జనవరి 9... ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న డేట్ ఇది. ఆ రోజే ‘ది రాజాసాబ్’ థియేటర్స్‌లోకి రాబోతున్నాడు. రిలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే జనవరి 8న ప్రీమియర్స్‌తో ప్రభాస్ అబిమానుల సందడి ప్రారంభం కానుంది. ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ ఫాంటసీ మూవీ కావడంతో రాజాసాబ్(The Raja Saab)పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ చిత్రం రూ. 1000 కోట్ల వసూళ్లను రాబడుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పట్టుమని పది కూడా లేవు..
ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటికే వేల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చాలావరకు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. కానీ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు మాత్రం పట్టుమని పది కూడా లేవు. పాన్ ఇండియా సినిమాల్లో ఇప్పటివకు దంగల్, బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్, కేజీయఫ్ 2, పఠాన్, జవాన్, పుష్ప 2, కల్కి 2898 ఏడీ, దురంధర్ చిత్రాలు మాత్రమే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. అయితే ఇవన్నీ భారీ యాక్షన్ సినిమాలే. పాన్ ఇండియా ప్రేక్షుకులు మెచ్చే కంటెంట్‌తో విజువల్ వండర్స్‌గా వాటిని తెరకెక్కించారు. కానీ ది రాజాసాబ్ హారర్ కామెడి ఫాంటసీ. ఈ జోనర్ చిత్రాలు ఇప్పటివరకు రూ. 1000 కోట్లు వసూలు చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ రాజాసాబ్ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే.. ఆ ఘనత సాధించిన తొలి హారర్-రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చరిత్రకెక్కుతుంది.

ఆశలన్నీ ప్రభాస్‌పైనే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా రూ. వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయి. ఇక సినిమాకు హిట్ టాక్ వస్తే..బాక్సాఫీస్ షేక్ అవ్వాలిసందే. ఇప్పటికే ఆయన నటించిన రెండు సినిమాలు(బాహుబలి 2: రూ.1800 కోట్లు, కల్కి: రూ.1100 కోట్ల) రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. యావరేజ్ టాక్ వచ్చిన సలార్, సాహో వంటి సినిమాలు కూడా ₹400-700 కోట్ల రేంజ్ లో నిలిచాయి. రాధేశ్యామ్ లాంటి ఫ్లాప్ చిత్రానికి కూడా రూ. 200 కోట్లకు పైగా వసూళ్ల వచ్చాయి. ప్రభాస్ సినిమా అంటే కనీసం రెండు, మూడు వందల కోట్లు గ్యారెంటీ అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఇప్పుడు ‘రాజా సాబ్’ ఆయన కెరీర్‌లో మరో రూ.1000 కోట్ల శిఖరాన్ని చేరుతుందా అన్నదే అసలు ప్రశ్న.

రూ. 100 కోట్లు అంత ఈజీకాదు..
అయితే రాజాసాబ్ రూ. 1000 కోట్ల క్లబ్ చేరడం మాత్రం అంత ఈజీకాదు. సంక్రాంతికి ఈ సినిమాతో పాటు తెలుగులో మరో ఆరు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, విజయ్ ‘జన నాయగన్’ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలాంటి బడాస్టార్ల పోటీని తట్టుకొని రాజాసాబ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకర్షిస్తాడనేదానిపై సినిమా ఫలితం ఆదారపడి ఉంటుంది. ప్రభాస్(Prabhas)కు కలిసొచ్చే అంశాలు ఏంటంటే.. పండగ సీజన్, మిగతా హీరోలతో పోలిస్తే.. పాన్ ఇండియాలో ఆయనకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం. అయితే రాజాసాబ్‌కి హిట్ టాక్ వచ్చినా.. పుష్ప 2 లాగా కేవలం వారం రోజుల్లో రూ. 1000 కోట్లు కొల్లగొట్టడం కష్టమే. ‘ధురంధర్’ లాగా లాంగ్ రన్ సాధిస్తే మాత్రం ఈజీగా రూ. 1000 కోట్ల మార్కుని అందుకుంటుంది.
(ఈ కథనంలో పేర్కొన్న గణాంకాలను GrabOn టీమ్ పరిశీలించి, క్రాస్-వెరిఫై చేసి, ధృవీకరించింది)


