2029 నాటికి దేశంలో ఎక్కడా కాంగ్రెస్‌ పాలన ఉండదు | Bandi Sanjay Shocking Comments On Congress party | Sakshi
Sakshi News home page

2029 నాటికి దేశంలో ఎక్కడా కాంగ్రెస్‌ పాలన ఉండదు

Feb 20 2026 4:37 AM | Updated on Feb 20 2026 9:11 AM

Bandi Sanjay Shocking Comments On Congress party

త్వరలో మంత్రుల కమీషన్ల చిట్టా.. 

ఐఏఎస్‌ల దందాలు బయటపెడతాం: బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) కాదని...అది తెలంగాణ కరప్షన్, కమీషన్, కలెక్షన్‌ కాంగ్రెస్‌ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. వివిధ దర్యాప్తు సంస్థల అధికారులు రాష్ట్ర మంత్రుల అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నారని, మంత్రుల అవినీతికి కొందరు ఐఏఎస్‌ అధికారులే మధ్యవర్తులుగా ఉన్నారని, అతి త్వరలో మంత్రుల కమీషన్ల చిట్టాతోపాటు ఐఏఎస్‌ అధికారుల దందాలన్నీ బయటపెడతామని సంజయ్‌ హెచ్చరించారు. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బండి సంజయ్‌ సమక్షంలో కరీంనగర్‌ 10వ డివిజన్‌ ఇండిపెండెంట్‌ కార్పొరేటర్‌ సౌగాని కొమరయ్య పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పాలన ఉండదన్నారు. మంత్రి పదవులను అడ్డుపెట్టుకుని బరితెగించి రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవాలని చూస్తే వారి సంగతి చూస్తామన్నారు. మంత్రుల మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలయ్యేలా చేస్తామన్నారు. తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేశారన్నారు. కరీంనగర్‌ స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కాషాయ జెండాను ఎగరేస్తామన్నారు. 

ఢిల్లీ పర్యటనలతో పాలన గాలికి... బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు 
ఢిల్లీ పర్యటనలు, చిట్‌ చాట్‌లతో పబ్బం గడుపుతూ సీఎం రేవంత్‌ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసారని బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు విమర్శించారు.ఎన్నికలు రాగానే అమలు కాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. విద్యాశాఖను స్వయంగా సీఎం చూస్తున్నా ఎలాంటి మార్పు లేదని, గత ప్రభుత్వం రెసిడెన్షియల్‌ స్కూళ్ల పేరుతో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తే రేవంత్‌ ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ అంటూ డ్రామాలు ఆడుతూ విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందన్నారు. కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడమంటే భవిష్యత్‌ తెలంగాణ బీజేపీదేనని అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది మేధావులు త్వరలో పార్టీలో చేరేందుకు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని రాంచందర్‌రావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement