తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్'.. చెప్పిన తేదీకి థియేటర్లలో రిలీజ్ కావడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి కష్టాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ సమస్య తీరలేదు. నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈరోజు(జనవరి 07) వాదనలు జరిగాయి. తీర్పు రిజర్వ్‌లో పెట్టారు. 09వ తేదీన ఉదయం తుది ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ అసలేమైంది?
(ఇదీ చదవండి: జీవో వచ్చేసింది.. 'రాజాసాబ్' టికెట్ ధర రూ.1000)
రెండు వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు.. 'జన నాయగణ్' చూశారు. మూడు రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్స్ చేయమని మూవీ టీమ్‌కి సూచించారు. అలా చేస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని కూడా చెప్పారు. రెండు రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీమ్ పూర్తి చేశారు. వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేస్తుందనుకుంటే.. రెండు రోజుల తర్వాత కూడా సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్మాణ సంస్థ మరోసారి అడిగింది.
ఇది జరిగిన తొమ్మిది రోజులకు అంటే జనవరి 05న సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ముంబైలోని ఆఫీస్‌ని సంప్రదించాలని సెన్సార్ సభ్యులు.. మూవీ టీమ్‌కి చెప్పారు. దీంతో నిర్మాణ సంస్థ.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో అత్యవసర పిటీషన్ వేసింది. త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పించేలా చూడాలని పేర్కొంది. తాజాగా ఈ విషయమై బుధవారం (జనవరి 07) ఇరువర్గాల మధ్య వాదనలు జరిగాయి.
(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం)
'జన నాయగణ్ చూసిన సభ్యుల్లో ఒకరు.. సినిమాలోని కొన్ని సీన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని రివిజన్ కమిటీ పరిశీలించాలి. తర్వాతే తదుపరి దశకు వెళ్తుంది. మరిన్ని మార్పులు చేయాల్సి వస్తే అది చట్ట ప్రకారం జరుగుతుంది. మూవీ చూసిన తర్వాత అప్పుడు సర్టిఫికెట్ మంజూరా చేస్తాం. మళ్లీ సమీక్షించాలని అవసరం లేదని మీరు(మూవీ టీమ్) కోర్టుకి వచ్చి చెప్పలేరు. చిత్రాన్ని ప్రస్తుతానికి నిలిపి ఉంచాలని సీబీఎఫ్‌సీ ఛైర్ పర్సన్ ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే సమాచారం అందించారు. నిర్మాతలకు కూడా జనవరి 05న ఇదే విషయాన్ని చెప్పారు. సినిమాని కొత్త కమిటీ మరోసారి సమీక్షిస్తుంది. అందుకు మరో 15 రోజులు పడుతుంది. దీనికి అంగీకారమైతే కొత్త కమిటీ ఏర్పాటుకు 20 రోజులు పడుతుంది' అని అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్.. కోర్టులో తన వాదనలు వినిపించారు.
'మీరు చెప్పినట్లే ఇప్పటికే సినిమాలో మార్పులు చేశారు కదా' అని కోర్టు ప్రశ్నించగా.. సభ్యుల్లో ఒకరి నుంచి అభ్యంతరాలు వచ్చాయని, కమిటీ నిర్ణయానికి ఛైర్ పర్సన్ కట్టుబడి ఉంటారని సొలిసిటర్ జనరల్ న్యాయస్థానానికి విన్నవించారు. ఇకపోతే 'జన నాయగణ్' నిర్మాణ సంస్థ కేవీన్ ప్రొడక్షన్స్ తరఫు న్యాయవాది పరాశరన్ తన వాదనలు వినిపించారు.
'మూవీకి సంబంధించిన ఏదైనా సరే 'ఈ-సినీ ప్రమాణ్' పోర్టల్ ద్వారా తెలియజేయాలి. కానీ సెన్సార్ వాళ్లు అలా వ్యవహరించలేదు. తమ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. సభ్యుల్లో ఒకరికి మాత్రమే అభ్యంతరాలున్నాయి. అంటే 4:1 నిష్పత్తిలో ఉంది. మెజార్టీ నిర్ణయం పాజిటివ్‌గానే ఉంది. అలాంటప్పుడు మరోసారి రివ్యూ కోసం ఎలా పంపుతారు? చట్టప్రకారం సెన్సార్ బోర్డ్ తమ విధులని పూర్తిగా విస్మరించింది' అని పరాశరన్ అన్నారు.
ఈయన వాదనలపై స్పందించిన సొలిసిటర్ జనరల్.. సినిమాని మరోసారి సమీక్షించాలని తమకు ఎవరూ చెప్పలేదని, ఛైర్ పర్సన్‌కి నిర్ణయం తీసుకునే అధికారం ఉందని అన్నారు. వాదనలు విన్న జస్టిస్ ఆశా.. తీర్పుని రిజర్వ్ చేశారు. జనవరి 9న తుది ఉత్తర్వులు వెల్లడించనున్నారు. రిలీజ్ తేదీన తుది తీర్పు అంటే.. ఒకవేళ మూవీ టీమ్‌కి అనుకూలంగా వచ్చినా సరే అదే రోజున షోలు పడతాయా? లేదంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు 14వ తేదీకి మూవీ ఏమైనా వాయిదా పడుతుందా అనేది చూడాలి? ఒకవేళ విడుదల తేదీ మారితే మాత్రం 'రాజాసాబ్'కి పోటీ తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల విషయంలోనూ లైన్ క్లియర్ అయ్యే అవకాశముంటుంది.
(ఇదీ చదవండి: ‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?)


