బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని ఈ ఇల్లు సినిమా షూటింగ్‌లకు ప్రత్యేక గమ్యస్థానం. మూడు దశాబ్దాలుగా నిత్యం షూటింగ్‌ల కళకళతో వెలిగిపోతోంది. ఫిలింనగర్‌లో 1985లోనే విశాలమైన ప్లాట్‌లో ఏపీలో గోదావరి జిల్లాలు, గుంటూరు, విజయవాడ, విశాఖ ప్రాంతాల నిర్మాణ శైలికి అనుగుణంగా చక్కని ఇంటిని నిర్మించారు. ఇటీవల సీరియల్స్ షూటింగ్‌లు కూడా జరుగుతున్నాయి.
అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చిరంజీవి నుంచి మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ల సినిమాల వరకు ఈ ఇంట్లో ఏదో ఒక దృశ్యం చిత్రీకరించడం విశేషం. ఆకట్టుకునే నిర్మాణం, విశాల ప్రాంగణం, సహజ వెలుతురు, పచ్చని లాన్‌తో కూడిన ఈ ఇల్లు నిజంగా ‘సినిమా వాళ్ల ఇళ్లు’ అనేలా ఉంది. దర్శక, నిర్మాతలు దీనిని షూటింగ్ లొకేషన్‌గా ఎంచుకోవడంతో రోజూ ఇక్కడ సినిమా సందడి కనిపిస్తుంటుంది. ఇంట్లోని ఆర్కిటెక్చర్, బాల్కనీలు, గార్డెన్ ఏరియా, ఇంటీరియర్ సెటప్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజీతో ఉండడంతో సినిమా సన్నివేశాలకు సహజ వేదికగా మారింది.
ఒకేచోట ఇంటి సన్నివేశాలు, బయటి సన్నివేశాలు చిత్రించే వీలుండడం ప్రత్యేకతగా నిలిచింది. ఈ ఇల్లు.. కెమెరాలు, క్లాప్‌లు, లైట్లు, టెక్నిషియన్ల సందడితో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సెట్‌లాగా మారిపోతుంది. నిజ జీవితంలో నివాసంగా ఉంటూనే తెరపై వేర్వేరు కథలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటివరకు 5 వేలకు పైగా సినిమా షూటింగ్‌లు ఇందులో జరిగాయి. చాలాసార్లు హీరో–హీరోయిన్ల నివాసాలుగా దీనినే చూపించారు. ఇటీవల టీవీ సీరియల్స్ షూటింగ్‌లు కూడా జోరుగా సాగుతున్నాయి.


