సింఘ్‌భూమ్: జార్ఖండ్‌లోని పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలో అడవి ఏనుగు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఎనిమిది నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. తెల్లవారుజామున గోయిల్కేరా బ్లాక్‌లోని సోవాన్ గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఒక ఏనుగు గ్రామంలోని ఒక గుడిసెపై దాడి చేసి, అందులో నిద్రిస్తున్న వారిని తొక్కి చంపేసింది. ఈ ఘటనలో కుంద్రా బాహదా, అతని కుమార్తె కొద్మా బాహదా, కుమారుడు సాము బాహదా అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదం నుంచి కుంద్రా భార్య తృటిలో తప్పించుకోగా, మరో కుమార్తె జింగీ బాహదా తీవ్ర తల గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలో గత ఆరు రోజులుగా ఏనుగుల దాడులు మరింతగా పెరిగాయి. తాజా మరణాలతో కలిపి ఈ వారంలో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. ఈ తరహా ఘటనల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గోయిల్కేరా బ్లాక్ ఏనుగుల దాడులకు కేంద్రబిందువుగా మారింది. మంద నుండి విడిపోయిన ఒక ఏనుగు గ్రామాల్లోకి చొరబడి ఇళ్లను ధ్వంసం చేస్తూ, నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలను నాశనం చేస్తోంది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
తాజాగా ఏనుగు దాడి జరిగిన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ. 20,000 నగదును అందజేశారు. ఏనుగును అడవిలోకి పంపేందుకు పశ్చిమ బెంగాల్ నుండి ఒక ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించారు. అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్థానికులకు సూచించారు. అటవీ ఆక్రమణలు, ఆహారం లభించకపోవడం తదితర కారణాలతో ఏనుగులు జనావాసాల్లోకి వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఎనిమిదో వింత: కమలంతో కాంగ్రెస్ దోస్తీ!


