క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

తింబం పర్వత రహదారిపై చిరుతపులి

సేలం: ఈరోడ్‌ జిల్లాలోని సత్యమంగళం టైగర్‌ రిజర్వ్‌ కింద ఉన్న అటవీ ప్రాంతం ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్లు, పులులు, గేదెలతో సహా అనేక వన్యప్రాణులకు నిలయంగా ఉంది. తింబం కొండలు 27 హెయిర్‌పిన్‌ వంపులను కలిగి ఉన్నాయి. తింబం కొండలు తమిళనాడు, కర్ణాటకలను కలిపే ముఖ్యమైన రవాణా మార్గం. ఈ పరిస్థితిలో సోమవారం తింబం కొండలలోని రిటైనింగ్‌ గోడపై ఒక చిరుతపులి పడి ఉన్నట్లు కనిపించింది. అటుగా వెళ్తున్న వాహనదారులు రిటైనింగ్‌ వాల్‌పై పడి ఉన్న చిరుతను చూసి షాక్‌ అయ్యారు. కానీ చిరుత మాత్రం పట్టించుకోకుండా రిటైనింగ్‌ వాల్‌పై పడుకుంది. ఆ దారిన వెళుతున్న వాహనదారులు ఈ సంఘటనను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వాహనదారులు తమ వాహనాలను కొద్ది దూరంలో నిలిపివేశారు. దాదాపు గంట తర్వాత చిరుతపులి అడవిలోకి తిరిగి వెళ్లింది. వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. తింపాం కొండలలో ప్రయాణించే డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అటవీ ప్రాంతంలో వాహనాలను పార్క్‌ చేయవద్దు అని హెచ్చరించారు.

ఐదు రూపాయల కోసం ఘర్షణ

తిరువొత్తియూరు: ఉచిత టాయిలెట్‌లో రూ.5 ఫీజు అడిగినందుకు ఏర్పడిన గొడవలో డ్రైవర్‌పై దాడి చేసిన పారిశుధ్య కార్మికుడిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె, ఎంజీఆర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన వేల్మురుగన్‌(45) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను కె.కె.నగర్‌ ఎ.బి.పెట్రోల్‌ రోడ్డులో కారును నిలిపివేసి అక్కడ ఉన్న కార్పొరేషన్‌ ఉచిత పబ్లిక్‌ టాయిలెట్‌కు వెళ్లాడు. బయటకు వచ్చినప్పుడు, అక్కడ డ్యూటీలో ఉన్న పూందమల్లికి చెందిన విజయన్‌ అనే పారిశుధ్య కార్మికుడు టాయిలెట్‌ను ఉపయోగించినందుకు రూ.5 ఇవ్వాలని అడిగాడు. కానీ ఉచిత టాయిలెట్‌ కాబట్టి వేల్మురుగన్‌ డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన విజయన్‌ పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో వేల్మురుగన్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో వేల్మురుగన్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అతని తలకు 4 కుట్లు వేసి చికిత్స చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు మేరకు కె.కె.నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విజయన్‌ను అరెస్టు చేశారు.

నేడు విద్యుత్‌ సమస్యల

పరిష్కార వేదిక

తిరువొత్తియూరు: షోలింగనల్లూరు సర్కిల్‌లో నేడు(మంగళవారం) విద్యుత్‌ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార సమావేశం జరుగుతుందని తమిళనాడు విద్యుత్‌ పంపిణీ సంస్థ తెలిపింది. షోలింగనల్లూరు సర్కిల్‌కు సంబంధించిన విద్యుత్‌ వినియోగదారుల ఫిర్యాదుల స్వీకరణ సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు షోలింగనల్లూరు, చేరన్‌ నగర్‌, పెరుంబాక్కం సబ్‌–స్టేషన్‌ కార్యాలయం దగ్గర ఉన్న కార్యాలయంలో జరుగుతుంది. ఈ సమావేశంలో మాట్వాక్కం, నన్మంగళం, జల్లడియన్‌ పేట్టై, గౌరివాక్కం, పల్లిక్కరణై, కోవిలంబాక్కం, ఎస్‌.3 కొళత్తూరు, నారాయణపురం, చిత్తలపాక్కం, అరసన్‌కళని, పెరుంబాక్కం తదితర ప్రాంతాల విద్యుత్‌ వినియోగదారులు తమ విద్యుత్‌ ఫిర్యాదులను తెలియజేయవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

తిరువొత్తియూరు: నాగర్‌కోయిల్‌లో సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో మహిళ ఒకరు కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన సంఘటన సంచలనం కలిగించింది. కన్యాకుమారి జిల్లా వారపు ప్రజా ఫిర్యాదుల శిబిరం సోమవారం నాగర్‌కోయిల్‌లోని కలెక్టర్‌ కార్యాలయంలో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి దరఖాస్తులు ఇవ్వడానికి వస్తున్నారు. కార్యాలయ ప్రాంగణ ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి వినతిపత్రం సమర్పించే హాలుకు పంపారు. కళైంజర్‌ మహిళల హక్కుల పథకం కింద ఆర్థిక సహాయం కోరుతూ సోమవారం పెద్ద ఎత్తున మహిళలు వినతులు సమర్పించారు. వచ్చిన మహిళల్లో ఒకరు అకస్మాత్తుగా తన వద్ద దాచి ఉంచిన సీసాలోని కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. సకాలంలో గమనించిన పోలీసులు, కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉన్నవారు ఆ మహిళపై నీళ్లు పోసి కాపాడారు. అనంతరం పోలీసులు ఆ మహిళను విచారించారు. అప్పుడు ఆమె కన్యాకుమారి పశ్చిమ జిల్లా పొన్మనైకి చెందిన వారని అంగన్‌వాడీలో పనిచేసిన తనకు ఉద్యోగం పోయిందని, దానిని తిరిగి ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కొంతసేపు అక్కడ కలకలం సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement