తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం ‘జన నాయగన్’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని అధికారికంగా నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. మా నియంత్రణకు మించిన అనివార్య పరిస్థితుల కారణంగా జన నాయగన్ సినిమా విడుదల వాయిదా పడిందని సంస్థ స్పష్టం చేసింది. కొత్త విడుదల తేదీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. మీ అందరి మద్దతు మా జన నాయగన్ బృందానికి గొప్ప బలం అని నిర్మాతలు పేర్కొన్నారు.
ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అదే రోజు ఈ చిత్రానికి సంబంధించిన తీర్పు చెప్తామని కోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల వాయిదా పడటంతో నిరాశ చెందారు. అయితే కొత్త విడుదల తేదీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.


