కర్లపాక్కం గ్రామస్తుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

కర్లపాక్కం గ్రామస్తుల ఆందోళన

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

కర్లపాక్కం గ్రామస్తుల ఆందోళన

కర్లపాక్కం గ్రామస్తుల ఆందోళన

తిరువళ్లూరు: కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన క్రమంలో మరో 30 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారని వారికి న్యాయం చేయాలని, స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని పలుసార్లు వినతి పత్రం సమర్పించినా అధికారులు స్పందిచడం లేదని ఆరోపిస్తూ కర్లపాక్కం గ్రామస్తులు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. డీఆర్‌ఓతో వాగ్వాదం కారణంగా ఉద్రిక్తత నెలకొంది.

తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూకా కర్లపాక్కం దళితవాడకు చెందిన ఏలుమలై, సుధా అనే ఇద్దరు గత డిసెంబర్‌లో మృతి చెందారు. ఈ సంఘటన అప్పట్లో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అనంతరం అదే గ్రామానికి చెందిన మరో 30 మందికి పైగా వాంతులు విరోచనాలు కలగడంతో వారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించారు. మృతి చెందిన వారికి నిర్వహించిన శవపరీక్షలో కలుషిత నీరే మృతికిగా కారణంగా నిర్ధారించారు. దీంతో అప్పటి నుంచి తమ గ్రామానికి శుద్ధి చేసిన తాగునీటిని అందించాలని, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరుతూ ఇప్పటికే పలుసార్లు కలెక్టర్‌తో సహా పలువురికి వినతి పత్రం అందజేశారు. అయినా ఇంత వరకు న్యాయం జరగలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన గ్రామస్తులు అధికారుల నిర్లక్ష్యంపై నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయానికి చొచ్చుకొని వచ్చి తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న టౌన్‌ పోలీసులు వారిని అడ్డుకుని చర్చలు జరిపారు. అనంతరం వారిని కలెక్టర్‌ వద్దకు తీసుకెళ్లగా, డీఆర్‌ఓ సురేష్‌ చర్చలు జరిపారు. ఈ సమయంలో గ్రామస్తులు తమ గ్రామంలో ఇద్దరు మృతి చెందడానికి, మరో 30 మందికి పైగా అనారోగ్యానికి గురి కావడానికి కలుషిత నీరే కారణమని ఆరోపించారు. అయినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. కనీసం తాగునీరు కూడా శుద్ధి చేసి సరఫరా చేయడం లేదని తెలిపారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు అంటూ వాగ్వాదానికి దిగారు. దాదాపు గంట పాటు డీఆర్‌ఓతో చర్చలు జరిగినా ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో వారిని బయటకు పంపాలని డీఆర్‌ఓ ఆదేశించారు. దీంతో గ్రామస్తులు అధికారుల తీరును నిరసించారు. న్యాయం కోసం వస్తే బయటకు గెంటేస్తారా అంటూ ప్రశ్నించారు. విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన క్రమంలో ఆందోళనకారులు శాంతించారు. ఈ సంఘటనతో దాదాపు రెండుగంటల పాటు కలెక్టర్‌ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement