16 ఏళ్ల ఏఐ నిపుణునితో థరూర్‌ ఏమన్నారంటే.. | Shashi Tharoor Shares Encounter with 16 year-old AI Tech whiz | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల ఏఐ నిపుణునితో థరూర్‌ ఏమన్నారంటే..

Jan 7 2026 12:12 PM | Updated on Jan 7 2026 12:19 PM

Shashi Tharoor Shares Encounter with 16 year-old AI Tech whiz

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరో ఆసక్తికర అంశంతో వార్తల్లో నిలిచారు. ఆయన తనకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణంలో ఎదురైన అపురూప అనుభవాన్ని బుధవారం సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ ప్రయాణంలో ఆయన 16 ఏళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణుడు రాహుల్ జాన్ అజును కలుసుకున్నారు. ఈ యువ మేధావితో సాగిన చర్చ విజ్ఞానవంతంగా ఉందని థరూర్ పేర్కొన్నారు.

రాహుల్ జాన్ అజును ‘టెక్ విజార్డ్’ గా అభివర్ణించిన థరూర్.. ఆ కుర్రాడు కృత్రిమ మేధస్సు విభాగంలో చేస్తున్న అద్భుతమైన కృషిని కొనియాడారు. కేవలం సాంకేతికతకే పరిమితం కాకుండా, ఏఐ వ్యవస్థలు భౌగోళిక సరిహద్దులన్నింటినీ దాటాలని, ముఖ్యంగా భారతదేశంలోని భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని థరూర్‌ ఆ కుర్రాడికి సూచించారు. దేశంలోని సామాన్యులకు కూడా ఈ సాంకేతికత చేరువ కావాలని వీరిద్దరూ అభిలషించారు.
 

రాహుల్, అతని స్నేహితుడు ఇషాన్ బృందం ఇప్పటికే మలయాళం, హిందీ, ఉర్దూ భాషల్లో వాయిస్ ప్రాసెసింగ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నారని తెలుసుకున్న థరూర్ వారిని అభినందించారు.  ‘రాహుల్’ అనే పేరు తమ ఇంట్లో అందరికీ సుపరిచితమైనదేని అతనితో థరూర్‌ చమత్కరించారు. భారతీయ భాషల్లో ఏఐ వినియోగాన్ని పెంపొందించేలా  కృషి చేయాలని కోరారు. కాగా యువ టెక్నాలజిస్టుల్లోని ఈ ఆవిష్కరణా స్ఫూర్తి భారతదేశ సాంకేతిక భవిష్యత్తుపై గొప్ప ఆశలను కలిగిస్తోందని థరూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ బృందానికి శుభాకాంక్షలు చెబుతూ, ఇలాంటి యువ మేధావులే 21వ శతాబ్దపు కలలను నెరవేరుస్తారని అ‍న్నారు. 

ఇది కూడా చదవండి: Jharkhand: ఏనుగు దాడి.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement