ఎన్‌కౌంటర్‌ కలకలం! | Rumors of encounter in Karregutta on border of Telangana, Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌ కలకలం!

Feb 20 2026 4:41 AM | Updated on Feb 20 2026 4:41 AM

Rumors of encounter in Karregutta on border of Telangana, Chhattisgarh

కర్రెగుట్టల్లో కీలక నేత సహా ఐదుగురు మృతి చెందినట్లు వదంతులు 

అధికారికంగా ధ్రువీకరించని పోలీసులు 

అగ్రనేతలు లక్ష్యంగా కర్రెగుట్టలు, అడవుల జల్లెడ 

మూడు రాష్ట్రాల సరిహద్దులో టెన్షన్‌.. టెన్షన్‌  

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్‌ వదంతులు కలకలం రేపాయి. సీపీఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ కీలక నేతతో పాటు మరో నలుగురు మృతి చెందారన్న పుకార్లు గురువారం ఉదయం నుంచి షికార్లు చేశాయి. కర్రెగుట్టల ప్రాంతంలో కొద్దిరోజులుగా మావోయిస్టు పార్టీ కీలక నేతలు, దళాలు సంచరిస్తున్నాయన్న సమాచారం మేరకు కేంద్ర బలగాలు కూంబింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గోదావరి పరీవాహక ప్రాంతం, జేఎస్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల అడవులను బుధవారం పోలీసు బలగాలు చక్రబంధం చేశాయి. 

ఓ వైపు ఛత్తీస్‌గఢ్, కేంద్ర బలగాలు.. కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. మరోవైపు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్‌ అలియాస్‌ చొక్కారావు, ఆయన వెంట ఉన్న సాయుధుల కోసం తెలంగాణ పోలీసులు బుధవారం నుంచి గాలింపు ముమ్మరం చేశారు. మూడు రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారులపై పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. కూంబింగ్‌ ముమ్మరంగా కొనసాగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతోందన్న ఆందోళనకర పరిస్థితి అటవీ సరిహదు ప్రాంతాల్లో నెలకొంది.  

ఆ నేతలు లక్ష్యంగా కూంబింగ్‌.. 
వచ్చే నెల 31తో ఆపరేషన్‌ కగార్‌ ముగియనుంది. ఇప్పటికే కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు అలియాస్‌ గంగన్న సహా పలువురు కీలక నేతలు, మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో అసువులు బాయగా.. కేంద్ర కమిటీలో సారథ్యం వహించిన పలువురు నేతలు, సభ్యులు లొంగిపోయారు. ఈ ఆపరేషన్‌కు మరో 40 రోజులే గడువు ఉండటంతో మిగిలిన మావోయిస్టు నేతలు, దళాలు లక్ష్యంగా ఐదారు రోజులుగా కేంద్ర సాయుధ బలగాలు దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ చీఫ్‌ దేవ్‌ జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్, ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి సహా సుమారు 50 మంది లక్ష్యంగా ఇప్పుడు దండకారణ్యం, కర్రెగుట్టలలో కూంబింగ్‌ సాగుతోందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు గురువారం రాత్రి వరకు ప్రచారం జరిగింది. అయితే విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.  

లొంగుబాటలో దామోదర్, టీం!  
ములుగు జిల్లా కాల్వపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్‌ అలియాస్‌ చొక్కారావు, అతని బృందం త్వరలోనే తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని తెలిసింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు ఆయన భూపాలపల్లి, ములుగు అడవుల్లో దళాలతో కలిసి తిరిగినట్లు చెబుతున్నారు. కాల్వపల్లి, దాని శివారు ప్రాంతాలకు చెందిన వారిని కూడా కలిసినట్లు ప్రచారం ఉండగా.. ఆయన తెలంగాణ సరిహద్దులోనే ఉన్నారని రాష్ట్ర పోలీసు వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు రోజులుగా మూడు రాష్ట్రాలను కలిపే తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రహదారులపై పికెట్లు పెట్టడం, అడవులను దిగ్భంధనం చేయడం చర్చనీయాంశంగా మారింది. దామోదర్, ఆయన టీం లొంగుబాటుపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.  

మావోయిస్టుల స్తూపాలు ధ్వంసం 
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్‌ పరిధి సేనంపెంట అటవీ ప్రాంతంలో మావోయిస్టుల స్తూపాలను భద్రతా బలగాలు గురువారం ధ్వంసం చేశాయి. మూడు రోజుల క్రితం కూడా పలు స్తూపాలు కూల్చివేయగా, 2010లో మృతి చెందిన మావోయిస్టు నేత భామున్‌ స్మారకంగా ఏర్పాటు చేసిన స్తూపాన్ని సైతం గురువారం కూల్చివేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement