ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో ఏ ఒక్కరూ నమ్మని విధంగా భారతీయ జనతా పార్టీ(జేబీజేపీ)- కాంగ్రెస్ జతకట్టాయి. అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ పీఠాన్ని దక్కించుకునేందుకు బద్దశత్రువులైన ఈ ఇరు పార్టీలు ఒక గూటికి చేరాయి. ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు గట్టి షాక్ ఇస్తూ, బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు ఇలా చేతులు కలపడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.
మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అంబర్‌నాథ్ ప్రాంతంలో శివసేనను అధికారానికి దూరం చేసేందుకు ‘అంబర్‌నాథ్ వికాస్ అఘాడీ’ పేరుతో కొత్త కూటమి ఏర్పడింది. గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ (31)కు నాలుగు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రత్యర్థి పార్టీలు ఏకమై శివసేన ఆధిపత్యానికి గండికొట్టాయి. 60 స్థానాలున్న అంబర్‌నాథ్ కౌన్సిల్‌లో బీజేపీ 14, కాంగ్రెస్ 12, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 4 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ మూడు పార్టీలు ఒకటికావడానికి తోడు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కూటమి బలం 32కు చేరింది.
మంగళవారం జరిగిన మున్సిపల్ అధ్యక్ష ఎన్నికల్లో ‘కూటమి’ సమీకరణ అద్భుతంగా పనిచేసింది. శివసేన అభ్యర్థి మనీషా వాలేకర్‌పై బీజేపీకి చెందిన తేజశ్రీ కరంజులే పాటిల్ విజయం సాధించి, అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. బీజేపీ కార్పొరేటర్ అభిజీత్ కరంజులే పాటిల్ ఈ వికాస్ అఘాడీకి నాయకునిగా వ్యవహరించారు. కాగా ఈ విచిత్ర పొత్తుపై వస్తున్న విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలి భర్త, బీజేపీ నేత అభిజీత్ పాటిల్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అంబర్‌నాథ్‌లో వేళ్లూనుకున్న అవినీతి రాజకీయాల నుంచి ఇక్కడి ప్రజలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమన్నారు.
బీజేపీ-కాంగ్రెస్ కలయికపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. దీనిని అనైతిక, అవకాశవాద రాజకీయానికి పరాకాష్టగా అభివర్ణించింది. అంబర్‌నాథ్ శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినికర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అని నినదించిన బీజేపీ, అధికారం కోసం ఇలాంటి పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ తానుగా కాంగ్రెస్‌తో చేతులు కలిపిందని ఆయన ఆరోపించారు.
ఇది కూడా చదవండి: సత్యసాయి బాటలో వెనెజువెలా నేతలు.. కారణం ఇదే..


