పట్నా: బీహార్‌కు చెందిన రాజకీయ దిగ్గజం, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్ మనుమడు ఆదిత్య(18) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. లాలు కుమార్తె రోహిణీ ఆచార్య.. తన కుమారుడు, లాలు మనుమడు గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది.
తన కుమారుడు ఆదిత్య.. సింగపూర్‌లో రెండేళ్ల పాటు కొనసాగే ప్రాథమిక సైనిక శిక్షణ (బీఎంటీ)లో చేరుతున్నాడని రోహిణీ ఆచార్య తెలిపారు. తన కుమారుడు ఎంతో ధైర్యవంతుడని, అతనిని చూసినప్పుడు తన హృదయం గర్వంతో నిండిపోతుందని రోహిణి పేర్కొన్నారు. ప్రీ-యూనివర్సిటీ చదువు పూర్తి చేసిన తర్వాత, తన పెద్ద కుమారుడు ఆదిత్య దేశ సేవ కోసం కఠిన శిక్షణకు సిద్ధమయ్యాడని ఆమె ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
తన కుమారుడిని ఉద్దేశించి రోహిణి అతనిని ఉత్సాహపరిచే వ్యాఖ్యలు చేశారు. ‘ఆదిత్యా.. నువ్వు ఎంతో ధైర్యవంతుడివి, క్రమశిక్షణ గలవాడివి. వెళ్లు.. నీ సత్తా చాటుకో. జీవితంలో ఎదురయ్యే అత్యంత కఠినమైన పోరాటాల్లోనే నిజమైన వీరులు తయారవుతారని ఎప్పుడూ గుర్తుంచుకో’ అంటూ ఆమె దీవించారు. మా ప్రేమ, ప్రోత్సాహం నీకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె ఆ పోస్ట్‌లో రాశారు. లాలు ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి దంపతుల తొమ్మిది మంది సంతానంలో రెండో కుమార్తె అయిన రోహిణీ ఆచార్య, సమరేష్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరి పెద్ద కుమారుడే ఆదిత్య.
आज मेरा दिल गर्व से भरा हुआ है , आज अपनी प्री - यूनिवर्सिटी ( Pre - University ) की पढ़ाई पूरी करने के बाद 18 साल की उम्र में हमारा बड़ा बेटा आदित्य 2 साल की Basic Military Training के लिए गया है ..
आदित्य .. तुम बहादुर , साहसी और अनुशासन के साथ रहने वाले हो, जाओ कमाल कर दिखाओ… pic.twitter.com/itVx1DPQWi— Rohini Acharya (@RohiniAcharya2) January 5, 2026
సింగపూర్ జాతీయ సేవా (National Service) విధానంలో భాగంగా ఆదిత్య ఈ ప్రాథమిక సైనిక శిక్షణ (బీఎంటీ)లో చేరారు. ఇది యువకుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, పట్టుదల, బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఈ శిక్షణలో అభ్యర్థులు కఠినమైన శారీరక వ్యాయామాలు, ఆయుధాలను వాడటం మొదలైనవి నేర్చుకుంటారు. రెండేళ్ల శిక్షణ తరువాత వారి ర్యాంకును అనుసరించి వారికి 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రిజర్విస్ట్ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. సింగపూర్ చట్టాల ప్రకారం, 18 ఏళ్లు నిండిన ప్రతి యువకుడు రెండేళ్ల పాటు జాతీయ సేవ (National Service)లో శిక్షణ పొందాలి. ఇది అక్కడి చట్టం ప్రకారం తప్పనిసరి. ఆదిత్య సింగపూర్‌లో నివసిస్తున్నందున, అక్కడి నిబంధనలను అనుసరించి ఈ శిక్షణలో చేరారు.
ఇది కూడా చదవండి: 16 ఏళ్ల ఏఐ నిపుణునితో థరూర్ ఏమన్నారంటే..


