శ్రీకాంత్ తివారీ పాత్రతో ట్రావెల్ అవుతాం.

ఎప్పటిలానే శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో రుక్మా (జైదీప్ అహ్లవత్), మీరా(నిమ్రత్ కౌర్)తో బోలెడన్ని కొత్త పాత్రలు 'ద ఫ్యామిలీ మ్యాన్' ప్రపంచంలోకి ఎంటరయ్యాయి. ఎవరికి వాళ్లు అదరగొట్టేశారు. తొలి సీజన్‌లో కనిపించిన కల్నల్ విక్రమ్ (సందీప్ కిషన్), చెల్లం సార్, మేజర్ సమీర్ పాత్రలు ఈసారి కథలో కీలక మలుపులకు కారణమయ్యాయి. తెలుగు నటులు రవివర్మ, రాగ్ మయూర్ కాసేపు అలా కనిపిస్తారు. రాజ్-డీకే తీసిన 'ఫర్జీ' సిరీస్‌లోని మైకేల్ (విజయ్ సేతుపతి) పాత్ర.. కీలక సమయంలో శ్రీకాంత్ తివారీ పాత్రకు సహాయపడుతుంది. ఈసారి శ్రీకాంత్ భార్య సుచిత్రగా ప్రియమణికి నటించే స్కోప్ పెద్దగా దొరకలేదు. పిల్లలుగా చేసిన ఆశ్లేషా ఠాకుర్, వేదాంత్ సిన్హా ఓకే ఓకే.

టెక్నికల్‌గా చూసుకుంటే మాత్రం స్టోరీ పరంగా చాలా విషయాలు చెప్పాలనుకున్నారు. ఆ విషయంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రాఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరీ గొప్పగా ఏం లేవు గానీ డీసెంట్‌గా ఉన్నాయి. ఏడు ఎపిసోడ్ 'ఎండ్ గేమ్' అనేసరికి స్టోరీని పూర్తి చేస్తారేమో అనుకున్నాం. కానీ చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండానే ముగించారు. శ్రీకాంత్ తివారీ పాత్ర మయన్మార్‌లో ఉండిపోతుంది. విలన్ రుక్మా బుల్లెట్ గాయాలతో తప్పించుకుంటాడు. కథలో ప్రధానమైన ఆయుధాల డీల్ కూడా మధ్యలో ఆగిపోతుంది. ఇలా చాలా విషయాల్ని సస్పెన్స్‌లో పెట్టి సీజన్ ముగించారు. అంటే నాలుగో సీజన్ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. మరి అది ఎప్పుడొస్తుందో చూడాలి?

-చందు డొంకాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement